లీకైన మాస్ ఎఫెక్ట్ గేమ్ ట్రైలర్.. రద్దయిన గేమ్‌లో ఇవే హైలైట్స్..!
Mass Effect Universe: బయోవేర్ మూసివేతతో అభివృద్ధి మధ్యలోనే ఆగిపోయిన కొత్త మాస్ ఎఫెక్ట్ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా బయటకు వచ్చింది. ‘మాస్ ఎఫెక్ట్: యూనివర్స్’ పేరుతో ఉన్న ఈ వీడియోలో లియారా టి’సోనీకి సంబంధించిన దృశ్యాలు కనిపించింది.
లీకైన మాస్ ఎఫెక్ట్ గేమ్ ట్రైలర్.. రద్దయిన గేమ్‌లో ఇవే హైలైట్స్..!
Mass Effect Universe: ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ సంస్థ బయోవేర్‌ను మూసివేయడంతో రద్దయిన కొత్త మాస్ ఎఫెక్ట్ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ‘మాస్ ఎఫెక్ట్: యూనివర్స్’ పేరుతో ఉన్న ఈ ట్రైలర్‌లో గేమ్ అభివృద్ధి దశకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గేమ్‌ను పూర్తిస్థాయిలో విడుదల చేయడానికి ముందే ప్రాజెక్ట్ నిలిచిపోయింది. 2017లో వచ్చిన ‘మాస్ ఎఫెక్ట్: ఆండ్రోమెడ’ తర్వాత ఈ సిరీస్‌లో రావాల్సిన తదుపరి ప్రధాన గేమ్ ఇదే.
ట్రైలర్‌లో ఆసక్తికర దృశ్యాలు..
ఈ ట్రైలర్ మొదట ఎనభైల నాటి సంగీతాన్ని గుర్తు చేసే నేపథ్యంతో ప్రారంభమవుతుంది. ఇందులో కొత్త పాత్రలను పరిచయం చేశారు. కథలోని ప్రధాన మానవ పాత్ర వెలుగులతో నిండిన ఒక బార్‌లోకి ప్రవేశించి అసారీ జాతికి చెందిన మహిళా ప్రతినిధితో మాట్లాడుతుంది.
తన గత సైనిక జీవితం, ప్రస్తుతం కిరాయి సైనికుడిగా కొనసాగుతున్న విషయాలను ఆమెతో ప్రధాన పాత్ర చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత అసారీ ప్రతినిధే తన లక్ష్యమని తెలుస్తుంది. దీంతో బార్‌లో ఘర్షణ మొదలవుతుంది.
ఈ సన్నివేశంలో మాస్ ఎఫెక్ట్ పాత గేమ్‌లలో ప్రముఖ పాత్ర అయిన డాక్టర్ లియారా టి’సోనీ కూడా కనిపిస్తుంది. ప్రధాన పాత్ర బృందంలో ఆమె ఉన్నట్లు ట్రైలర్‌లో చూపించారు.
పోరాటాలు, అన్వేషణకు సంబంధించిన దృశ్యాలు..
బార్‌లో జరిగే సన్నివేశంతో పాటు గేమ్‌లోని పోరాటాలు, ప్రత్యేక సామర్థ్యాలు, వివిధ ప్రాంతాల్లో అన్వేషణ, అంతరిక్ష నౌక ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలు కూడా ట్రైలర్‌లో ఉన్నాయి. మాస్ ఎఫెక్ట్ ప్రపంచంలోని వివిధ జాతులకు చెందిన పాత్రలను కూడా ఇందులో చూడవచ్చు.
ఈ వీడియోలో కనిపించే దృశ్యాలు గేమ్‌ను రూపొందించే సమయంలో ఉపయోగించిన దృశ్యాలు, ప్రారంభ అభివృద్ధి దశలో రూపొందించిన అంశాలకు సంబంధించినవని ట్రైలర్ ప్రారంభంలో పేర్కొంది.
ట్రైలర్ నిజమైనదేనా?
ఈ ట్రైలర్‌ను తొలుత రెడిట్, యూట్యూబ్‌లో ప్రచురించారు. తర్వాత ఇది నిజమైన వీడియోనే అని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన జేసన్ ష్రేయర్ ధృవీకరించారు. బయోవేర్ మూసివేయబడే వరకు ఈ గేమ్ అభివృద్ధి కొనసాగిందని ఆయన తెలిపారు.
గేమ్ అభివృద్ధికి మైఖేల్ గాంబుల్ నాయకత్వం వహించినట్లు సమాచారం. 2024లో గాంబుల్ ఈ గేమ్‌లో పరిణతి చెందిన కథనం, వాస్తవిక దృశ్య శైలిని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఇవి మొదటి మూడు మాస్ ఎఫెక్ట్ గేమ్‌లకు దగ్గరగా ఉండేలా రూపొందించనున్నట్లు అప్పట్లో సంకేతాలు ఇచ్చారు.
మాస్ ఎఫెక్ట్ సిరీస్‌కు ముగింపు దశ?
మాస్ ఎఫెక్ట్‌లోని మొదటి మూడు గేమ్‌లు 2007 నుంచి 2012 మధ్య విడుదలయ్యాయి. ఆటగాళ్ల నిర్ణయాలకు అనుగుణంగా కథలో మార్పులు చోటుచేసుకునే విధానంతో ఈ సిరీస్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 2021లో మొదటి మూడు గేమ్‌లను మెరుగుపరిచిన రూపంలో ‘మాస్ ఎఫెక్ట్ లెజెండరీ ఎడిషన్’గా విడుదల చేశారు.
2017లో వచ్చిన ‘మాస్ ఎఫెక్ట్: ఆండ్రోమెడ’ కొత్త కథ, పాత్రలతో వచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలు, లోపాలు, కథనం, పాత్రల విషయంలో విమర్శలు ఎదుర్కొంది.
ఈ వారంలో ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ బయోవేర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు తదుపరి మాస్ ఎఫెక్ట్ గేమ్‌ను రద్దు చేసింది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం సంస్థ ఉద్యోగుల కోతల్లో సుమారు 400 మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వీరిలో దాదాపు 50 మంది బయోవేర్‌కు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
1995లో కెనడాలోని ఎడ్మంటన్‌లో ప్రారంభమైన బయోవేర్ ‘బాల్డర్స్ గేట్’, ‘స్టార్ వార్స్: నైట్స్ ఆఫ్ ది ఓల్డ్ రిపబ్లిక్’, ‘డ్రాగన్ ఏజ్’, ‘మాస్ ఎఫెక్ట్’ వంటి ప్రముఖ గేమ్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2007లో ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఈ సంస్థను కొనుగోలు చేసింది. బయోవేర్ చివరి గేమ్ ‘డ్రాగన్ ఏజ్: ది వీల్‌గార్డ్’ 2024లో విడుదలైంది.




