Google: గూగుల్‌లో వీటిని అస్సలు వెతకొద్దు.. లేదంటే మీరే రిస్క్‌లో పడతారు..
గూగుల్ మనకు అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో ఇస్తుంది. కానీ, అందులో కొన్ని విషయాలను వెతకడం వల్ల మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది.
Google: గూగుల్ అనేది మనకు తెలియని ఎన్నో విషయాలను క్షణాల్లో అందించే ఒక అద్భుతమైన సాధనం. అయితే, అదే సమయంలో కొన్ని విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేయడం వల్ల మనం పెద్ద చిక్కుల్లో పడే అవకాశం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ వల పన్నుతున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో భద్రంగా ఉండటానికి గూగుల్‌లో పొరపాటున కూడా వెతకకూడని ఐదు ముఖ్యమైన విషయాలేంటో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.
1. కస్టమర్ కేర్ నంబర్లు:
బ్యాంకులు, టెలికాం కంపెనీలు లేదా ఇతర సంస్థల కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో వెతకడం చాలా ప్రమాదకరం. స్కామర్లు ఆన్‌లైన్ ట్రిక్స్ ఉపయోగించి నకిలీ నంబర్లను టాప్‌లో కనిపించేలా చేస్తారు. వీటికి కాల్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ వివరాలు తీసుకోవాలి.
2. ఉచిత సాఫ్ట్‌వేర్, క్రాక్డ్ యాప్స్:
ఫ్రీ సాఫ్ట్‌వేర్, పైరేటెడ్ సినిమాలు లేదా క్రాక్డ్ యాప్స్ డౌన్‌లోడ్ కోసం సెర్చ్ చేస్తే హానికరమైన వైరస్‌లు, మాల్‌వేర్‌లు మీ డివైజ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ ఫోన్ డేటాను సులభంగా దొంగిలిస్తుంది.
3. సొంత వైద్యం:
ఆరోగ్య సమస్యల గురించి గూగుల్‌లో వెతికి సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాంతకం కావచ్చు. చిన్నపాటి లక్షణాలకు కూడా అక్కడ రకరకాల భయంకరమైన జబ్బుల పేర్లు కనిపిస్తాయి. దీనివల్ల అనవసరమైన ఆందోళన పెరుగుతుంది. అనారోగ్యంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడమే ఉత్తమం.
4. త్వరగా డబ్బు సంపాదించే మార్గాలు:
ఈజీగా డబ్బు సంపాదించడం ఎలాగో వెతికితే ఫేక్ వెబ్‌సైట్లు, ఆర్థిక స్కామ్‌లలో ఇరుక్కుంటారు. ఇలాంటి లింక్స్ క్లిక్ చేస్తే ఉన్న డబ్బు కాస్తా పోతుంది.
5. వ్యక్తిగత వివరాలు:
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌వర్డ్స్ లాంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేయకూడదు. హ్యాకర్లు ఈ డేటాను ట్రాక్ చేసి దుర్వినియోగం చేస్తారు. కాగా, ఈ కనీస జాగ్రత్తలు పాటిస్తే ఆన్‌లైన్ ప్రపంచంలో ఎప్పుడూ సురక్షితంగా ఉండవచ్చు.




