4G Smartphones: భారత్‌లో 4G స్మార్ట్‌ఫోన్లకు మళ్లీ పెరిగిన డిమాండ్: 5G ధరలే ప్రధాన కారణం!

4G Smartphones: 5G స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగడంతో భారతీయ మార్కెట్‌లో పుంజుకున్న 4G ఫోన్ల విక్రయాలు. పూర్తి వివరాలు వెల్లడించిన కౌంటర్‌పాయింట్ రీసెర్చ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 8:42 AM IST
4G Smartphones
X

4G Smartphones: భారత్‌లో 4G స్మార్ట్‌ఫోన్లకు మళ్లీ పెరిగిన డిమాండ్: 5G ధరలే ప్రధాన కారణం!

4G Smartphones: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మందగించినప్పటికీ, 2026లో 4G స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు ఏడాది ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందే అవకాశముందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'కౌంటర్‌పాయింట్' (Counterpoint Research) వెల్లడించింది. 2025లో 4G ఫోన్ల విక్రయాలు ఏకంగా 48 శాతం పడిపోయినప్పటికీ, 2026లో మార్కెట్ మళ్లీ పుంజుకోవడం విశేషం. మొత్తం స్మార్ట్‌ఫోన్ విపణిలో 4G వాటా 2025లోని 11 శాతం నుండి 2026 నాటికి 13 శాతానికి, అలాగే 2027 నాటికి 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

స్మార్ట్‌ఫోన్ విడిభాగాల (Components) ధరలు పెరగడం వల్ల 4G మరియు 5G మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం చాలా పెరిగింది. దీనివల్ల 5G ఫోన్ల ధరలు సామాన్యులకు భారం కావడంతో, బడ్జెట్ వినియోగదారులు తిరిగి 4G ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కేవలం తక్కువ ధర (ఎంట్రీ-లెవల్) విభాగానికే పరిమితం కాకుండా, రూ. 10,000 నుండి రూ. 20,000 ధరల శ్రేణిలో 4G స్మార్ట్‌ఫోన్లకు ఊహించని డిమాండ్ ఏర్పడిందని కౌంటర్‌పాయింట్ సీనియర్ విశ్లేషకులు ప్రాచిర్ సింగ్ తెలిపారు. 5G అదనపు ధర చెల్లించకుండానే మెరుగైన కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులు ఈ విభాగాన్ని ఎంచుకుంటున్నారు.

వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రముఖ ఫోన్ తయారీ సంస్థలు (OEMs) కూడా తమ 4G ఉత్పత్తుల శ్రేణిని భారీగా పెంచుతున్నాయి. రూ. 10,000 నుంచి రూ. 20,000 బడ్జెట్‌లో 4G మోడళ్లను అందించే కంపెనీల సంఖ్య 2025లో కేవలం రెండే ఉండగా, 2026 నాటికి ఆ సంఖ్య ఏకంగా 12కు పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో కూడా విడిభాగాల ధరలు వెంటనే తగ్గే సూచనలు లేకపోవడంతో, రూ. 20,000 లోపు విభాగంలో 4G ఫోన్లు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయని కౌంటర్‌పాయింట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్