WhatsApp Malware: వాట్సాప్ మాల్వేర్ దాడికి చెక్.. 10 వేల మందికి రక్షణ
వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునే మాల్వేర్ దాడిని కేంద్రం అడ్డుకుంది. ఐ4సీ చర్యలతో 10 వేల మందికి పైగా భారతీయులు రక్షించబడ్డారు.
WhatsApp Malware
వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునే మాల్వేర్ దాడిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చేపట్టిన సమన్వయ చర్యలతో ఇప్పటివరకు 10 వేలకు పైగా భారతీయులను ఈ సైబర్ మోసం నుంచి రక్షించినట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సహయోగ్ పోర్టల్ ద్వారా మాల్వేర్‌కు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్లను భౌగోళికంగా నిరోధించడంతోపాటు పలు చర్యలు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో వాట్సాప్ ఖాతాల స్వాధీనానికి సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగినట్లు I4C గుర్తించింది.
ఖాతా స్టేట్‌మెంట్లు, నియంత్రణ సంస్థల నుంచి వచ్చినట్లు కనిపించే సందేశాల పేరుతో హానికరమైన ఫైళ్లను పంపి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడులకు సంబంధించి ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఒకే తరహా ఘటనలు నమోదయ్యాయి.
ఈ ముప్పుపై I4C గత జూన్ 22న ప్రజలను అప్రమత్తం చేసింది. నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ అధికారుల పేర్లను ఉపయోగించి వాట్సాప్ ఖాతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది.
జిప్ ఫైల్ ఓపెన్ చేస్తే ముప్పే
బాధితులకు వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా జిప్ ఫైళ్లు పంపిస్తున్నారు. ‘స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్’ వంటి పేర్లతో పాటు తేదీని జతచేసిన ఫైళ్లు, అలాగే ఆర్‌బీఐ, ఎంసీఏ పేర్లతో ఉన్న ఫైళ్లను పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ సందేశాలు సాధారణ ఖాతా స్టేట్‌మెంట్లు లేదా నియంత్రణ సంస్థల అత్యవసర నోటీసుల మాదిరిగా కనిపించేలా రూపొందిస్తున్నారు. దీంతో వాటిని వెంటనే తెరవాలనే విధంగా బాధితులను ప్రేరేపిస్తున్నారు.
విండోస్ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో జిప్ ఫైల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేసి తెరిచినప్పుడు ట్రోజన్ మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. అది కంప్యూటర్‌ను దెబ్బతీయడంతో పాటు బాధితుడి యాక్టివ్ వాట్సాప్ వెబ్ సెషన్‌ను సైబర్ నేరగాళ్లు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ పేరుతో కూడా నకిలీ ఈ-మెయిళ్లు పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది.
కాంటాక్టులకు మాల్వేర్ ఫైల్ పంపిస్తున్న హ్యాకర్లు
వాట్సాప్ ఖాతా స్వాధీనం చేసుకున్న తర్వాత సైబర్ నేరగాళ్లు అదే హానికరమైన ఫైల్‌ను బాధితుడి కాంటాక్టులు, గ్రూపులకు ఆటోమేటిక్‌గా పంపిస్తున్నారు. కంపెనీ ఆర్థిక విభాగం మేనేజర్‌కు ధ్రువీకరణ కోసం ఈ ఫైల్‌ను ఫార్వర్డ్ చేయాలని, కంప్యూటర్‌లో తెరవాలని సూచిస్తూ సందేశాలు పంపుతున్నారు.
దీంతో మాల్వేర్ మరింత మందికి వ్యాపించడమే కాకుండా సంస్థల కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి కూడా చొరబడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. సహయోగ్ పోర్టల్ ద్వారా మాల్వేర్‌ను నిరంతరం నిరోధిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.




