గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పాల్సిందేనా.. 11 భారతీయ భాషల్లో కొత్త ఫీచర్లతో యాపిల్ మ్యాప్స్..!

Apple Maps India: భారత్‌లో యాపిల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. 300కు పైగా 3D ల్యాండ్‌మార్క్స్, లుక్ అరౌండ్, ఏఆర్ వాకింగ్ డైరెక్షన్స్, 11 భారతీయ భాషల సపోర్ట్‌తో పాటు ఇతర సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.

Venkat
Published on: 18 Nov 2026 6:42 PM IST
Apple Maps India
X

గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పాల్సిందేనా.. 11 భారతీయ భాషల్లో కొత్త ఫీచర్లతో యాపిల్ మ్యాప్స్..!

Apple Maps: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తెలియని ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. అయితే ఇప్పుడు యాపిల్ కూడా భారత్‌లో తన మ్యాప్స్ యాప్‌ను మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న కొన్ని సదుపాయాలతో పాటు, కొత్తగా 3D ల్యాండ్‌మార్క్‌లు, కెమెరా ఆధారిత ఏఆర్ వాకింగ్ డైరెక్షన్స్, లుక్ అరౌండ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. అంతేకాదు.. 11 భారతీయ భాషల్లో ప్రాంతాల పేర్లను చూసే సదుపాయాన్ని కూడా కల్పించింది. అసలు యాపిల్ మ్యాప్స్‌లో వచ్చిన కొత్త ఫీచర్లు ఏమిటి? ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

భారత్ కోసం యాపిల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్లు..

భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా యాపిల్ తన మ్యాప్స్ యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. దేశంలోని రోడ్లు, భవనాలు, పార్కులు, షాపింగ్ సెంటర్లు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని మరింత స్పష్టంగా అందించేలా మార్పులు చేసింది. ముఖ్యంగా 300కు పైగా ప్రముఖ ప్రాంతాలను 3D రూపంలో చూసే అవకాశం కల్పించింది.

అంతేకాదు.. గూగుల్ మ్యాప్స్‌లోని స్ట్రీట్ వ్యూ తరహాలో పనిచేసే లుక్ అరౌండ్, కెమెరా ద్వారా దారి చూపించే ఏఆర్ వాకింగ్ డైరెక్షన్ వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాయిస్ నావిగేషన్‌ను కూడా మెరుగుపరిచింది.

పెట్రోల్ బంక్, ట్రాఫిక్ సిగ్నల్ ఆధారంగా దారి..

భారత్‌లోని చాలా ప్రాంతాల్లో రోడ్ల పేర్ల కంటే అక్కడ ఉండే ప్రముఖ ప్రదేశాల ఆధారంగా దారులు చెబుతుంటారు. ఉదాహరణకు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కుడివైపు తిరగాలి, గుడి ఎదురుగా ఎడమవైపు వెళ్లాలి, తదుపరి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మలుపు తీసుకోవాలి అంటూ సూచనలు ఇస్తుంటారు.

ఈ అవసరాన్ని గుర్తించిన యాపిల్ తన నాచురల్ లాంగ్వేజ్ గైడెన్స్ ఫీచర్‌ను మెరుగుపరిచింది. ఇకపై యాపిల్ మ్యాప్స్ వాయిస్ నావిగేషన్ సాధారణంగా మాట్లాడే భాషలోనే దిశానిర్దేశం చేయగలదు. పెట్రోల్ బంక్ తర్వాత కుడివైపు తిరగండి లేదా తదుపరి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎడమవైపు వెళ్లండి వంటి సూచనలు అందిస్తుంది.

ముఖ్యంగా రోడ్ల పేర్లు సరిగా తెలియని ప్రాంతాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

300కు పైగా ప్రముఖ ప్రాంతాలు 3Dలో..

యాపిల్ మ్యాప్స్ లో మరో ఆకర్షణీయమైన ఫీచర్ 3D ల్యాండ్‌మార్క్స్. భారత్‌లోని 300కు పైగా ప్రముఖ ప్రాంతాలను త్రీడీ రూపంలో వీక్షించవచ్చు. ఇందులో ప్రసిద్ధ భవనాలు, చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌లు ఉంటాయి.

దీంతో మ్యాప్‌లో కేవలం ఒక చిన్న గుర్తు ఆధారంగా కాకుండా.. ఆయా ప్రాంతాల్లోని భవనాలు, పరిసరాలను కూడా త్రీడీ రూపంలో అర్థం చేసుకోవచ్చు. తెలియని నగరాల్లోని ప్రముఖ ప్రాంతాలను గుర్తించడం మరింత సులభమవుతుంది.

గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ తరహాలో లుక్ అరౌండ్..

గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న స్ట్రీట్ వ్యూ తరహాలో యాపిల్ కూడా లుక్ అరౌండ్ ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ద్వారా వినియోగదారులు తాము వెళ్లాలనుకుంటున్న రోడ్లు, భవనాలు, పరిసర ప్రాంతాలను వాస్తవ చిత్రాల రూపంలో చూడవచ్చు. హై రిజల్యూషన్ చిత్రాల ద్వారా ఒక ప్రాంతాన్ని ముందుగానే పరిశీలించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు మీరు కొత్తగా ఒక హోటల్‌కు లేదా ఆఫీసుకు వెళ్లాలనుకుంటే.. ముందుగా ఆ ప్రాంతంలోని రోడ్లు, భవనాలు, ప్రవేశ ద్వారాలను పరిశీలించవచ్చు. అంతేకాదు.. భారత్‌లోని ఈ చిత్రాలను ఇతర దేశాల్లో ఉన్న వినియోగదారులు కూడా లుక్ అరౌండ్ ద్వారా వీక్షించవచ్చు.

కెమెరా ద్వారా దారి చూపించే ఏఆర్ వాకింగ్ డైరెక్షన్..

యాపిల్ మ్యాప్స్ లో తీసుకొచ్చిన మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏఆర్ వాకింగ్ డైరెక్షన్. ముఖ్యంగా నడుచుకుంటూ వెళ్లేవారికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ కెమెరాను చుట్టుపక్కల భవనాల వైపు చూపిస్తే.. వాస్తవ ప్రపంచ దృశ్యాలపైనే డిజిటల్ దిశానిర్దేశాలు కనిపిస్తాయి. దీంతో ప్రతిసారీ ఫోన్ స్క్రీన్‌పై మ్యాప్‌ను చూస్తూ దారి వెతుక్కోవాల్సిన అవసరం తగ్గుతుంది.

పెద్ద నగరాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, కొత్త ప్రదేశాలకు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది.

11 భారతీయ భాషల్లో ప్రాంతాల పేర్లు

భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే మరో ముఖ్యమైన ఫీచర్ స్థానిక భాషల సపోర్ట్. ఇంగ్లిష్, హిందీతో పాటు మరో 10 భారతీయ భాషల్లో ప్రాంతాల పేర్లను చూసే అవకాశం కల్పించింది. ఈ భాషల్లో బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒడియా, ఉర్దూ ఉన్నాయి.

ఈ ఫీచర్ ద్వారా ఒకే ప్రాంతం పేరును రెండు భాషల్లో చూసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ ఢిల్లీలోని ప్రాంతాల పేర్లు ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ కనిపిస్తాయి. ముంబైలో ఇంగ్లిష్‌తో పాటు మరాఠీ పేర్లను కూడా చూడవచ్చు. స్థానిక భాషల్లో ఉండే బోర్డులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఒకే ప్రయాణంలో 15 ప్రాంతాలను జోడించే ఛాన్స్..

యాపిల్ మ్యాప్స్ లో మల్టీ ప్టాప్ రూటింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఒకే ప్రయాణంలో గరిష్ఠంగా 15 ప్రాంతాలను జోడించుకోవచ్చు. ఉదాహరణకు ఒకే రోజు ఐదు లేదా పది ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. ఒక్కోసారి కొత్త రూట్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ముందుగానే అన్ని ప్రాంతాలను జోడించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మ్యాక్ లేదా ఐపాడ్ లో రూపొందించిన రూట్‌ను ఐఫోన్‌తో సింక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

అలాగే షేర్ ఈటీఏ ఫీచర్ ద్వారా మీ ప్రయాణానికి పట్టే అంచనా సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవచ్చు. మార్గమధ్యంలో ఆలస్యం జరిగితే వారికి అప్‌డేట్ చేసిన సమయం కూడా అందుతుంది.

మెట్రో, బస్సు, రైలు ప్రయాణ వివరాలు..

యాపిల్ మ్యాప్స్ లో ప్రజా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ట్రాన్సిట్ స్టేషన్లను గుర్తించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా మార్గాలతో పాటు భారతీయ రైల్వే ప్రయాణాన్ని కూడా ప్లాన్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రయాణ సమయంలో దిగాల్సిన స్టేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ పొందవచ్చు. తరచుగా ఉపయోగించే రూట్లను సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

సైకిల్ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఫీచర్..

సైకిల్‌పై ప్రయాణించే వారి కోసం యాపిల్ మ్యాప్స్ లో సైక్లింగ్ డైరెక్షన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందులో ప్రయాణించే మార్గంలో ఎత్తుపల్లాలు, సైకిల్ లేన్లు, మెట్లు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

దీంతో సైకిల్ ప్రయాణికులు తమకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. అవసరమైతే తమకు నచ్చిన రూట్లను రూపొందించుకుని సేవ్ చేసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్ కు యాపిల్ మ్యాప్స్ గట్టి పోటీ ఇస్తుందా?

భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌కు ఇప్పటికే భారీ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉండటం దీనికి కలిసొస్తోంది. మరోవైపు మ్యాపిల్స్ వంటి భారతీయ నావిగేషన్ యాప్‌లు కూడా వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో యాపిల్ మ్యాప్స్ లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు ఐఫోన్ వినియోగదారులకు మరో నావిగేషన్ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. 3D ల్యాండ్‌మార్క్స్, లుక్ అరౌండ్, ఏఆర్ వాకింగ్ డైరెక్షన్, స్థానిక భాషల్లో ప్రాంతాల పేర్లు వంటి సదుపాయాలు యాప్ వినియోగాన్ని మరింత సులభతరం చేయవచ్చు.

అయితే నావిగేషన్ యాప్‌ల పనితీరును నిర్ణయించేది రోడ్లపై వాటి ఖచ్చితత్వమే. ట్రాఫిక్, రోడ్ల మరమ్మతులు, మార్గాల మార్పులు, ఇరుకైన వీధులు వంటి పరిస్థితుల్లో యాపిల్ మ్యాప్స్ ఎంత సమర్థంగా పనిచేస్తుందో వినియోగదారుల అనుభవమే తేల్చనుంది. గూగుల్ మ్యాప్స్‌ను వినియోగదారులు వదిలి యాపిల్ మ్యాప్స్‌కు మారుతారా లేదా అన్నది వేచి చూడాలి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.