AC Buying Guide: ఏసీ కొనేముందు ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.. లేదంటే, భారీగా నష్టపోతారంతే?
Air Conditioner Buying Guide: ఎండలు ముదిరిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇల్లు చల్లగా ఉండాలని ఏసీ కొనాలని ఆలోచిస్తున్నారా? తక్కువ విద్యుత్ ఖర్చుతో మెరుగైన చల్లదనాన్ని ఇచ్చే ఏసీని ఎలా ఎంచుకోవాలో, కొనేముందు గమనించాల్సిన ఓ పది విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
AC Buying Guide
Air Conditioner Buying Guide: వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లో రకరకాల ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తొందరపడి ఏదో ఒక ఏసీని కొనేస్తే భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు మోత మోగవచ్చు. ఏసీ అనేది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి, కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.
విండో లేదా స్ప్లిట్ ఏసీ: ఏది మేలు?
మొదటగా మీ గది పరిమాణాన్ని బట్టి విండో లేదా స్ప్లిట్ ఏసీని ఎంచుకోవాలి. స్ప్లిట్ ఏసీలు పెద్ద గదులకు (120–200 చదరపు అడుగులు) సరిపోతాయి. ఇవి శబ్దం తక్కువగా చేస్తాయి. చిన్న గదులు ఉండి, తక్కువ బడ్జెట్‌లో కావాలనుకునే వారికి విండో ఏసీలు ఉత్తమం.
గది పరిమాణం, టన్నుల లెక్క..
మీ గది వైశాల్యాన్ని బట్టి ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోవాలి. 120 చదరపు అడుగుల లోపు గదికి 1 టన్ను, 120 నుంచి 180 అడుగుల వరకు 1.5 టన్నులు, అంతకంటే పెద్ద గదులకు 2 టన్నుల ఏసీ అవసరమవుతుంది. సరైన సామర్థ్యం లేకపోతే చల్లదనం తగ్గడమే కాకుండా విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
ఇన్వర్టర్ సాంకేతికత, స్టార్ రేటింగ్..
ప్రస్తుతం ఇన్వర్టర్ ఏసీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి విద్యుత్ ఆదా చేయడంలో మేటి. అలాగే ఏసీ పై ఉండే స్టార్ రేటింగ్‌ను తప్పక గమనించాలి. 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు ప్రారంభంలో కాస్త ఖరీదైనవి అనిపించినా, దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులను భారీగా తగ్గిస్తాయి.
కాపర్ కాయిల్ బెస్ట్..
ఏసీలో రాగి తీగలతో (కాపర్ కాయిల్) చేసిన కండెన్సర్లు ఉన్న వాటినే ఎంచుకోండి. ఇవి త్వరగా చల్లబరుస్తాయి. తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. వీటితో పాటు టర్బో కూలింగ్, ఆటో రీస్టార్ట్, స్లీప్ మోడ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వై-ఫై ద్వారా ఫోన్‌తో నియంత్రించే స్మార్ట్ ఏసీలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ముందస్తు ఖర్చులు, వారంటీ..
ఏసీ కొనేటప్పుడు కేవలం దాని ధరనే కాకుండా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పైపులు, స్టాండ్ వంటి వాటికి అదనపు ఖర్చు అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కంప్రెసర్‌పై కనీసం 5 నుంచి 10 ఏళ్ల వారంటీ ఉండేలా చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు వినియోగదారుల రివ్యూలు చదవడం మర్చిపోవద్దు.




