AI Dream Control: ఇదెక్కడి టెక్నాలజీ రా సామీ.. నచ్చిన కలలను చూపించే డివైస్!
AI Dream Control: 'ప్రోఫెటిక్ ఏఐ' అనే సరికొత్త స్టార్టప్ సంస్థ ఇప్పుడు మన నిద్రలోని కలలను కూడా ప్రభావితం చేసే సాంకేతికతను తీసుకువచ్చింది.
AI Dream Control: ఇదెక్కడి టెక్నాలజీ రా సామీ.. నచ్చిన కలలను చూపించే డివైస్!
AI Dream Control: సాధారణంగా నిద్రలో మనకు ఎలాంటి కలలు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కానీ, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో మనకు నచ్చిన కలలను కనే అవకాశం రాబోతోంది. ఒక వినూత్న స్టార్టప్ సంస్థ రూపొందించిన ఈ స్మార్ట్ గాడ్జెట్ ద్వారా కలలను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది మానవ మెదడు, సాంకేతికత మధ్య అద్భుత అనుసంధానంగా మారనుంది.
నేటి కాలంలో ఏఐ కేవలం లెటర్స్, రెజ్యూమ్ రాయడానికో లేదా లెక్కలు చేయడానికో మాత్రమే పరిమితం కాలేదు. 'ప్రోఫెటిక్ ఏఐ' అనే సరికొత్త స్టార్టప్ సంస్థ ఇప్పుడు మన నిద్రలోని కలలను కూడా ప్రభావితం చేసే సాంకేతికతను తీసుకువచ్చింది. ఈ సంస్థ తాజాగా 'డ్యూయల్', 'ఫేజ్' అనే రెండు పరికరాలను పరిచయం చేసింది. ఇవి మనం చూసే కలల స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తాయి.
ఈ పరికరం ఎలా పని చేస్తుంది?
ఈ డివైజ్ ను తలకు ధరించాల్సి ఉంటుంది. ఇవి సురక్షితమైన అల్ట్రాసోనిక్ తరంగాలను మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ భాగానికి పంపిస్తాయి. సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు మెదడులోని కొన్ని నెట్‌వర్క్‌లు పనిచేయవు, అందుకే మనకు వచ్చే కలలపై మనకు స్పృహ ఉండదు. కానీ ఈ పరికరం ఆ నెట్‌వర్క్‌లను ఉత్తేజితం చేయడం ద్వారా 'ల్యూసిడ్ డ్రీమింగ్' (మెలకువగా ఉంటూనే కలలు కనడం) అనే స్థితిని కలిగిస్తుంది. దీనివల్ల మీరు కలలో ఉన్నారని మీకు తెలుస్తుంది. ఆ కలని మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు.
అధునాతన సెన్సార్లు, లేటెస్ట్ టెక్నాలజీ..
ప్రోఫెటిక్ పల్స్ అనే ఈ వ్యవస్థలో ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) సెన్సార్లు ఉన్నాయి. ఇవి మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ కూడా ఇటువంటి సెన్సార్లనే ఉపయోగిస్తుండటం గమనార్హం. ఈ పరికరం కేవలం కలలను నియంత్రించడమే కాకుండా, వాటిని స్పష్టంగా గుర్తుంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.
ధర..
సాంకేతికత పరంగా ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ పరికరాల ధరలు కూడా విభిన్నంగా ఉన్నాయి
ప్రోఫెటిక్ డ్యూయల్: దీని ధర సుమారు 449 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 42,300 రూపాయలు). ఈ ఏడాది చివరి నాటికి దీని పంపిణీ ప్రారంభం కానుంది.
ప్రోఫెటిక్ ఫేజ్: దీని ధర సుమారు 1,299 డాలర్లు (దాదాపు 1,22,000 రూపాయలు). ఇది 2027 మధ్య నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ఈ సాంకేతికత మానవ మెదడు సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.




