Aadhaar Card: ఇంట్లో నుంచే.. ఆధార్‌లో మొబైల్ నెంబర్ మార్చుకోవాలా.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Aadhaar Card: ఆధార్ కార్డు ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది.

Mokshith
Published on: 16 Sept 2026 5:00 PM IST
Aadhaar Card
X

Aadhaar Card: ఇంట్లో నుంచే.. ఆధార్‌లో మొబైల్ నెంబర్ మార్చుకోవాలా.? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Aadhaar Card: ఆధార్ కార్డు ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా పలు సేవలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మ‌రి ఆ రిజిస్ట‌ర్ నెంబ‌ర్‌ను మార్చుకోవాల్సిన అవ‌స‌రం వ‌స్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ యాప్‌తోనే మొబైల్ నెంబర్ అప్డేట్

గతంలో ఆధార్‌లో మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ముందుగా భాషను ఎంచుకోవాలి. అనంతరం ఆధార్ నెంబర్ నమోదు చేసి, యాప్‌లో సూచించిన నిబంధనలను అంగీకరించాలి. మీ సిమ్‌ను ఎంపిక చేసుకుని ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత యాప్‌ కోసం ఆరు అంకెల సెక్యూరిటీ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

కొత్త నెంబర్‌ను ఎలా నమోదు చేయాలి.?

యాప్‌లోకి విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అప్డేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఆ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ధృవీకరణ పూర్తి చేయాలి. అనంతరం అవసరమైన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరిగా యాప్‌లో సూచించిన విధంగా నిర్ణీత రుసుం చెల్లించాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ అభ్యర్థనను సంబంధిత విభాగం పరిశీలించి ఆధార్‌లో కొత్త మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేస్తుంది. అప్డేట్ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చు.

పాత నెంబర్ పనిచేయకపోతే ఏం చేయాలి.?

మీ ఆధార్‌లో నమోదైన పాత మొబైల్ నెంబర్ ప్రస్తుతం యాక్టివ్‌లో లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలి. పాత నెంబర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఓటీపీ ధృవీకరణను ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాగే ఆధార్‌కు మొబైల్ నెంబర్‌ను మొదటిసారి యాడ్‌ చేస్తున్నవారు కూడా సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

ఆధార్‌కు మొబైల్ నెంబర్ ఎందుకు ముఖ్యం.?

ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా వివిధ సేవలకు సంబంధించిన ఓటీపీలు, ధృవీకరణ సమాచారం అందుతుంది. కాబట్టి ఫోన్ నెంబర్ మారిన వెంటనే ఆధార్ వివరాల్లోనూ కొత్త నెంబర్‌ను అప్డేట్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు ఉపయోగించుకునే సమయంలో ఓటీపీ సమస్యలు ఎదురయ్యే అవకాశం తగ్గుతుంది. కేవైసీ, గుర్తింపు ధృవీకరణ వంటి అవసరాల్లోనూ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కీలకంగా ఉంటుంది. అందువల్ల ఆధార్‌లో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి ఉంచుకోవడం ద్వారా అవసరమైన సమయంలో సేవలను సులభంగా పొందవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.