AI చాట్‌బాట్‌కు ఈ 5 విషయాలు అస్సలు షేర్ చేయకండి
AI చాట్‌బాట్‌తో పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఆధార్, ఆఫీస్ రహస్యాలు, వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్‌లు ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో ఎంతో ఉపయోగకరంగా మారాయి. రాయడం, సమాచారం సేకరించడం, కోడింగ్ చేయడం, వివిధ పనుల్లో సహాయం తీసుకోవడం వంటి వాటికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే AI చాట్‌బాట్‌తో మాట్లాడే సమయంలో కొన్ని సున్నితమైన సమాచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. పొరపాటున అలాంటి వివరాలు ఇస్తే వ్యక్తిగత గోప్యత, ఆన్‌లైన్ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.
పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు
AI చాట్‌బాట్‌కు ఎప్పుడూ పాస్‌వర్డ్‌లు లేదా లాగిన్ వివరాలను ఇవ్వకూడదు. బ్యాంకింగ్, ఈమెయిల్, సోషల్ మీడియా లేదా ఇతర ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లతో పాటు OTPలు, PINలు, రికవరీ కోడ్‌లు వంటి భద్రతా వివరాలను కూడా షేర్ చేయకూడదు. ఇవి ఖాతాలను రక్షించే అత్యంత సున్నితమైన సమాచారం.
బ్యాంకింగ్, ఆర్థిక వివరాలు
క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబర్, CVV, బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి ఆర్థిక వివరాలను AI చాట్‌బాట్‌లో నమోదు చేయడం మంచిది కాదు. బ్యాంకింగ్‌కు సంబంధించిన ఇతర సున్నితమైన సమాచారాన్ని కూడా వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలి.
ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత గుర్తింపు వివరాలు
ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని AI చాట్‌బాట్‌తో షేర్ చేయకూడదు. మీ వ్యక్తిగత గుర్తింపును బయటపెట్టే ఇతర సున్నితమైన వివరాలను కూడా అందించకుండా జాగ్రత్త పడాలి.
ఆఫీస్ లేదా రహస్య సమాచారం
ఉద్యోగానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని కూడా AI చాట్‌బాట్‌లో పెట్టకూడదు. కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి వివరాలు, కస్టమర్ల జాబితాలు, అంతర్గత డాక్యుమెంట్లు, నివేదికలు, వ్యాపార వ్యూహాలు లేదా సంస్థ రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
వ్యక్తిగత సంభాషణలు, ప్రైవేట్ సమాచారం
వ్యక్తిగత విషయాలు, ప్రైవేట్ సంభాషణలు లేదా మిమ్మల్ని గుర్తించగలిగే సున్నితమైన సమాచారాన్ని కూడా AI చాట్‌బాట్‌లో షేర్ చేసే ముందు ఆలోచించాలి. ఏదైనా సమస్యపై సలహా తీసుకోవాలనుకున్నా.. అవసరం లేని వ్యక్తిగత వివరాలను తొలగించి ప్రశ్న అడగడం మంచిది.
AI చాట్‌బాట్‌లు మనకు ఎంత సహాయకరంగా ఉన్నప్పటికీ.. అవి మనుషుల్లా మాట్లాడుతున్నాయని వాటిని పూర్తిగా నమ్మకూడదు. మీరు ఇతరులు తెలుసుకోవడం అస్సలు ఇష్టపడని సమాచారాన్ని AIతో కూడా షేర్ చేయకుండా ఉండటం సురక్షితమైన విధానం.
ఏదైనా సమాచారాన్ని AIకి పంపే ముందు అందులో మీ పేరు, ఖాతా వివరాలు, గుర్తింపు వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని తొలగించడం మంచిది. ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, OTPలు, PINలు, బ్యాంకింగ్ వివరాలు వంటి సమాచారాన్ని మాత్రం ఎప్పుడూ షేర్ చేయకూడదు.




