Srikakulam: ఈ నెల 29న పాఠశాలల ఎస్ఎంసీ పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు
Srikakulam: శ్రీకాకుళంలో ఈ నెల 29న ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణ. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని డీఈఓ రవిబాబు పిలుపు.
Srikakulam: ఈ నెల 29న పాఠశాలల ఎస్ఎంసీ పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు
శ్రీకాకుళం: పాఠశాలల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్ఎంసీ) ఏర్పాటుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వేణుగోపాలరావు పిలుపునిచ్చారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 29న ఎస్ఎంసీ పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు-2026, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ఎంతో పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, హెచ్‌ఎంలను ఆదేశించారు.
ఎన్నికల ప్రణాళికలో భాగంగా సెప్టెంబరు 15న ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, 18న మధ్యాహ్నం 2 గంటలకు ప్రాథమిక ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారని వివరించారు. ఈ జాబితాపై 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తారని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు తుది జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు.
పోలింగ్ రోజైన 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యుల ఎన్నిక, 1.30 గంటలకు ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం, 3 గంటలకు నూతన కమిటీ తొలి సమావేశం జరుగుతుందని సూచించారు.




