Allbirds: ఒకప్పుడు షూ కంపెనీ.. కట్ చేస్తే AI కంపెనీగా మాస్ ఎంట్రీ..లాభాలే లాభాలు
Allbirds: ప్రముఖ షూ బ్రాండ్ ఆల్‌బర్డ్స్ ఇప్పుడు న్యూబర్డ్ AIగా అవతారమెత్తింది.
Allbirds: ఒకప్పుడు షూ కంపెనీ.. కట్ చేస్తే AI కంపెనీగా మాస్ ఎంట్రీ..లాభాలే లాభాలు
Allbirds AI: సాధారణంగా ఒక కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే అదే రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తుంది. కానీ, అమెరికాకు చెందిన ప్రముఖ షూ బ్రాండ్ ఆల్‌బర్డ్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దూకేసింది. పాదరక్షల తయారీ నుంచి పక్కకు జరిగి, ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఏమిటీ న్యూబర్డ్ AI?
కంపెనీ తన పేరును న్యూబర్డ్ AIగా మార్చుకుంటూ, సుమారు 50 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనుంది. ఈ నిధులతో కేవలం ఏఐ సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా, GPU-as-a-Service ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనుంది. అంటే, ఏఐ పనులు చేసే కంపెనీలకు అవసరమైన హై-స్పీడ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను క్లౌడ్ ద్వారా అద్దెకు ఇవ్వడం అన్నమాట. దీనితో పాటు ఏఐ ఆధారిత క్లౌడ్ సేవలను కూడా అందించనుంది.
600 శాతం ఎగబాకిన షేర్ ధర
ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే స్టాక్ మార్కెట్‌లో ఒక అద్భుతం జరిగింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో ఆల్‌బర్డ్స్ షేరు ధర ఏకంగా 600 శాతం పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI అనే పదానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ పెరుగుదల నిరూపించింది. ఇన్వెస్టర్లు ఈ మార్పును ఒక గొప్ప అవకాశంగా భావించి షేర్ల కొనుగోలుకు ఎగబడ్డారు.
సంక్షోభం నుంచి సాహసం వైపు..
ఈ సంచలన నిర్ణయం వెనుక ఆల్‌బర్డ్స్ ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు 4 బిలియన్ డాలర్ల విలువ ఉన్న ఈ కంపెనీ, ఇటీవల కేవలం 39 మిలియన్ డాలర్లకే అమ్ముడయ్యే స్థితికి చేరుకుంది.షూ వ్యాపారంలో నష్టాలు వస్తుండటంతో, ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ రంగం వైపు మళ్లడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం సాధించాలని సంస్థ భావిస్తోంది. పర్యావరణ హిత మెటీరియల్స్‌తో షూస్ తయారు చేసే సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి, టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది.
మార్కెట్ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, నిపుణులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షూస్ తయారు చేసే అనుభవం ఉన్న కంపెనీ, అత్యంత క్లిష్టమైన డేటా సెంటర్లు, GPU సరఫరా వంటి సాంకేతిక రంగాలను ఎలా నిర్వహిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది కేవలం మార్కెట్ హైప్ కోసం చేసిన ప్రయత్నమా లేక నిజమైన మార్పా అనేది కాలమే నిర్ణయించాలి. ఒక పాదరక్షల కంపెనీ చిప్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడటం వినడానికి వింతగా ఉన్నా, ఇది టెక్నాలజీ యుగంలో వస్తున్న మార్పులకు సంకేతం. ఆల్‌బర్డ్స్ తీసుకున్న ఈ సాహసోపేతమైన ఏఐ అడుగు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.




