Kanchi: మండలం జాడపూడి కేజీబీవీలో నూతన అదనపు తరగతి గదుల భవనం ప్రారంభం!
Kanchi: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ బి. అశోక్ బాబు కంచిలి మండలం జాడపూడి కేజీబీవీలో అదనపు తరగతి గదులను ప్రారంభించి, విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు.
Kanchi: మండలం జాడపూడి కేజీబీవీలో నూతన అదనపు తరగతి గదుల భవనం ప్రారంభం!
కంచిలి: కంచిలి విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే బలమైన పునాదని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బి. అశోక్ బాబు అన్నారు.
కంచిలి మండలం జాడపూడి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నేరుగా పదో తరగతి గదిలోకి వెళ్లిన డాక్టర్ అశోక్ బాబు కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించడంతో పాటు, నోట్‌బుక్‌లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఉపాధ్యాయుడి పాత్రలోనూ విద్యార్థులను ప్రోత్సహించిన ఆయన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రతి విద్యార్థి కష్టపడి కాదు... ఇష్టపడి చదవాలి. కుటుంబ పరిస్థితులను గుర్తుంచుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. విద్యే జీవితాన్ని మార్చే శక్తి. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు అందించేందుకు కట్టుబడి ఉంది" అని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల వసతి గృహం, వంటశాల, పరిసరాలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రిన్సిపాల్ పి. వాణికుమారి, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజనం, పారిశుద్ధ్యం, విద్యా సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, మాజీ సర్పంచ్ పిలక చిన్నారావు, కంచిలి మండల విద్యాశాఖ అధికారి సప్పటి శివరాం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




