AI Replacing Jobs: AI వల్ల ఉద్యోగాలు పోతాయా? చైనా కోర్టు తీర్పుతో ప్రపంచవ్యాప్తంగా మొదలైన చర్చ
AI Replacing Jobs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి భారీ చర్చ జరుగుతోంది.
AI Replacing Jobs
AI Replacing Jobs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి భారీ చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో AI మనుషుల ఉద్యోగాలను తీసేస్తుందా అనే భయం చాలామందిలో ఉంది. ఇలాంటి సమయంలో చైనాలో వచ్చిన ఒక కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేవలం AI వచ్చిందనే కారణంతో ఉద్యోగులను సులభంగా తొలగించలేమని కోర్టు స్పష్టం చేసింది.
అసలు కేసు ఏమిటి?
ఈ కేసు చైనాలోని హాంగ్‌జౌ నగరానికి చెందిన ఒక కంపెనీలో జరిగింది. అక్కడ ఒక సీనియర్ క్వాలిటీ ఇన్స్యూరెన్స్ సూపర్వైజర్ పనిచేసేవాడు. అతని నెల జీతం సుమారు 25 వేల యువాన్‌లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.4 లక్షలు.
అతని పని AI మోడల్‌ను పర్యవేక్షించడం. AI సిస్టమ్ యూజర్ల ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకుంటుందా? ప్రైవసీకి సంబంధించిన లేదా చట్టవిరుద్ధమైన సమాచారం బయటకు వెళ్లకుండా ఉందా? వంటి విషయాలను పరిశీలించేవాడు.
AI అప్‌డేట్ తర్వాత ఉద్యోగిలో మార్పులు
కొంతకాలం తర్వాత కంపెనీ తమ AI సిస్టమ్‌ను మరింత ఆధునికంగా మార్చింది. దీంతో ఉద్యోగి చేస్తున్న కొన్ని పనులను అదే AI సిస్టమ్ చేయడం ప్రారంభించింది. అయితే కంపెనీ ఉద్యోగిని పూర్తిగా తొలగించకుండా, తక్కువ జీతం ఉన్న మరో పోస్టును ఆఫర్ చేసింది. కొత్త పోస్టులో అతని జీతాన్ని దాదాపు 40 శాతం తగ్గించారు. హోదా కూడా తగ్గించారు. ఈ మార్పును ఉద్యోగి అంగీకరించలేదు. దీంతో కంపెనీ అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసి పరిహారం ఇస్తామని తెలిపింది. దీనిపై ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు.
కంపెనీ వాదనను తిరస్కరించిన కోర్టు
కోర్టులో కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. AI టెక్నాలజీ రావడంతో పని పరిస్థితులు మారిపోయాయని, అందుకే ఉద్యోగంలో మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. కానీ హాంగ్‌జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు ఈ వాదనను పూర్తిగా అంగీకరించలేదు. ఏఐని తీసుకురావడం కంపెనీ వ్యాపార నిర్ణయం మాత్రమేనని, దాన్ని ప్రకృతి విపత్తులా చూడలేమని కోర్టు పేర్కొంది. ఉద్యోగి పని పూర్తిగా ముగిసిపోలేదని, AI పర్యవేక్షణ, క్వాలిటీ చెక్, నిబంధనల అమలు వంటి బాధ్యతలు ఇంకా అవసరమేనని తెలిపింది. భారీగా జీతం తగ్గించడం, హోదా తగ్గించడం సరైన నిర్ణయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఉద్యోగుల హక్కులపై కీలక సందేశం
ఈ తీర్పు ద్వారా సాంకేతిక మార్పులు వచ్చినా ఉద్యోగులతో న్యాయంగా వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. AI పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదని తెలిపింది. ఒక ఉద్యోగి పాత్ర మారితే కూడా అతనికి గౌరవప్రదమైన హోదా, సరైన జీతం ఇవ్వాలని పేర్కొంది. టెక్నాలజీ అభివృద్ధి పేరుతో కంపెనీలు ఉద్యోగులను అన్యాయంగా తొలగించలేవనే సంకేతం ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతోంది?
ఈ తీర్పు తర్వాత ప్రపంచవ్యాప్తంగా AIతో పాటు ఉద్యోగాల భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. AI కారణంగా ఉద్యోగాలు మారవచ్చు కానీ ప్రతి ఉద్యోగిని వెంటనే తొలగించడం చట్టబద్ధమా? కంపెనీలు టెక్నాలజీ పేరుతో జీతాలు తగ్గించవచ్చా? ఉద్యోగుల గౌరవం, హక్కులను ఎలా కాపాడాలి? వంటి ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. చైనా కోర్టు తీర్పు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. AI ఎంత అభివృద్ధి చెందినా, ఉద్యోగుల హక్కులు కూడా అంతే ముఖ్యమని ప్రపంచానికి గుర్తుచేసింది.




