Apple షాక్.. మ్యాక్‌బుక్ ధరలపై భారీ బాదుడు.!

Apple : యాపిల్ ఉత్పత్తులను ఇష్టపడేవారికి ఆ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు యాపిల్ గ్యాడ్జెట్ల ధరలను గురువారం భారీగా పెంచేసింది..

G Krishna
Published on: 26 Jun 2026 1:42 PM IST
Apple
X

Apple

Apple : యాపిల్ ఉత్పత్తులను ఇష్టపడేవారికి ఆ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు యాపిల్ గ్యాడ్జెట్ల ధరలను గురువారం భారీగా పెంచేసింది. కొన్ని ప్రీమియం ప్రొడక్టులపై ఏకంగా లక్ష రూపాయల వరకు ధరలు పెరగడం గమనార్హం. ఈ ధరల పెంపు ప్రధానంగా మ్యాక్ కంప్యూటర్లు, మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్‌లు, యాపిల్ టీవీ , హోమ్‌పాడ్ స్పీకర్లకు వర్తిస్తుంది. అయితే, ప్రస్తుతం ఐఫోన్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో డిరామ్ (DRAM), నాండ్ (NAND) ఫ్లాష్ స్టోరేజ్ ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.

చుక్కలు చూపిస్తున్న మ్యాక్‌బుక్, మ్యాక్ ధరలు

యాపిల్ లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాక్‌బుక్ ఎయిర్, ప్రో సిరీస్‌ల ధరలు ఇప్పుడు సామాన్యుడికి మరింత దూరమయ్యాయి. గతంలో 69,900 రూపాయలుగా ఉన్న మ్యాక్‌బుక్ నియో ధర ఇప్పుడు 79,900 రూపాయలకు చేరింది. అలాగే 13-ఇంచుల మ్యాక్‌బుక్ ఎయిర్ M5 మోడల్ ధర ఏకంగా 29,000 రూపాయలు పెరిగి 1,49,900 రూపాయలకు చేరుకుంది. ప్రొఫెషనల్స్ ఎక్కువగా వాడే 14-ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో M5 ధర మునుపటి కంటే 70,000 రూపాయలు అదనంగా పెరిగి 2,39,900 రూపాయలకు చేరింది. ఇక అత్యంత ప్రీమియం మోడల్ అయిన మ్యాక్‌బుక్ ప్రో M5 మాక్స్ ధరపై ఏకంగా లక్ష రూపాయలు పెరగడంతో, దీని ధర 3,99,900 రూపాయల నుండి ఏకంగా 4,99,900 రూపాయల మార్కును తాకింది. బడ్జెట్ డెస్క్‌టాప్ ప్రియులను ఆకట్టుకునే మ్యాక్ మిని M4 ధర కూడా 35,000 రూపాయలు పెరిగి ప్రస్తుతం 94,900 రూపాయల వద్ద విక్రయించబడుతోంది.

ఐప్యాడ్‌లు , హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ధరలు కూడా పైపైకే

టాబ్లెట్ మార్కెట్లో రారాజుగా ఉన్న ఐప్యాడ్ సిరీస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బేస్ మోడల్ అయిన ఐప్యాడ్ 11th జనరేషన్ ధర మునుపటి కంటే పది వేల రూపాయలు పెరిగి 49,900 రూపాయలకు చేరింది. ఐప్యాడ్ మిని ధర 20,000 రూపాయల పెంపుతో 69,900 రూపాయలకు, ఐప్యాడ్ ఎయిర్ (11-ఇంచ్ M4) ధర 25,000 రూపాయల పెంపుతో 89,900 రూపాయలకు చేరుకున్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఐప్యాడ్ ప్రో M5 ధర 40,000 రూపాయలు పెరగడంతో, అది ఇప్పుడు 1,39,900 రూపాయల వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు యాపిల్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో కూడా వాతలు తప్పలేదు. యాపిల్ టీవీ 4K ధర ఏకంగా 11,000 రూపాయలు పెరిగి 25,900 రూపాయలకు చేరగా, హోమ్‌పాడ్ , హోమ్‌పాడ్ మిని స్పీకర్ల ధరలు వరుసగా 44,900 రూపాయలు , 15,900 రూపాయలకు పెరిగాయి.

ధరల పెంపు తప్పలేదు: టిమ్ కుక్

పెరిగిన విడిభాగాల ఖర్చులను కంపెనీ ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి తాము ఎంతో ప్రయత్నించామని, కానీ గ్లోబల్ సప్లై చైన్ ఇబ్బందుల వల్ల ఇది సాధ్యం కాలేదన్నారు. అయితే రాబోయే ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు ముందే కంపెనీ ఇతర ఉత్పత్తులపై ఈ రేంజ్ లో ధరలను పెంచడం విశేషం. పెరిగిన ఈ కొత్త ధరలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని రిటైల్ స్టోర్లలో అమలులోకి వచ్చాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story