RBI SOP For Cyber Frauds: డిజిటల్ అరెస్ట్ మోసాలకు చెక్.. ఇకపై 'బయోమెట్రిక్' వెరిఫికేషన్ పక్కా..!
RBI SOP For Cyber Frauds: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వణికిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
RBI SOP For Cyber Frauds
Biometric SIM Verification Rules: దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. అటార్నీ జనరల్ ద్వారా సమర్పించిన ఈ నివేదికలో సైబర్ నేరాలను ప్రాథమిక దశలోనే ఎలా అడ్డుకోవచ్చో వివరించారు. టెలికాం రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సిఫార్సులను రూపొందించారు. దీనిని అమలు చేసేందుకు భారత రిజర్వ్ బ్యాంక్, టెలీకమ్యూనికేషన్ విభాగాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం కోర్టును కోరింది.
బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి..
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నకిలీ గుర్తింపు పత్రాలతో తీసుకున్న సిమ్ కార్డుల ద్వారానే ఈ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిని నిరోధించేందుకు సిమ్ కార్డు జారీ చేసే సమయంలో బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే, సిమ్ కార్డులను విక్రయించే పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా అక్రమ సిమ్ కార్డుల సరఫరాకు అడ్డుకట్ట వేయవచ్చని కేంద్రం భావిస్తోంది.
సాంకేతిక నియంత్రణ, ఖాతాల నిలిపివేత..
సామాజిక మాధ్యమాల ద్వారా సాగే కాల్స్‌ను నియంత్రించేందుకు వాట్సప్ వంటి సంస్థలు 'సిమ్ బైండింగ్ మెకానిజం'ను పటిష్టం చేయాలని కేంద్రం సూచించింది. ఎక్కువ సమయం పాటు సాగే అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించే అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కోరింది.
మరోవైపు, సైబర్ నేరాలకు ఉపయోగించిన డిజిటల్ పరికరాల (డివైజ్) ఐడీలను గుర్తించి వెంటనే బ్లాక్ చేయడం ద్వారా, ఆ పరికరం నుంచి మరోసారి నేరం జరగకుండా చూడవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కాకుండా తాత్కాలికంగా నిలిపివేసేలా ఆర్‌బీఐ ఒక ప్రత్యేక విధానాన్ని (ఎస్‌ఓపి) రూపొందించాలని కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తే డిజిటల్ అరెస్ట్ మోసాలకు ముగింపు పలకవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.




