Wi-Fi: ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం మర్చిపోతున్నారా?
Wi-Fi: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.
Wi-Fi
Wi-Fi: ప్రస్తుత డిజిటల్ కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఫోన్ వాడే సమయంలో మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. అందులో ప్రధానమైనది ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ అయి ఉందా లేదా అని చెక్ చేయకపోవడం. చాలామంది తాము బయటికి వెళ్లాక కూడా వై-ఫై ఆఫ్ చేయకుండా అలానే వదిలేస్తుంటారు. దీనివల్ల పెద్దగా నష్టం ఉండదని భావిస్తారు. కానీ నిజానికి ఫోన్ వై-ఫై ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల మన డిజిటల్ ప్రైవసీకి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్లో వై-ఫై ఆన్ చేసి ఉన్నప్పుడు అది చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వివిధ నెట్‌వర్క్‌ల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటుంది. మనం గతంలో ఎప్పుడైనా కనెక్ట్ చేసిన నెట్వర్క్ కనుక చుట్టుపక్కల ఉంటే, ఫోన్ దానికి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. కేఫ్‌లు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు సైబర్ నేరస్థులు అసలైన నెట్‌వర్క్‌ల మాదిరిగానే ఉండే నకిలీ వై-ఫై హాట్స్పాట్లను క్రియేట్ చేస్తుంటారు. ఉదాహరణకు ఎయిర్పోర్ట్ ఫ్రీ వై-ఫై లేదా హోటల్ గెస్ట్ వై-ఫై పేరుతో ఫేక్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి అమాయక వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. పొరపాటున మనం అలాంటి ఫేక్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయితే మన పర్సనల్ ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.
పబ్లిక్ ప్లేసులలో జనాల కదలికలను గుర్తించడానికి కొన్ని సంస్థలు లేదా సిస్టమ్‌లు వై-ఫై సిగ్నల్స్‌ను ఉపయోగిస్తుంటాయి. ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా వినియోగదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. ఆధునిక స్మార్ట్ఫోన్లలో ఇలాంటి ట్రాకింగ్‌ను నివారించడానికి కొన్ని భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం చాలా మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన నెట్వర్క్ స్కానింగ్ జరగకుండా ఉంటుంది. అలాగే పబ్లిక్ ప్రదేశాలలో ప్రైవసీకి భంగం కలగకుండా మన వ్యక్తిగత డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
కేవలం ప్రైవసీ సమస్య మాత్రమే కాకుండా, ఫోన్ బ్యాటరీ లైఫ్ మీద కూడా వై-ఫై ఆన్ ఉండిపోవడం ప్రభావం చూపుతుంది. వై-ఫై కేవలం ఇంటర్నెట్ వాడడానికే కాకుండా, చుట్టూ ఉన్న నెట్‌వర్క్‌లను వెతకడానికి కూడా బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేస్తుంది. ఫోన్ నిరంతరం వై-ఫై సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు బ్యాటరీ త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రోజంతా లభించే బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అయితే ఇది ప్రతి ఫోన్లో ఒకేలా ఉండాలని లేదు. ఫోన్ మోడల్, బ్యాటరీ కెపాసిటీ, సాఫ్ట్వేర్ సెట్టింగ్స్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, అవసరం లేనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం బ్యాటరీ ఆదా చేయడానికి తోడ్పడుతుంది.




