చరిత్ర సృష్టించిన చాట్‌జీపీటీ.. 80 ఏళ్ల మ్యాథ్స్ ఫజిల్ ను ఛేదించిన ఏఐ..!
ChatGPT solves math problem: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతున్న వేళ, ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ సరికొత్త చరిత్రను లిఖించింది.
చరిత్ర సృష్టించిన చాట్‌జీపీటీ.. 80 ఏళ్ల మ్యాథ్స్ ఫజిల్ ను ఛేదించిన ఏఐ..!
ChatGPT solves math problem: ఎందరో మహానుభావులైన శాస్త్రవేత్తలకు సైతం సాధ్యం కాని ఒక సంక్లిష్టమైన గణిత సమస్యను చాట్‌జీపీటీ కేవలం క్షణాల్లో పరిష్కరించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోష్ 1946లో విసిరిన సవాలుకు ఎట్టకేలకు సమాధానం లభించింది. కృత్రిమ మేధస్సు కేవలం సమాచారాన్ని సేకరించే సాధనం మాత్రమే కాదు, సరికొత్తగా ఆలోచించగలదని ఈ పరిశోధన నిరూపించింది.
ఎనభై ఏళ్ల నాటి చిక్కుముడి.. ఒక్క దెబ్బతో తేల్చేసిన ఏఐ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చలు జరుగుతున్న వేళ, ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ సరికొత్త చరిత్రను లిఖించింది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మేధావులను ఊరించిన ఒక క్లిష్టమైన గణిత పజిల్‌ను ఇది సులువుగా ఛేదించింది. 1946వ సంవత్సరంలో అసాధారణ గణిత మేధావి పాల్ ఎర్డోష్ ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఒక సమతల ఉపరితలంపై అనేక బిందువులను ఉంచినప్పుడు, వాటి మధ్య ఖచ్చితంగా ఒక యూనిట్ దూరం ఉండేలా ఎన్ని జతలను తయారు చేయవచ్చు? అనేది ఆ ప్రశ్న. దీనిని ‘ప్లేనర్ యూనిట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్’ అని పిలుస్తారు. దీనికి కేవలం చతురస్రాకార గ్రిడ్ నిర్మాణాల ద్వారానే సమాధానం దొరుకుతుందని దశాబ్దాలుగా నిపుణులు భావించారు. కానీ చాట్‌జీపీటీ అంతకంటే భిన్నమైన, అత్యంత ఖచ్చితమైన వినూత్న ఉదాహరణలను వెలికితీసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆలోచింపజేస్తోన్న చాట్‌జీపీటీ విశ్లేషణా విధానం..
ఈ అద్భుత ఆవిష్కరణలో కేవలం సమాధానం దొరకడం మాత్రమే కాదు, ఆ సమాధానాన్ని చాట్‌జీపీటీ వెతికిన విధానమే శాస్త్రవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. ఈ నిర్దిష్ట సమస్యను పరిష్కరించడం కోసం చాట్‌జీపీటీకి ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. కేవలం సాధారణ తార్కిక ఆలోచన, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించే నైపుణ్యాల ఆధారంగానే ఇది ఈ ఘనత సాధించింది. గణితంలో ప్రతి అడుగు ఎంతో తార్కికంగా, ఖచ్చితత్వంతో కూడి ఉండాలి. చిన్న తప్పు దొర్లినా మొత్తం సిద్ధాంతమే తలకిందులవుతుంది. అలాంటిది చాట్‌జీపీటీ సుదీర్ఘమైన, ఎంతో లోతైన గణిత విశ్లేషణను సిద్ధం చేసింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు కూడా ఇది నూటికి నూరు శాతం నిజమని అంగీకరించారు.
రెండు వేర్వేరు సిద్ధాంతాల మేళవింపు..
చాట్‌జీపీటీ ఈ సమస్యను పరిష్కరించడానికి ‘ఆల్జీబ్రాయిక్ నంబర్ థియరీ’ అనే అత్యంత క్లిష్టమైన గణిత సూత్రాన్ని ఉపయోగించింది. జ్యామితీయ సమస్యకు, ఈ సిద్ధాంతానికి సంబంధం ఉంటుందని గతంలో ఏ మానవ మేధావి కూడా ఊహించలేదు. అంటే చాట్‌జీపీటీ కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పాత సమాచారాన్ని కాపీ కొట్టకుండా, గణితంలోని రెండు వేర్వేరు విభాగాల మధ్య సరికొత్త సంబంధాన్ని జోడించి ఒక అద్భుతమైన కొత్త ఆలోచనను ప్రసూవించింది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త టిమ్ గోవర్స్ దీనిని గణిత చరిత్రలోనే ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఏఐ ఇక ఎంతమాత్రం మనుషులకు సహాయపడే సాధారణ డివైజ్ కాదు, అది స్వయంగా సరికొత్త ఆలోచనలను సృష్టించగల మేధస్సు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయమా?
ఈ అద్భుతమైన విజయం కేవలం గణిత శాస్త్రానికే పరిమితం కాబోదు. ఇంత సుదీర్ఘమైన తార్కిక ఆలోచనలను, విభిన్న రంగాల సిద్ధాంతాలను అనుసంధానించే సామర్థ్యం ఏఐకి ఉందని రుజువైంది కాబట్టి, భవిష్యత్తులో దీని ప్రభావం జీవశాస్త్రం, నూతన ఔషధాల ఆవిష్కరణ, ఇంజనీరింగ్, భౌతిక శాస్త్ర రంగాలపై భారీగా ఉండబోతోంది. అయితే ఇంత జరిగినా మనుషుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ కేవలం సమస్యలకు పరిష్కారాలను మాత్రమే చూపగలదు. కానీ సమాజానికి ఏ ప్రశ్న ముఖ్యం? ఏ దిశలో పరిశోధనలు సాగాలి? అనే తుది నిర్ణయాధికారం ఎప్పటికీ మానవుల చేతుల్లోనే ఉంటుంది.
చాట్‌జీపీటీ సాధించిన ఈ ఘనత మానవ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. సాంకేతికత కేవలం మనుషులు చెప్పిన పని చేసే స్థాయి నుంచి, సొంతంగా సృజనాత్మక ఆలోచనలు చేసే స్థాయికి ఎదగడం విస్మయానికి గురిచేస్తోంది. భవిష్యత్తులో సైన్స్ రంగంలో మానవ మేధస్సుకు, కృత్రిమ మేధస్సుకు మధ్య జరిగే ఈ ఉమ్మడి ప్రయాణం మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




