Tekkali: కాంతమ్మ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. మాజీ ఎమ్మెల్యే

Tekkali: టెక్కలి నియోజకవర్గంలో ఎరువుల క్యూ లైన్‌లో నిలబడి మహిళా రైతు కాంతమ్మ మృతి చెందడంపై వైఎస్సార్సీపీ నేత రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 17 July 2026 12:49 PM IST
Tekkali
X

Tekkali: కాంతమ్మ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. మాజీ ఎమ్మెల్యే

Tekkali: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్య వైఖరి వల్లే టెక్కలి నియోజకవర్గంలో ఎరువుల కోసం క్యూ లైన్‌లో నిలబడి మహిళా రైతు కాంతమ్మ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంతమ్మ మృతి కేవలం ప్రమాదం కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన "ప్రభుత్వ హత్యే" అన్నారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు పొలాల్లో ఉండాల్సిన సమయంలో, ఎరువుల కోసం రోడ్లపై గంటల తరబడి, రోజుల తరబడి క్యూ కట్టేలా చేయడం దుర్మార్గం. కొత్తగా ప్రవేశపెట్టిన APAIMS 2.0 యాప్ లోని సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలు, ఓటీపీ విధానం వల్ల రైతులు నరకం చూస్తున్నారు. కనీస ముందస్తు ప్రణాళిక లేకుండా ఇటువంటి తుగ్లక్ విధానాలు రుద్దడం వల్లే ఈరోజు ఒక ప్రాణం పోయింది. కౌలు రైతులకు అసలు ఎరువులే దక్కని పరిస్థితి ఏర్పడింది.

సొంత జిల్లాలోనే రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ప్రాణాలు విడుస్తుంటే జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. యూరియా, డీఏపీ కొరత సృష్టించి బస్తా యూరియాపై అదనంగా రూ.300 వరకు వసూలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. అధికారులు ధరలు ఎక్కువగా ఉండే కాంప్లెక్స్ ఎరువులు వాడాలని చెబుతుండటంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు అప్పులపాలవుతున్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబుకు అనుభవం ఉంది అని ప్రగల్భాలు పలకడమే తప్ప, ఆ అనుభవం రాష్ట్ర ప్రజలకు లేదా రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని, కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను, ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్బీకే (RBK)ల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నేరుగా వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అథోగతి పాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా తక్షణమే APAIMS 2.0 యాప్ సమస్యలను పరిష్కరించాలని, యూరియా, డీఏపీ మరియు ఇతర ఎరువులను తగినంత నిల్వ ఉంచి వెంటనే పంపిణీని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story