2027లో కోవిడ్ కంటే భారీ సంక్షోభం రానుందా..? ఫుడ్, మనీ సిద్ధం చేసుకోవాలంటోన్న ఏఐ ఎక్స్పర్ట్..!
AI Warning 2027: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, ఓ ఏఐ సేఫ్టీ పరిశోధకుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది.
2027లో కోవిడ్ కంటే భారీ సంక్షోభం రానుందా..? ఫుడ్, మనీ సిద్ధం చేసుకోవాలంటోన్న ఏఐ ఎక్స్పర్ట్..!
AI Warning 2027: ఏఐ సేఫ్టీ పరిశోధకుడు నికోలా జుర్కోవిక్ (Nikola Jurkovic) ఎక్స్ (X) వేదికపై "ఏ వార్నింగ్ ఎబౌట్ ఏఐ టు మై లవ్డ్ వన్స్" పేరుతో ఓ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశాడు. థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా నవంబర్ 26న ఈ లేఖను ఆయన షేర్ చేశాడు. అత్యాధునిక ఏఐ వ్యవస్థల్లోని ప్రమాదాలను పరీక్షించే లాభాపేక్ష లేని సంస్థ ఎంఈటీఆర్లో ఆయన టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా పనిచేస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఎంఈటీఆర్ ఈ లేఖపై ఇంకా స్పందించలేదు.
లేఖలో ఆయన ఏఐపై మనుషుల నియంత్రణ క్రమంగా తగ్గిపోతోందని పేర్కొన్నారు. అదుపు తప్పిన ఏఐ కీలక మౌలిక సదుపాయాలకు ప్రవేశం పొందడం, చెడు ఉద్దేశం ఉన్నవారు జీవ ఆయుధాల తయారీకి ఏఐని దుర్వినియోగం చేయడం వంటి పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది ఏఐకి సంబంధించిన కొన్ని తీవ్ర సంఘటనలు, కొన్ని కంపెనీల వ్యవస్థల హ్యాకింగ్ ఘటనలు జరిగాయని కూడా లేఖలో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
కఠినమైన ప్రపంచ నియంత్రణ లేకపోతే ఏఐ తనను తాను మెరుగుపరుచుకుంటూ, అత్యంత తెలివైన మనుషుల స్థాయిని కూడా దాటవచ్చని, ఇది 2027లోనే జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 2030 చివరి నాటికి మానవాళికి మరింత కష్టంగా మారుతుందని తెలిపాడు. భవిష్యత్తులో, 2027 చివరి నాటికి ఏఐ వల్ల మన జీవన విధానం దెబ్బతిని, పండుగలు జరుపుకోలేని పరిస్థితి వచ్చే అవకాశం 5 నుంచి 20 శాతం ఉందని చెప్పారు. ఈ అంచనాలకు తన లేఖలో ఎలాంటి ఆధారాలు చూపలేదు.
వ్యక్తిగత సన్నద్ధత కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థలు దెబ్బతింటే అవసరమవుతుందని, కుటుంబానికి సరిపోయేలా సుమారు రెండు వారాలకు సరిపడా ఆహారం, నీళ్లు నిల్వ చేసుకోవాలని, చేతిలో నగదు ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఏఐ అభివృద్ధికి కఠినమైన ప్రపంచ నిబంధనలు అవసరమని, ఇందులో యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టం ఒక నమూనా కావచ్చని పేర్కొన్నట్లు రిపోర్టులు తెలిపాయి.
ఇలాంటి హెచ్చరికలు కొత్త కాదు. యోషువా బెంజియో, జెఫ్రీ హింటన్ వంటి ఏఐ మార్గదర్శకులు, ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ కార్యనిర్వాహకులు కూడా ఏఐ వేగవంతమైన అభివృద్ధి, ఉద్యోగ నష్టాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ విడుదల చేసిన ప్రకటన కూడా ఏఐ వల్ల మానవ మనుగడకు ముప్పును, అణు యుద్ధంతో సమానంగా ప్రపంచ ప్రాధాన్యతగా చూడాలని కోరింది. మరోవైపు కొందరు విమర్శకులు ఇలాంటి అంచనాలను అతిశయోక్తిగా భావిస్తున్నారు. ఏఐ గతంలో కొన్ని అంచనా వేసిన మైలురాళ్లను చేరుకోలేదని వారు గుర్తుచేస్తున్నారు.




