Apple Pay: త్వ‌ర‌లోనే భార‌త్‌లో యాపిల్ పే సేవ‌లు.. ఇంత‌కీ ఎలా ప‌నిచేస్తుందంటే.?

Apple Pay: భారత్‌లో యాపిల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Apple Pay ఫీచ‌ర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది.

Mokshith
Published on: 11 Aug 2026 11:33 AM IST
Apple Pay
X

Apple Pay: త్వ‌ర‌లోనే భార‌త్‌లో యాపిల్ పే సేవ‌లు.. ఇంత‌కీ ఎలా ప‌నిచేస్తుందంటే.?

Apple Pay: భారత్‌లో యాపిల్ వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Apple Pay ఫీచ‌ర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్‌లో Apple Pay భారత్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

యాపిల్ పే ఎలా పనిచేస్తుంది?

యాపిల్ పే ప్రారంభమైన తర్వాత వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ వివరాలను యాపిల్ వాలెట్ యాప్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్ లేదా ఇతర దుకాణాల్లో చెల్లింపు చేయాల్సిన సమయంలో ఐఫోన్ లేదా ఐపాడ్‌ను POS మెషీన్‌కు దగ్గరగా ట్యాప్ చేస్తే ట్రాన్సాక్ష‌న్‌ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం NFC (Near Field Communication) టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. దీంతో కార్డ్‌ను చేతిలో తీసి స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు వేగంగా, సురక్షితంగా పూర్తవుతాయి.

మొదట క్రెడిట్ కార్డులకే అవకాశం

యాపిల్‌పే ప్రారంభ దశలో వీసా, మాస్ట‌ర్‌కార్డ్ నెట్‌వర్క్‌కు చెందిన క్రెడిట్ కార్డులు మాత్రమే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా Apple Pay ఇదే విధంగా పనిచేస్తోంది. డెబిట్ కార్డులు లేదా ఇతర చెల్లింపు విధానాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రారంభ దశలో క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని పెంచడంపైనే యాపిల్‌ దృష్టి పెట్టినట్లు సమాచారం.

UPI కోసం ఇంకా వేచి చూడాల్సిందే

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల్లో UPI ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, Apple Pay ప్రారంభ సమయంలో UPI సపోర్ట్ ఉండదు. UPI సేవలను అందించాలంటే యాపిల్‌, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి ఒక స్పాన్సర్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కూడా అవసరం. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే Apple Payలో UPI సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై Apple ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రతి లావాదేవీపై యాపిల్‌కు ఆదాయం

Apple Pay ద్వారా జరిగే ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీపై Appleకు కొంత ఫీజు వచ్చే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ప్రతి ట్రాన్సాక్షన్‌పై 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు (Basis Points) వాటాగా ఇవ్వాలని Apple బ్యాంకులతో చర్చించినట్లు సమాచారం. అయితే కొన్ని పెద్ద బ్యాంకులు 10 బేసిస్ పాయింట్లకే పరిమితం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.

భారత్‌లో క్రెడిట్ కార్డ్ వినియోగం పెరిగే అవకాశం

యాపిల్‌పే అందుబాటులోకి వస్తే ఐఫోన్ యూజ‌ర్ల‌కు చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. కార్డ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్‌తోనే సెకన్లలో చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, Apple Pay రాకతో భారత్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు, క్రెడిట్ కార్డ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే UPI సపోర్ట్ ఎప్పుడు వస్తుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story