Etcherla: పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి!
Etcherla: శ్రీకాకుళం రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బుధవారం పరిశీలించారు.
Etcherla: పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి!
శ్రీకాకుళం: శ్రీకాకుళం రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో బుధవారం ఎచ్చెర్ల మండలంలో ఎస్.ఎం.పురం, పొందూరు మండలంలో లోలుగు తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అభ్యర్థులు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ నామినేషన్లు దాఖలు చేసుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల పరిధిలో నిబంధనల మేరకు పోలీసు ఆంక్షలు అమలు చేస్తూ, పోలీసు యాక్ట్ 30, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేయాలని సూచించారు.
నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర పోలీసు నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు వాహనాల మళ్లింపు చేపట్టాలని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రతి కదలికను నిశితంగా గమనించాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించరాదని సూచించారు.
13 మండలాల్లో మూడు రోజుల పాటు కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావులేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యర్థి తన నామినేషన్ను స్వేచ్ఛగా దాఖలు చేసుకునే విధంగా పోలీసు యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.




