Layoffs: ఇక బ్యాంకుల వంతు.. 3100 మందిని తొలగించిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్
Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యామాని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Layoffs
Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యామాని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు టెక్ కంపెనీలకే పరిమితమైన ఈ ఉద్యోగాల తొలగింపు ఇప్పుడు బ్యాంకులకు కూడా చేరింది. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ సైతం ఉద్యోగులను తొలగించింది.
3100 మంది తొలగింపు
ప్రముఖ ప్రేవట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ గత ఒక్క ఏడాదిలోనే సుమారు 3,100 మంది ఉద్యోగులను తగ్గించింది. 2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,01,300గా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,04,400 మంది ఉండగా, ఈసారి తగ్గింది. అలాగే గత త్రైమాసికంతో పోలిస్తే కూడా 552 మంది ఉద్యోగులు తగ్గారు.
బ్రాంచ్‌లు పెరిగినా ఉద్యోగాలు తగ్గడం
ఆశ్చర్యకరంగా ఉద్యోగులు తగ్గించినప్పటికీ, బ్యాంక్ తన విస్తరణను కొనసాగించింది. Q4లో 166 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించగా, మొత్తం FY26లో 400 బ్రాంచ్‌లు ప్రారంభించింది. అంటే ఒక వైపు బ్యాంకు విస్తరణ కొనసాగుతుండగా, మరో వైపు ఉద్యోగులను తగ్గించడం గమనార్హం.
టెక్నాలజీ ప్రభావం
బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరీ ప్రకారం, ఈ ఉద్యోగాల తగ్గింపుకు ప్రధాన కారణం డిజిటల్ మార్పు.
బ్యాంక్ గత 3–4 సంవత్సరాలుగా మొత్తం ఖర్చుల్లో 9–10% టెక్నాలజీకి కేటాయిస్తోంది. టెక్నాలజీ ఖర్చులు ఈ ఏడాది 14% పెరిగాయి. మొత్తం ఆపరేటింగ్ ఖర్చుల్లో దాదాపు 10% టెక్నాలజీకే వెళ్తోంది. డిజిటల్ సేవలు పెరగడంతో మానవ వనరుల అవసరం కొంత తగ్గిందని బ్యాంక్ తెలిపింది.
Q4 ఫలితాలు – లాభాల్లో స్వల్ప తగ్గుదల
Q4లో యాక్సిస్ బ్యాంక్ లాభం పెద్దగా పెరగలేదు. ఈసారి లాభం రూ. 7,071 కోట్లు కాగా గత ఏడాది ఇదే కాలంలో రూ. 7,117 కోట్లుగా ఉంది. ట్రెజరీ ఆదాయం తగ్గడం, ప్రొవిజన్లు పెరగడం వంటివి లాభం తగ్గడానికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూ. 2,001 కోట్ల ప్రొవిజన్‌ను బ్యాంక్ ఏర్పాటు చేసింది. సీఈఓ పునీత్ శర్మ ప్రకారం ఇది ముందస్తు జాగ్రత్త చర్య మాత్రమే, ఆస్తుల నాణ్యత తగ్గిందని అర్థం కాదని అన్నారు.




