ChatGPT Dots : చాట్‌జీపీటీ ఇక ఆగదు.. ‘డాట్స్’తో AI ఏజెంట్ల కొత్త శకం.!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో మరొక నెక్స్ట్-లెవెల్ ఆవిష్కరణకు శ్రీకారం చుడుతూ ఓపెన్ ఏఐ సంస్థ ‘చాట్‌జీపీటీ డాట్స్’ (ChatGPT Dots) పేరుతో..

G Krishna
Published on: 30 Sept 2026 1:01 PM IST
ChatGPT Dots : చాట్‌జీపీటీ ఇక ఆగదు.. ‘డాట్స్’తో AI ఏజెంట్ల కొత్త శకం.!
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో మరొక నెక్స్ట్-లెవెల్ ఆవిష్కరణకు శ్రీకారం చుడుతూ ఓపెన్ ఏఐ సంస్థ ‘చాట్‌జీపీటీ డాట్స్’ (ChatGPT Dots) పేరుతో ఒక శక్తివంతమైన ఏఐ ఏజెంట్ రంగాన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏఐ మోడళ్లకు ప్రతి చిన్న దశలోనూ యూజర్ స్వయంగా ప్రాంప్ట్‌లు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చేది. అయితే ఈ సరికొత్త సిస్టమ్‌లో ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించి వదిలేస్తే చాలు.. యూజర్ చాట్‌జీపీటీని క్లోజ్ చేసి బయటకు వెళ్లిపోయినా సరే, ఆ డాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో స్వయంప్రతిపత్తితో తన పనిని తాను క్రమబద్ధంగా పూర్తి చేసుకుంటుంది.

భవిష్యత్ సాంకేతికత.. జీపీటీ-6 ఆస్ట్రా అండ

ఈ కొత్త చాట్‌జీపీటీ డాట్స్ అత్యంత అధునాతనమైన 'జీపీటీ-6 ఆస్ట్రా' మోడల్ ఆధారంగా పనిచేస్తాయి. విశేషమేమిటంటే, ప్రతొక్క డాట్ ఏజెంట్‌కు ప్రత్యేకంగా ఒక క్లౌడ్ కంప్యూటర్ , వెబ్ బ్రౌజర్ కేటాయించబడతాయి. ఓపెన్ ఏఐ కి చెందిన విస్తృతమైన ప్లగిన్ ఈకోసిస్టమ్ ద్వారా దాదాపు 4,000 కంటే ఎక్కువ థర్డ్-పార్టీ యాప్‌లతో ఇవి సులువుగా అనుసంధానమై పనులను చక్కబెడతాయి. దీనివల్ల ఒకే సమయంలో బహుళ సంక్లిష్టమైన బాధ్యతలను స్వీకరించి, యూజర్‌కి సమయం వృధా కాకుండా స్వయంచాలకంగా ఫలితాలను సిద్ధం చేస్తాయి.

కోడింగ్ నుంచి నిత్యజీవిత పనుల వరకు సకల సేవలు

ఈ ఏఐ డాట్స్ సామర్థ్యం సాధారణ టెక్స్ట్ జనరేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా విస్తృతమైన రంగాలకు వ్యాపించి ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌లోని చిన్నపాటి లోపాలను పరీక్షించడం, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, సరికొత్త రీసెర్చ్ డేటాను సమగ్రంగా విశ్లేషించడం , మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సేల్స్ ప్రపోజల్స్‌ను నవీకరించడం వంటి పనులను ఇవి వేగంగా నిర్వహిస్తాయి. అంతేకాకుండా, పెద్ద ఇంటర్వ్యూ రికార్డింగ్‌ల నుంచి షార్ట్ క్లిప్‌లు, సోషల్ మీడియా పోస్టులను రూపొందించడం లాంటి క్రియేటివ్ పనులను కూడా ఇవి క్షణాల్లో పూర్తి చేస్తాయి. నిత్యజీవితంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో లభించే ఆఫర్లను పోల్చి చూసి, బెస్ట్ డీల్‌తో బిల్లును లెక్కించి ఆర్డర్ ఇచ్చేముందు మాత్రమే యూజర్ తుది అనుమతిని కోరడం వీటి పనితనానికి అద్దం పడుతుంది.

అధునాతన కనెక్టివిటీ , కట్టుదిట్టమైన భద్రత

చాట్‌జీపీటీ వేదికగానే కాకుండా స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ప్రసిద్ధ కమ్యూనికేషన్ యాప్‌ల ద్వారా కూడా ఈ డాట్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం ఇవి వాయిస్ కాల్స్‌‌కు సపోర్ట్ చేస్తుండగా, త్వరలోనే టెక్స్ట్ మెసేజింగ్ వెసులుబాటు కూడా రానుంది. భద్రత పరంగా ఓపెన్ ఏఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సమాచారాన్ని సేకరించే సమయంలో ఏజెంట్లు 'రీడ్-ఓన్లీ' మోడ్‌లోనే పనిచేస్తాయి, కాబట్టి యూజర్ అనుమతి లేకుండా ఇవి ఎలాంటి ఇమెయిళ్లు పంపడం గానీ, యాప్‌లలో మార్పులు చేయడం గానీ చేయలేవు. ఏవైనా ఖాతా లాగిన్లు, పాస్‌వర్డ్‌లు మార్చడం లేదా అత్యంత సున్నితమైన సమాచారంతో కూడిన పనులు ఉన్నప్పుడు యూజర్ స్వయంగా ప్రవేశించాల్సి ఉంటుంది. ఒకవేళ హానికరమైన లేదా అనుమానాస్పద ఆదేశాలను గుర్తిస్తే ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ ఆ డాట్ పనిని వెంటనే నిలిపివేస్తుంది.

వ్యాపార రంగానికి 'ఏజెంట్ 365' సహకారం

సాధారణ యూజర్ల కోసమే కాకుండా కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక 'ఆర్గనైజేషనల్ డాట్స్'ను కూడా ఓపెన్ ఏఐ పరీక్షస్తోంది. కంపెనీల అంతర్గత విధానాలకు తగినట్లుగా ఇవి ఇమెయిల్ మార్కెటింగ్, ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్, కస్టమర్ కేర్ సపోర్ట్, లీగల్ కాంట్రాక్టుల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. ఈ ఏజెంట్లను మైక్రోసాఫ్ట్‌తో కలిసి 'ఏజెంట్ 365' ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

ఎక్కడ అందుబాటులో ఉందంటే..

ప్రస్తుతం ఈ 'చాట్‌జీపీటీ డాట్స్' ఫీచర్ అర్హత కలిగిన మార్కెట్లలో ప్రో, బిజినెస్ ప్రీమియం , ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. మొదటి నెల ప్రమోషనల్ ఆఫర్‌గా ప్రో , బిజినెస్ ప్రీమియం వినియోగదారులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఒక డాట్‌ను ఉపయోగించుకునే పరిమితిని అందించారు. వెబ్, మొబైల్, డెస్క్‌టాప్ యాప్‌లలో ఇది పనిచేస్తున్నప్పటికీ, ప్రాథమికంగా డాట్ సెటప్‌ను ప్రారంభించడానికి డెస్క్‌టాప్ బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్లిష్ట పనులను నిర్వహించేలా ఈ డాట్స్ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు ఓపెన్ ఏఐ వెల్లడించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.