Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ ఖరీదైన మెషిన్ ఖరాబైనట్టే

Air Fryer: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎయిర్ ఫ్రైయర్ వాడుక విపరీతంగా పెరిగిపోయింది.

CR Reddy
Published on: 26 Sept 2026 7:33 AM IST
Air Fryer Cleaning
X

Air Fryer Cleaning 

Air Fryer: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎయిర్ ఫ్రైయర్ వాడుక విపరీతంగా పెరిగిపోయింది. నూనె లేకుండా రుచికరమైన వంటకాలు చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దీనిని ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసే సమయంలో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఇలాంటి తప్పుల వల్ల ఎయిర్ ఫ్రైయర్ పనితీరు దెబ్బతినడమే కాకుండా, హీటింగ్ సిస్టమ్, నాన్-స్టిక్ కోటింగ్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ లైఫ్ టైం పెరగాలంటే క్లీనింగ్ చేసేటప్పుడు కొన్ని కీలకమైన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

మెయిన్ యూనిట్‌ను పొరపాటున కూడా నీటిలో ముంచకండి

ఎయిర్ ఫ్రైయర్‌ను శుభ్రం చేసేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు దాని మెయిన్ బాడీని నేరుగా నీటిలో ముంచడం. ఎయిర్ ఫ్రైయర్ మెయిన్ యూనిట్‌లో ఎలక్ట్రానిక్ భాగాలు ఉంటాయి కాబట్టి దీనిని నీటిలో కడిగితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే మెయిన్ బాడీని, లోపలి భాగాలను కొద్దిగా తడిపిన బట్ట లేదా సాఫ్ట్ స్పాంజ్‌తో మాత్రమే తుడవాలి. అలాగే కంట్రోల్ ప్యానెల్‌పై ఎక్కువ తేమ పడకుండా చూసుకోవాలి. క్లీన్ చేసే ముందు ప్లగ్ కచ్చితంగా తొలగించాలి.

స్టీల్ స్క్రబ్బర్లు వాడకండి

చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ లేదా ట్రేను తోముకోవడానికి స్టీల్ లేదా మెటల్ స్కబ్బర్లను వాడుతుంటారు. దీనివల్ల బాస్కెట్‌కు ఉండే నాన్-స్టిక్ కోటింగ్ దెబ్బతిని పాడైపోతుంది. దీనికి బదులుగా సాఫ్ట్ స్పాంజ్, తేలికపాటి డిష్ సోప్, గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. అలాగే ప్రతిసారీ వంట అయ్యాక జిడ్డు అలాగే ఉంచకుండా బాస్కెట్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే అందులో పేరుకుపోయిన నూనె వాసన రావడంతో పాటు తర్వాతి వంటల్లో మాడిపోయే అవకాశం ఉంటుంది.

హీటింగ్ ఎలిమెంట్, హార్డ్ కెమికల్స్ జాగ్రత్తలు

కేవలం బాస్కెట్ మాత్రమే కాకుండా ఎయిర్ ఫ్రైయర్ లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీనిపై పేరుకుపోయిన నూనె హీటింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫ్రైయర్ పూర్తిగా చల్లారిన తర్వాత సాఫ్ట్ బ్రష్ లేదా టూత్ బ్రష్‌తో దీనిని సులభంగా క్లీన్ చేయండి. అలాగే బ్లీచ్, ఓవన్ క్లీనర్స్ వంటి బలమైన కెమికల్స్‌ను అసలు వాడకండి. ఇవి ప్యానెల్‌ను పాడుచేస్తాయి. కెమికల్స్ బదులుగా నీరు, వెనిగర్ మిశ్రమం వాడితే జిడ్డు సులభంగా వదిలిపోతుంది.

పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే వాడాలి

క్లీనింగ్ పూర్తయిన వెంటనే ఎయిర్ ఫ్రైయర్ భాగాలను మళ్లీ అమర్చడం తప్పు. అన్ని పార్ట్స్‌ను కొద్దిసేపు గాలిలో పూర్తిగా ఆరనివ్వాలి. కొంచెం కూడా తడి లేదా తేమ అలాగే ఉంటే వంట చేసే సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎయిర్ ఫ్రైయర్ వెనుక ఉండే ఎయిర్ వెంట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఇక్కడ దుమ్ము, గ్రీస్ పేరుకుపోవడం వల్ల గాలి సరిగ్గా సర్క్యులేట్ అవ్వక వంట సరిగా ఉడకదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.