కొత్త మ్యాక్‌‌ నుంచి స్మార్ట్ హోమ్ హబ్ వరకు.. అక్టోబర్‌లో యాపిల్ రిలీజ్ చేయనున్న ప్రోడక్ట్స్ ఇవే..

Apple October Launches: టెక్ దిగ్గజం యాపిల్ ఈ అక్టోబర్‌లో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ హోమ్ హబ్, కొత్త మ్యాక్ మోడల్స్, ఇతర డివైజెస్‌తో టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Venkat
Published on: 6 Oct 2026 11:44 AM IST
Apple October Launches
X

కొత్త మ్యాక్‌‌ నుంచి స్మార్ట్ హోమ్ హబ్ వరకు.. అక్టోబర్‌లో యాపిల్ రిలీజ్ చేయనున్న ప్రోడక్ట్స్ ఇవే..

Apple October Launches: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సెప్టెంబర్ వేడుకల తర్వాత ఇప్పుడు అక్టోబర్‌లో మరోసారి వరుస లాంచ్‌లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధమవుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ నెలలో రెండు విడతలుగా కొత్త ఉత్పత్తులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్స్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తున్న స్మార్ట్ హోమ్ హబ్ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

చాలా కాలంగా అభివృద్ధిలో ఉన్న ఈ డివైజ్ సుమారు ఆరు అంగుళాల చదరపు డిస్‌ప్లేతో రానుందని తెలుస్తోంది. ఇది టేబుల్‌పై ఉంచుకునేలా, గోడకు మౌంట్ చేసుకునేలా రెండు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. దీనిద్వారా స్మార్ట్ హోమ్ కంట్రోల్స్‌తో పాటు ఫేస్‌టైమ్, ఫోటోల వీక్షణ, మ్యూజిక్ ప్లేబ్యాక్, విడ్జెట్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో సిరి ఏఐ ప్రధాన పాత్ర పోషించనుంది.

ఇక తొలి విడత అక్టోబర్ 13న కొత్త స్మార్ట్ హోమ్ హబ్ తో పాటు రెండవ తరం హోమ్‌పాడ్ మినీ, అప్‌డేటెడ్ ఆపిల్ టీవీ 4కె లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. హోమ్‌పాడ్ మినీ, ఆపిల్ టీవీ 4కె డిజైన్ పరంగా ఒకేలా ఉన్నప్పటికీ, ఇంటర్నల్ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది. హోమ్‌పాడ్ మినీ కొత్త చిప్, మెరుగైన ఆడియో, ఎన్1 వైర్‌లెస్ చిప్, కలర్ ఆప్షన్స్‌తో రావచ్చు. ఆపిల్ టీవీ 4కె వేగవంతమైన చిప్, ఎన్1 చిప్, అప్‌డేటెడ్ సిరి రిమోట్‌ను పొందనుంది.

ఇక రెండవ విడతగా అక్టోబర్ చివరి వారంలో మ్యాక్ ఉత్పత్తులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగా ఓఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన హై-ఎండ్ మాక్‌బుక్ ప్రొ, ఎం6 చిప్‌‌తో కూడిన బేస్ 14-అంగుళాల మాక్‌బుక్ ప్రొ, కొత్త ఐమ్యాక్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే ఓఎల్‌ఈడీ స్క్రీన్, ఏ20 ప్రొ చిప్‌తో కూడిన కొత్త ఐప్యాడ్ మినీ కూడా ఈ నెలలోనే అరంగేట్రం చేయవచ్చని తెలుస్తోంది. చివరిగా ఎం5 అల్ట్రా చిప్, 512జీబీ వరకు ర్యామ్‌తో కూడిన హై-ఎండ్ మ్యాక్ స్టూడియో కూడా అక్టోబర్ చివరి నాటికి రానుందని సమాచారం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.