eMudhra యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. మీ కంప్యూటర్‌లో ఫైళ్ల పేర్లు లీక్ కావచ్చు

డిజిటల్ సిగ్నేచర్ కోసం eMudhra emBridge వాడుతున్నారా? ఆ సాఫ్ట్‌వేర్‌లో ఫైళ్లు, ఫోల్డర్ల పేర్లు బయటపడే భద్రతా లోపాన్ని CERT-In గుర్తించింది.

CR Reddy
Published on: 17 Nov 2026 8:21 AM IST
eMudhra యూజర్లకు కేంద్రం హెచ్చరిక.. మీ కంప్యూటర్‌లో ఫైళ్ల పేర్లు లీక్ కావచ్చు
X

eMudhra: డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి ప్రభుత్వ వెబ్‌సైట్లలో పనులు చేస్తున్నారా? అయితే మీ కంప్యూటర్‌లో ఉన్న eMudhra emBridge సాఫ్ట్‌వేర్‌ను ఒకసారి తనిఖీ చేసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపం ఉన్నట్లు భారత ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ CERT-In గుర్తించింది. దీని ద్వారా సైబర్ దాడి చేసేవారు కంప్యూటర్‌లో ఉన్న ఫైళ్లు, ఫోల్డర్ల పేర్లను తెలుసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఫైళ్లలోని సమాచారాన్ని చదవడం, వాటిని మార్చడం లేదా తొలగించడం ఈ లోపం ద్వారా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త వెర్షన్లను కూడా సూచించింది.

అసలు emBridge అంటే ఏంటి?

eMudhra సంస్థ రూపొందించిన emBridge అనేది కంప్యూటర్‌లో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, హార్డ్‌వేర్ టోకెన్లతో ప్రభుత్వ వెబ్‌సైట్లు అనుసంధానం కావడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్. సులభంగా చెప్పాలంటే.. ప్రభుత్వ పోర్టల్‌లో ఏదైనా పత్రంపై డిజిటల్ సంతకం చేయాలన్నా, సర్టిఫికెట్ ద్వారా ధ్రువీకరించాలన్నా ఇది ఉపయోగపడుతుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ MCA V3 పోర్టల్, విదేశీ వాణిజ్య విభాగం DGFT, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ వంటి వెబ్‌సైట్లలో దీన్ని ఉపయోగిస్తారు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోనూ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ల కోసం ఈ సాఫ్ట్‌వేర్ అవసరమవుతుంది.

అసలు భద్రతా లోపం ఎలా పనిచేస్తుంది?

CERT-In నవంబర్ 13న విడుదల చేసిన CIVN-2026-0549 నోట్ ప్రకారం.. emBridgeలోని FileBrowser APIలో అవసరమైన అనుమతి తనిఖీలు లేవు. దీని వల్ల ఒకే స్థానిక నెట్‌వర్క్‌లో ఉన్న సైబర్ దాడి చేసేవారు ప్రత్యేకంగా రూపొందించిన హానికర వెబ్‌పేజీ ద్వారా కంప్యూటర్‌లోని ఫైళ్లు, ఫోల్డర్ల పేర్లను తెలుసుకునే అవకాశం ఉంది. కంప్యూటర్‌లో ఏ డ్రైవ్‌లు ఉన్నాయి? వాటిలో ఎలాంటి ఫోల్డర్లు, ఫైళ్లు ఉన్నాయి? అనే వివరాలు బయటపడవచ్చు. అయితే ఈ లోపం ద్వారా ఫైళ్లలోని సమాచారాన్ని తెరిచి చదవడం, మార్చడం, డిలీట్ చేయడం లేదా కంప్యూటర్‌లో హానికర ప్రోగ్రామ్‌లను నడపడం సాధ్యం కాదని CERT-In స్పష్టం చేసింది. డిజిటల్ సిగ్నేచర్ కీలు, హార్డ్‌వేర్ టోకెన్ PINలు కూడా ఈ లోపం వల్ల బయటపడవు. ఈ భద్రతా సమస్యకు CERT-In తక్కువ స్థాయి ముప్పు (Low Severity)గా రేటింగ్ ఇచ్చింది.

ఏ వెర్షన్లలో సమస్య ఉంది?

CERT-In ప్రకారం Windowsలో emBridge 5.9.1.x నుంచి 5.9.3.x వరకు ఉన్న వెర్షన్లు, macOSలో 3.2.4.x నుంచి 3.2.6.x వరకు ఉన్న వెర్షన్లు ప్రభావితమయ్యాయి. Ubuntu, Red Hat ఆపరేటింగ్ సిస్టమ్‌లలో 3.2.0.x నుంచి 3.3.0.x వరకు ఉన్న వెర్షన్లలోనూ ఈ సమస్య ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు Windows యూజర్లు 5.9.4.x లేదా ఆ తర్వాతి వెర్షన్‌ను, macOS యూజర్లు 3.2.7.x లేదా కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. Ubuntu, Red Hat వాడేవారు 3.3.1.x లేదా ఆ తర్వాతి వెర్షన్‌కు అప్‌డేట్ కావాలని CERT-In సూచించింది.

నవంబర్ 11నే సమస్యను పరిష్కరించిన eMudhra

ఈ భద్రతా లోపాన్ని నవంబర్ 11న పరిష్కరించినట్లు eMudhra సంస్థ ప్రకటించింది. emBridgeలోని FileBrowser APIకి సంబంధించిన కొన్ని భాగాలను తొలగించడంతో ఫైళ్లు, ఫోల్డర్ల పేర్లను సేకరించే అవకాశం లేకుండా చేశామని తెలిపింది. అయితే పాత వెర్షన్ వాడుతున్న వారు మాత్రం వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. కంప్యూటర్‌లో emBridge ఏ వెర్షన్ ఉందో తనిఖీ చేసి, అవసరమైతే సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి తాజా వెర్షన్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇదిలా ఉండగా, గత అక్టోబర్‌లో eMudhraకు చెందిన కొన్ని అంతర్జాతీయ వెబ్‌సైట్ సర్టిఫికెట్లలోనూ భద్రతా సమస్య బయటపడింది. అయితే ఆ ఘటన భారతదేశంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు, eSign సేవలను ప్రభావితం చేయలేదని CERT-In స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.