Kanchili: భవాని ఐటీఐలో ఫీజుల దోపిడీ, స్కాలర్‌షిప్ దందా!
Kanchili: కంచిలి భవాని ప్రైవేట్ ఐటీఐ కాలేజీ అక్రమ వసూళ్లపై వైఎస్సార్‌సీపీ నేత సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు.
Kanchili: భవాని ఐటీఐలో ఫీజుల దోపిడీ, స్కాలర్‌షిప్ దందా!
కంచిలి: మండలంలోని భవాని ప్రైవేట్ ఐటీఐలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఉపకార వేతనాల వినియోగంలో అవకతవకలు, మౌలిక వసతుల కొరత తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా ప్రజా ఫిర్యాదుల (గ్రీవెన్స్) కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి , కంచిలి మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు భవాని ఐటీఐ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌కు ఫిర్యాదులు అందజేశారు.
సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల కళాశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల లేమిపై తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలపై వచ్చిన ఫిర్యాదులతో పాటు కళాశాల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు మాట్లాడుతూ, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటువంటి ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సంబంధిత అంశాలపై నిష్పాక్షిక విచారణ జరిపి, తప్పులు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తమ మండలంలో ఒక్క విద్యార్థికైనా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని అన్నారు.
భవాని ఐటీఐలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న వ్యవహారాలపై కథనాలు ప్రచురించిన ఉద్దానం సంపాదకుడికి పోలీసు నోటీసులు జారీ చేసిన అంశాన్ని కూడా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు గ్రీవెన్స్‌లో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు ఎన్. ఈశ్వరరావు, సత్యం నాయుడు,బావన శ్రీకాంత్, నూతలపాటి బాబురావు, గొనప రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




