యాపిల్ యూజర్లకు షాక్.. యాప్ స్టోర్ నుంచి ఐక్లౌడ్ వరకు అన్నీ బంద్
Apple Services Outage: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ వినియోగదారులకు ఊహించని సాంకేతిక ఇబ్బంది ఎదురైంది.
యాపిల్ యూజర్లకు షాక్.. యాప్ స్టోర్ నుంచి ఐక్లౌడ్ వరకు అన్నీ బంద్
Apple Services Outage: ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ వినియోగదారులకు ఊహించని సాంకేతిక ఇబ్బంది ఎదురైంది. సంస్థకు చెందిన అత్యంత కీలకమైన ప్లాట్‌ఫామ్‌లన్నీ ఒక్కసారిగా పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్‌కేర్ ఆన్ డివైస్‌తో పాటు ఐక్లౌడ్ అకౌంట్ , సైన్ ఇన్ సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల వినియోగదారులు కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, మ్యూజిక్ వినడం, తమ అకౌంట్లలోకి లాగిన్ అవ్వడం వంటి కనీస పనులు కూడా చేయలేకపోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11.40 గంటల నుంచే సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు గుర్తించిన యూజర్లు, డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు పంపారు.
సైబర్ దాడి కాదన్న యాపిల్.. అసలు కారణం ఇదే
యాపిల్ సేవలన్నీ ఒకేసారి నిలిచిపోవడంతో దీని వెనుక ఏదైనా పెద్ద సైబర్ దాడి జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ప్రచారాన్ని యాపిల్ సంస్థ పూర్తిగా కొట్టిపారేసింది. ఇది సైబర్ దాడి కాదని, అంతర్గతంగా తలెత్తిన సాంకేతిక లోపం వల్లే సేవలకు అంతరాయం కలిగిందని స్పష్టం చేసింది. యాపిల్ ఎకోసిస్టమ్‌లోని సేవలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తుంటాయని, ముఖ్యంగా అకౌంట్ , సైన్ ఇన్ వ్యవస్థల్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే యాప్ స్టోర్ నుంచి ఐక్లౌడ్ వరకు అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ప్రభావం పడిందని సంస్థ వివరించింది.
వరుస అంతరాయాలతో టెక్, బ్యాంకింగ్ రంగాల్లో కలకలం
గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా కీలక డిజిటల్ వ్యవస్థలు వరుసగా సాంకేతిక సమస్యలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. యాపిల్ కంటే ముందే నవంబర్ 16న అమెరికాలోని ప్రముఖ చేజ్ బ్యాంక్ సేవలు నిలిచిపోవడంతో వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జెల్లే వినియోగదారులు కూడా లావాదేవీల్లో ఇబ్బందులు పడ్డారు. అంతకుముందు నవంబర్ 13న అమెరికా విమానయాన రంగంలో కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థల అస్థిరత వల్ల ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) గత 25 ఏళ్లలో తొలిసారిగా దేశవ్యాప్త గ్రౌండ్ స్టాప్ విధించాల్సి వచ్చింది. ఇక నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ సేవలు మొరాయించడంతో ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలతో పాటు మారియట్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లకు కూడా ఆటంకం కలిగింది. ప్రయాణాలు, బ్యాంకింగ్, ఆఫీస్ పనులు ఇలా ప్రతిదీ ఆన్‌లైన్ వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, ఇలాంటి వరుస అంతరాయాలు డిజిటల్ భద్రత , బ్యాకప్ వ్యవస్థల సామర్థ్యంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.




