Lakkavaram: కొత్త రహదారి ప్రారంభం.. ప్రభుత్వ విప్ అశోక్ బాబుకు ఘన స్వాగతం
Lakkavaram: సోంపేట మండలం లక్కవరం గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన నూతన రహదారిని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు.
Lakkavaram: కొత్త రహదారి ప్రారంభం.. ప్రభుత్వ విప్ అశోక్ బాబుకు ఘన స్వాగతం
లక్కవరం: సోంపేట దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి కల సాకారమైంది. కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రహదారి ప్రారంభోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలుకగా, మహిళలు పూల వర్షం కురిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – సంక్షేమ విజయాలు.. ప్రజాపాలన – ఇంటింటికీ అభివృద్ధి" కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన లక్కవరం గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన అశోక్ బాబు, గార రమణమూర్తి, బీవన నాగేశ్వరరావు, పండి శంకరరావు, ఆనంద్ తదితర కుటుంబాలను కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
లక్కవరం గ్రామానికి దశాబ్దాలుగా ఉన్న రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని అశోక్ బాబు తెలిపారు. సుమారు కోటి రూపాయలతో గ్రామానికి ఇరువైపులా రింగు రోడ్లతో కూడిన నూతన రహదారిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. శంకుస్థాపన చేసిన ఆరు నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి ప్రారంభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మిగిలిన రహదారి పనులను కూడా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీకి మంజూరైన నూతన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు.
ఫిర్యాదులపై అక్కడికక్కడే స్పందన గ్రామంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణలో వచ్చిన సమస్యలపై అశోక్ బాబు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్టీసీ బస్సులు గ్రామంలో నిలపడం లేదని మహిళలు ఫిర్యాదు చేయడంతో, అక్కడి నుంచే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ వీధిలో తాగునీటి సమస్యను పంచాయతీ నిధులతో తక్షణమే పరిష్కరించాలని కార్యదర్శికి సూచించారు. కొత్త పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలకు సంబంధించిన అర్హుల సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంతో ఆప్యాయ అనుబంధం లక్కవరం గ్రామానికి వచ్చిన ప్రతిసారీ ప్రజల నుంచి లభించే ఆదరణ తనకు మరింత బాధ్యతను పెంచుతుందని అశోక్ బాబు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ నూతన రహదారిపై నడిచి నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతుల కల్పనలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, కంచిలి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి మద్దిల నాగేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సురాడ చంద్రమోహన్, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీను, ఐటీడీపీ మండల అధ్యక్షుడు బెజ్జో ప్రదీప్, బుద్దేస్, జుత్తు పురుషోత్తం, బీన ఆనంద్, ఈశ్వరరావు, బతకల జోగారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




