Price Hike: సామాన్యుల జేబులకు చిల్లు.. భారీగా పెరిగిన ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ల ధరలు
Price Hike: దేశంలో పండుగ సీజన్ హడావుడి మొదలైన వేళ, సామాన్యుల గృహోపకరణాల బడ్జెట్ తలకిందులవుతోంది.
Electronics Price Hike
Price Hike: దేశంలో పండుగ సీజన్ హడావుడి మొదలైన వేళ, సామాన్యుల గృహోపకరణాల బడ్జెట్ తలకిందులవుతోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏసీలు, ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు సహా పలు రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగాగా మార్కెట్లో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు, ప్రొడక్టుల ఆధారంగా ఈ ధరలు సుమారు 3 నుంచి 10 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుత తరుణంలో కొత్తగా టీవీ లేదా ఏసీ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు గతంతో పోలిస్తే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ధరల పెరుగుదల వినియోగదారుల జేబులపై గట్టి ప్రభావం చూపనుంది.
ఏసీలు, టీవీలపై అత్యధిక భారం
ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా ఎయిర్ కండిషనర్లపై ఎక్కువగా కనిపిస్తోంది. నివేదికల ప్రకారం ఏసీల ధరలు ఏకంగా 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేసేవారికి కూడా ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. వీటి ధరలలో దాదాపు 3 నుంచి 7 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ఇవే కాకుండా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి నిత్య జీవితంలో ఉపయోగపడే గృహోపకరణాలు కూడా దాదాపు 3 నుంచి 4 శాతం వరకు ఖరీదైనవిగా మారాయి. బ్లూ స్టార్, గోద్రెజ్ అప్లయన్సెస్, హైయర్, డైకిన్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే తమ ఉత్పత్తుల రేట్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగడానికి అసలు కారణాలు
ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ముడి సరుకుల వ్యయం పెరగడమే. రాగి, ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి కీలక మెటీరియల్స్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా ఎగబాకాయి. దీనికి తోడు వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసే సరుకు రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఈ అదనపు భారాన్ని భరించలేక కంపెనీలు అనివార్యంగా ధరలను పెంచే మార్గాన్ని ఎంచుకున్నాయి. ఎల్జీ, బాష్ హోమ్ కంఫర్ట్ సంస్థలు ఏసీల ధరలను సుమారు 5 శాతం వరకు సవరించాయి. అయితే కొన్ని దుకాణాలలో పాత స్టాక్ ఇంకా మిగిలి ఉండటంతో, అక్కడ పాత ధరలకే వస్తువులు లభించే అవకాశం ఉంది.




