Srikakulam: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్!

Srikakulam: శ్రీకాకుళం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరిక. 100 మీటర్ల పరిధిలో ప్రచారం, మొబైల్స్‌పై నిషేధం. ఉల్లంఘిస్తే జైలు శిక్ష.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 31 Oct 2026 6:09 PM IST
Srikakulam
X

Srikakulam: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్!

శ్రీకాకుళం: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026 ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 1న ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, అవసరమైతే నవంబరు 2న రీ-పోలింగ్‌, నవంబరు 3న ఉదయం 8.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు.

పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, ఓట్లు అడగడం, జెండాలు, పోస్టర్లు ప్రదర్శించడం పూర్తిగా నిషేధమని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశీలకులు, ఎన్నికల, భద్రతా సిబ్బంది మినహా ఎవరూ 100 మీటర్ల పరిధిలోకి మొబైల్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లను తీసుకురాకూడదని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారిక భద్రత కలిగిన వ్యక్తులు సైతం తమ సెక్యూరిటీ సిబ్బందితో పోలింగ్‌ బూత్ లోపలికి ప్రవేశించరాదని, కేవలం ఓటు వేయడానికి మాత్రమే కేంద్రానికి రావాలని తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల/పోలింగ్ ఏజెంట్లుగా నియమించరాదన్నారు.

పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల ఆవల మాత్రమే అధికారుల అనుమతితో ఒక టేబుల్, రెండు కుర్చీలు, గొడుగు లేదా టార్పాలిన్‌తో బూత్‌లను ఏర్పాటు చేసుకోవాలని, ఓటర్లకు ఇచ్చే స్లిప్పులపై అభ్యర్థి పేరు గానీ, పార్టీ గుర్తు గానీ ఉండకూడదని తేల్చిచెప్పారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేసినా లేదా తీసుకున్నా ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి, ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించడం నేరమని, ఉల్లంఘిస్తే వాహనాలను జప్తు చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు.

ఎన్నికల నేపథ్యంలో పట్టణ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను అక్టోబరు 30 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు (డ్రై డేస్) ప్రకటించారు. ఎవరైనా అక్రమంగా రూ.50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే ఆధారాలు లేనిపక్షంలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఓటర్లు ఎటువంటి భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా ఆమోదిత గుర్తింపు కార్డుతో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ నంబరు 9491222122 అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.