Srikakulam: ధరల భారంతో సామాన్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నం: ధర్మాన!

Srikakulam: నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు, విద్యుత్ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదలతో సామాన్యుల కుటుంబ బడ్జెట్ ఛిన్నాభిన్నమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 15 Nov 2026 2:16 PM IST
Srikakulam
X

Srikakulam: ధరల భారంతో సామాన్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నం: ధర్మాన!

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.., ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో గొప్పగా తీర్చిదిద్దాలన్నది ఒక అంశమే గాని, అది ప్రజలను మోసగించే చర్యగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇలాంటి లాంగ్ టర్మ్ విజన్ గురించి చెప్పేముందు, రాష్ట్రంలో ప్రజలు తమ సాధారణ జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అన్నది కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన విషయం.

ఒక సామాన్యుడు తన సంపాదనతో హాయిగా జీవించగలుగుతున్నాడా లేదా అన్నది కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన విషయమే. తన డబ్బుతో తన కుటుంబ సభ్యుల కడుపు నింపగలిగే తృప్తి వాడికి మిగలాలి. అలాంటి పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించి, సామాన్య ప్రజలు జీవనం సాగించేలా చూడాలి. రాష్ట్రంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్, బస్ కండక్టర్, రోజువారీ వేతనంతో పనిచేసే కూలీ, కలాసీ, ఒక రైతు కూలీ.. ఏ రోజు సంపాదనతో ఆ రోజు ఆ కుటుంబ సభ్యులందరూ మార్కెట్లో వస్తువులు కొనుక్కొని, ఏ విలాసవంతమైన జీవితం అవసరం లేదనుకొని, కేవలం కడుపు నిండితే చాలు, తెల్లవారితే మళ్లీ కష్టపడదాం, రేపటి రోజు గురించి ఆలోచిద్దాం అనుకునే వారికి కూడా వారి జీవనం గడవాలంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటే, ఆ రాష్ట్ర పరిస్థితి పూర్తిగా అధ్వానంగా ఉన్నట్టుగా మనం భావించాలి.

ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న అతి తక్కువ సంపాదన కలిగిన వర్గాలు, గతంలో నేను పేర్కొన్నటువంటి రోజువారీ వేతనాలు సంపాదించేవారు, రోజు వేతనం అందుకుంటున్న కార్మికులు.. ఇలాంటి వారి పరిస్థితి మీరు చూస్తే, మార్కెట్‌కు తమ జేబులో ఉన్న డబ్బులు తీసుకెళ్లి, తాము కొనాలనుకున్న ఏ వస్తువునూ కొనలేని పరిస్థితి ఉంది. అబద్ధాలు చెప్పడం, 2050 నాటికి ఈ రాష్ట్రం నెంబర్ వన్ అయిపోతుందని చెప్పడం.

2024 సాధారణ ఎన్నికల్లో నువ్వు ఓటు వేయమని అప్పుడు అడిగినటువంటి మాటలు ఏంటి? ప్రజలకు ఏమిస్తానని చెప్పి, మీరు ఏం మాట ఇచ్చి ఓటు వేయించుకున్నారు? తర్వాత ఏం జరిగిందో మీరు పట్టించుకున్నారా, గుండెకు బేలెత్తించే రేట్లతో ప్రజలు సతమతమైపోతున్నారు. ఒకవైపు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రజలు మూడు లక్షల కోట్ల బడ్జెట్‌కు నిధులు సమకూరుస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా సాధారణమైన జీవనం సాఫీగా నడుస్తుందా? ఎలా జీవించాలి? ఇంటిల్లిపాదికి నా ఆదాయంతో కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి వచ్చిందని పేదవాడు గోల పెడుతుంటే, ఈ రాష్ట్రం నెంబర్ వన్ అయిపోతుందని అంటున్నాడు చంద్రబాబు. అలా ఎప్పుడు అవుతుంది అంటే, నేను పేర్కొన్న ఈ తరాలు ఏవీ లేకపోతే అవుతుంది.

చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? చాలా అన్యాయమైనటువంటి పాలన రాష్ట్రంలో సాగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలను ఒకసారి పరిశీలించినట్లయితే, 2024లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడానికి ముందు ఉన్న ధరలు, ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

బియ్యం (సూపర్ ఫైన్) అప్పట్లో కిలో రూ.50 ఉంటే, ఈరోజు రూ.85 ఉంది. కామన్ బియ్యం అప్పట్లో రూ.45 ఉంటే, ఇప్పుడు రూ.75 ఉంది. కందిపప్పు రూ.160 ఉంటే ఇప్పుడు రూ.185 ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలు ఏ వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితిలో కూడా లేరు. తమ ఆదాయంతో తమ కుటుంబ సభ్యులకు కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. గుండె గుబేలుమనే విధంగా ధరలు పెరిగి సామాన్యుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే, మీరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.

పెట్రోల్ ధర రూ.109 ఉంటే, ఈరోజు రూ.118 అయింది. డీజిల్ ధర రూ.95 ఉంటే, ఇప్పుడు రూ.105 అయింది. గ్యాస్ సిలిండర్ ధర రూ.850 ఉంటే, ఇప్పుడు రూ.975 అయింది. అప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉంటే, చంద్రబాబు వచ్చిన తర్వాత హోటళ్లకు మొదటిసారిగా 50 శాతం పెరుగుదల చేశావు. ట్రూ-అప్ పేరుతో రూ.20 వేల కోట్ల భారం ప్రజలపై వేశావు.

రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయానికి వస్తే, ఇప్పుడు భూములు అమ్మినప్పుడు వాస్తవ ధర కంటే ఎక్కువ రేట్లు నిర్ణయించేశారు. మూడు సంవత్సరాల్లో రెండు సార్లు పెంచావు. అమ్మాలనుకున్నవాడు అమ్ముకోలేని పరిస్థితి, కొనాలనుకున్నవాడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను పెద్ద ఎత్తున పెంచుకునే అవకాశం ఇచ్చేశారు. 40 శాతం ఫీజుల పెరుగుదల, కాలేజీ ఫీజుల్లో కూడా 40 శాతం పెరుగుదల. ఇక సామాన్యుడు ఎలా భరించగలడు?, మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వానికి, హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిన ప్రభుత్వానికి ఓటమి ద్వారానే మన అసమ్మతిని, అసంతృప్తిని తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో ఈ అంశాలను ఆలోచించాలని కోరుతున్నాను. ప్రతిరోజూ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి నేను చెబుతాను. తగిన విధంగా వాస్తవాలను తెలుసుకొని స్పందించాలని కోరుతున్నాను అని మాజీ మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.