పేరెంట్స్ గుడ్ న్యూస్.. సెఫ్టీ ఫీచర్లతో టీనేజర్ల కోసం సరికొత్త చాట్‌జీపీటీ..!
ChatGPT for Teens: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో టెక్ కంపెనీలు భద్రతపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే టీనేజ్ పిల్లల కోసం ఓపెన్ ఏఐ సంస్థ ప్రత్యేకంగా ఒక కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది.
పేరెంట్స్ గుడ్ న్యూస్.. సెఫ్టీ ఫీచర్లతో టీనేజర్ల కోసం సరికొత్త చాట్‌జీపీటీ..!
ChatGPT for Teens: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఏఐ టెక్నాలజీని చిన్న పిల్లలు విపరీతంగా వాడుతున్నారు. అయితే దీనివల్ల వారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడు నుంచి పదిహేడేళ్ల వయసున్న పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teens ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఈ కొత్త వెర్షన్‌లో పిల్లల భద్రత కోసం కఠినమైన నిబంధనలను డిఫాల్ట్‌గా చేర్చారు. దీనివల్ల హింస, స్వీయ హాని కలిగించే విషయాలు అలాగే అసభ్యకరమైన అంశాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.
నేరుగా సమాధానాలు ఇవ్వని ఏఐ..
సాధారణ చాట్‌జీపీటీ మాదిరిగా ఈ కొత్త వెర్షన్ పిల్లల సందేహాలకు వెంటనే నేరుగా సమాధానాలు చెప్పదు. బదులుగా వారిలో సృజనాత్మకతను వెలికితీయడానికి సహాయపడుతుంది. పిల్లలు ఏదైనా హోమ్‌వర్క్ లేదా సమస్యకు షార్ట్‌కట్‌లు కోరితే ఈ సిస్టమ్ వాటిని నిరాకరిస్తుంది. క్రమపద్ధతిలో అడుగులు వేస్తూ సమస్యను ఎలా సాధించాలో గైడ్ చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ కోసం క్విజ్ టూల్స్‌ను కూడా జోడించారు. విద్యార్థులు చదువుకునే సమయంలో నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకునేలా స్టడీ మోడ్ సదుపాయం కల్పించారు. ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే బ్రేక్ తీసుకోవాలని రిమైండర్‌లు కూడా వస్తాయి.
తల్లిదండ్రుల చేతిలోనే పూర్తి నియంత్రణ..
పిల్లల మొబైల్ వాడకంపై తల్లిదండ్రులకు పూర్తి స్థాయి నియంత్రణ ఉండేలా పేరంటల్ కంట్రోల్ ఆప్షన్లను ఇచ్చారు. పిల్లల అకౌంట్‌ను తమ అకౌంట్‌తో లింక్ చేయడం ద్వారా కొన్ని సెట్టింగ్‌లను బ్లాక్ చేయవచ్చు. పిల్లలు చదువుకునే సమయాన్ని నిర్ణయించడం లేదా అత్యవసర పరిస్థితుల్లో నోటిఫికేషన్‌లు పొందడం సులభం అవుతుంది. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫీచర్లతో పాటు పేరెంట్స్ గైడ్‌ను కూడా విడుదల చేశారు.
పిల్లలకు సాంకేతిక విద్యను అందించడంతో పాటు వారిని సురక్షితంగా ఉంచడంలో ఈ కొత్త అడుగు ఎంతో ఉపయోగపడుతుంది. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ సరైన మార్గంలో నడిపించడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.




