BenQ : మ్యాక్ యూజర్లకు బెన్క్యూ సర్‌ప్రైజ్.. కొత్త గ్యాడ్జెట్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ 'బెన్క్యూ' (BenQ) ముంబైలో నిర్వహించిన 'ఇన్ఫోకామ్ 2026' (InfoComm 2026) వేదికగా మూడు సరికొత్త అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించి

G Krishna
Published on: 19 Sept 2026 12:51 PM IST
BenQ : మ్యాక్ యూజర్లకు బెన్క్యూ సర్‌ప్రైజ్.. కొత్త గ్యాడ్జెట్లు
X

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ 'బెన్క్యూ' (BenQ) ముంబైలో నిర్వహించిన 'ఇన్ఫోకామ్ 2026' (InfoComm 2026) వేదికగా మూడు సరికొత్త అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించి టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఆఫీస్ వర్క్‌స్పేస్ వాతావరణాన్ని , డెస్క్ సెటప్‌ను డిజిటల్ శైలికి అనుగుణంగా సరికొత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'iScreenBar', 'iScreenBar Max' లైటింగ్ సిస్టమ్‌లతో పాటు యాపిల్ (Apple) మ్యాక్ ఇకోసిస్టమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'INFTYLAB' యాక్సెసరీలను కంపెనీ ప్రదర్శించింది. వీటిని ఇదివరకు బెర్లిన్‌లో జరిగిన IFA 2026లో ప్రదర్శించినప్పటికీ, భారత మార్కెట్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ ఉత్పత్తుల లభ్యత, అధికారిక విక్రయ తేదీలు , ధరల వివరాలను బెన్క్యూ త్వరలోనే ప్రకటించనుంది.

యాపిల్ ఐమ్యాక్ కోసం ప్రత్యేక 'iScreenBar'

చిన్న రకం మానిటర్లు, ముఖ్యంగా యాపిల్ ఐమ్యాక్ (iMac) వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బెన్క్యూ 'iScreenBar' లైటింగ్ సిస్టమ్‌ను రూపుదిద్దింది. ఇది అత్యంత కాంపాక్ట్ సైజులో ఉండి, ఐమ్యాక్ వెనుక భాగంలో మ్యాగ్నెటిక్ పద్ధతిలో చాలా సులభంగా అమరిపోతుంది. ఇందులో మైక్రోఫోన్ కోసం ప్రత్యేకమైన క్యావిటీని కూడా అందించారు. రాత్రి వేళల్లో లేదా తక్కువ వెలుతురు ఉన్న సమయంలో కళ్లపై ఒత్తిడి పడకుండా పనిచేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో ఐమ్యాక్ స్క్రీన్‌పై కాంతి పడకుండా లైట్ బార్‌లోని ఒక భాగాన్ని మాత్రమే ఆఫ్ చేసే ప్రత్యేక మోడ్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. పాత మోడళ్లతో పోలిస్తే, ఈ కొత్త వర్షన్‌లో కంట్రోల్స్ అన్నీ లైట్ బార్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి.

డ్యూయల్ మానిటర్ సెటప్ కోసం 'ScreenBar Max'

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మానిటర్లు ఉపయోగించే హెవీ వర్క్‌స్పేస్ యూజర్ల కోసం బెన్క్యూ 'ScreenBar Max' ను ఆవిష్కరించింది. ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉండి, డ్యూయల్ మానిటర్ సెటప్ మొత్తానికి తగినంత వెలుతురును అందిస్తుంది. బెన్క్యూ తీసుకొచ్చిన అతిపెద్ద డెస్క్ లైటింగ్ సొల్యూషన్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఈ లైట్ బార్‌లోనే చిన్న డిస్‌ప్లే , కంట్రోల్స్‌ను ఇన్-బిల్ట్‌గా అమర్చారు. అయితే దీనిని మానిటర్‌పై నేరుగా అమర్చడానికి వీలుండదు, దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా ఇండపెండెంట్ మౌంటింగ్ సిస్టమ్‌ను అందించింది.

మ్యాక్ వినియోగదారుల కోసం ప్రీమియం 'INFTYLAB' యాక్సెసరీలు

యాపిల్ మ్యాక్ ఇకోసిస్టమ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి బెన్క్యూ 'INFTYLAB' బ్రాండ్ కింద మూడు ప్రీమియం పరికరాలను ప్రదర్శించింది. అందులో మొదటిదైన 'స్టూడియో ఆర్మ్' (Studio Arm), యాపిల్ స్టూడియో డిస్‌ప్లే, స్టూడియో డిస్‌ప్లే XDR , ఐమ్యాక్ పరికరాలకు డెస్క్‌పై వైర్లు ఏవీ కనిపించకుండా క్లీన్ లుక్ అందించడమే కాకుండా స్క్రీన్‌ను ఏ కోణంలోనైనా తిప్పుకోవడానికి పూర్తి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఇది VESA , స్టాండ్ మోడళ్లలో C-క్లాంప్, గ్రామెట్ బేస్‌తో లభిస్తుంది.

అలాగే లాంచ్ చేసిన 'M మౌస్' (M Mouse) తేలికపాటి డిజైన్‌తో వచ్చి, రెండు స్క్రోల్ వీల్స్ , మూడు కస్టమైజబుల్ బటన్లను కలిగి ఉంది. బ్లూటూత్ ద్వారా ఒకేసారి మూడు పరికరాలకు కనెక్ట్ అయ్యే సదుపాయం ఉన్న ఈ మౌస్‌ను 'Glide' డెస్క్‌టాప్ యాప్ సాయంతో కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు వర్క్‌స్పేస్‌కు రాయల్ లుక్ అందించే 'ఫ్లో డెస్క్ మ్యాట్' (Flow Desk Mat) ను కూడా బెన్క్యూ ఈ వేదికగా పరిచయం చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.