ఇదెక్కడి చౌక ల్యాప్‌టాప్ మావా.. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఔటాఫ్ స్టాక్!
Apple MacBook Neo: ఆపిల్ తాజాగా విడుదల చేసిన మ్యాక్‌బుక్ నియో మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రజాదరణ పొందింది.
ఇదెక్కడి చౌక ల్యాప్‌టాప్ మావా.. మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఔటాఫ్ స్టాక్!
Apple MacBook Neo: టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి వచ్చిన సరికొత్త చౌక ల్యాప్‌టాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంతో వినియోగదారులు దీనిపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా విక్రయాలు ప్రారంభమైన కొద్ది సేపటికే స్టాక్ మొత్తం నిండుకోవడంతో, ఈ ల్యాప్‌టాప్ కోసం ఇప్పుడు టెక్ ప్రియులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
అయిపోయిన స్టాక్.. పెరిగిన డిమాండ్..
ఆపిల్ తాజాగా విడుదల చేసిన మ్యాక్‌బుక్ నియో మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రజాదరణ పొందింది. తాజా నివేదికల ప్రకారం, ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన స్టాక్స్ పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇందులో ఉపయోగించిన ఏ18 ప్రో చిప్ కొరత కారణంగా ఉత్పత్తిలో జాప్యం జరుగుతోందని, అందుకే కొత్త ఆర్డర్ల డెలివరీలో ఆలస్యం అవుతోందని సమాచారం. వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో వచ్చిన డిమాండ్ కంపెనీని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఉత్పత్తిని వేగవంతం చేసిన ఆపిల్..
విపరీతమైన డిమాండ్‌ను తట్టుకోవడానికి ఆపిల్ తన సరఫరాదారులను అప్రమత్తం చేసింది. చైనా, వియత్నాంలలో తయారీ కేంద్రాలను కలిగి ఉన్న ఫాక్స్‌కాన్, క్వాంటా వంటి భాగస్వామ్య సంస్థలకు కొత్త ఉత్పత్తి ఆర్డర్‌లను జారీ చేసింది. ప్రస్తుతం భారతదేశంలోని అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో లేదు.
వినియోగదారులు ఎంతకాలం వేచి ఉండాలి?
మీరు ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే, ఏప్రిల్ చివరి నుంచి మే మొదటి వారం వరకు వేచి ఉండాల్సి రావొచ్చు. అధికారిక లెక్కల ప్రకారం, డెలివరీ తేదీలు ఏప్రిల్ 28 నుంచి మే 5 మధ్య చూపిస్తున్నాయి. ఇది 256 జీబీ, 512 జీబీ వేరియంట్‌లకు వర్తిస్తుంది. వివిధ రంగుల ఎంపికలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్ విక్రయ వేదికలలో వెండి రంగు వేరియంట్ మాత్రం కొంత త్వరగా లభించే అవకాశం ఉంది.
మ్యాక్‌బుక్ నియో వేరియంట్స్, వాటి ధరలు:
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్: రూ. 69,900 (మ్యాజిక్ కీబోర్డ్)
8GB ర్యామ్ + 512GB స్టోరేజ్ మోడల్: రూ. 79,900 (టచ్ ఐడీ సపోర్ట్)
రంగును బట్టి మారుతున్న డెలివరీ సమయం..
వినియోగదారులు ఎంచుకునే రంగును బట్టి వేచి ఉండే సమయం మారుతోంది. సిల్వర్ వేరియంట్ త్వరగా అందుబాటులోకి వస్తుండగా, బ్లష్, ఇండిగో వంటి రంగుల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోంది. రంగుతో సంబంధం లేకుండా ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి సిల్వర్ ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది.
కస్టమైజేషన్ చేసుకునే సౌలభ్యం..
ఈ మ్యాక్‌బుక్ నియోలోని మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, దీనిని సులభంగా మరమ్మతు చేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. అంటే, కొనుగోలు చేసిన తర్వాత కూడా వేరే రంగు విడిభాగాలను అమర్చుకోవడం ద్వారా దీని రూపురేఖలను మార్చవచ్చు. అయితే, దీని కోసం అదనపు ఖర్చు అవుతుందని, తద్వారా తక్కువ ధరలో వచ్చే ఈ ల్యాప్‌టాప్ కాస్త ఖరీదైనదిగా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.




