బట్టతలకు ఇక గుడ్‌బై.. నూనె వద్దు, ఏ మందు వద్దు.. 28 రోజుల్లో జుట్టు తెప్పించే దువ్వెన వచ్చేసిందిగా..!

China Electric Comb: బట్టతలతో బాధపడుతున్న కోట్లాది మందికి శుభవార్త..! నూనెలు వద్దు, మందులు వద్దు, సైడ్ ఎఫెక్టులు వద్దు.. రోజూ తల దువ్వుకుంటే చాలు, 28 రోజుల్లో బట్టతలపై జుట్టు మొలుస్తుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Venkat
Published on: 17 Nov 2026 7:59 PM IST
China Electric Comb
X

బట్టతలకు ఇక గుడ్‌బై.. నూనె వద్దు, ఏ మందు వద్దు.. 28 రోజుల్లో జుట్టు తెప్పించే దువ్వెన వచ్చేసిందిగా..!

China Electric Comb: బట్టతల... ఒకప్పుడు వయసు పైబడ్డాక వచ్చే సమస్యగా చూసేవారు. కానీ ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాళ్ల నుంచి 40 ఏళ్ల ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న కామన్ ఎనిమీ ఇది. జుట్టు ఊడటం మొదలైందంటే చాలు.. నూనెలు మార్చడం, షాంపూలు మార్చడం, యూట్యూబ్ చిట్కాలు, ఆయుర్వేద మందులు... ఇలా లక్షల రూపాయల మ్యాచ్ ఆడుతూనే ఉంటాం. చివరికి ఫలితం మాత్రం డకౌట్!

సరిగ్గా ఇలాంటి సమయంలోనే చైనా ఓ బౌన్సర్ వేసింది. బీజింగ్‌లోని బెయిహాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేసిన ‘డీటాంగిల్’ ఎలక్ట్రిక్ దువ్వెన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

అసలు ఈ దువ్వెన ఏంటి? ఎలా పనిచేస్తుంది?

ఇది మామూలు ప్లాస్టిక్ దువ్వెన కాదు. హైటెక్ బయో-ఎలక్ట్రానిక్ సిస్టమ్. దీని పళ్లలో నుంచి చాలా సూక్ష్మమైన ఎలక్ట్రికల్ పల్స్‌లు విడుదలవుతాయి. మనం రోజూ తల దువ్వుకునేటప్పుడు ఈ పల్స్‌లు స్కాల్ప్ లోపలికి వెళ్లి హెయిర్ ఫాలికల్స్‌ను నిద్రలేపుతాయి.

పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం:

1. రక్త ప్రసరణ పెరుగుతుంది: స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగై వెంట్రుక కుదుళ్లకు బలం చేకూరుతుంది.

2. 9 రెట్లు డీప్ ఎటాక్: సాధారణ మందులు, నూనెలు చర్మం పైపైనే ఉండిపోతాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ పల్స్‌లు స్కాల్ప్ లోపలికి 9 రెట్లు లోతుగా చొచ్చుకుపోతాయి. అదే దీని అసలు పవర్.

3. కొత్త వెంట్రుకలకు బూస్ట్: పాత జుట్టు ఊడకుండా గట్టిపడుతుంది, కొత్త జుట్టు వేగంగా మొలుస్తుంది.

ముఖ్యంగా ఈ దువ్వెనలోని చిన్న పళ్లు మందును కూడా మోసుకెళ్లి నేరుగా కుదుళ్లకు అందిస్తాయని నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో ప్రచురితమైన రిపోర్టు చెబుతోంది.

28 రోజుల్లో అద్భుతం! ఎలుకలపై ప్రయోగం ఏం చెప్పింది?

ఈ దువ్వెనను పరిశోధకులు నెల రోజుల పాటు బట్టతల ఎలుకలపై ప్రయోగించారు. ఫలితం చూసి వారే ఆశ్చర్యపోయారు.

28 రోజుల్లో బట్టతల ప్రాంతంలో దాదాపు 98% జుట్టు తిరిగి మొలిచింది!

ప్రస్తుతం జుట్టుకు వాడుతున్న ప్రసిద్ధ మందు మినాక్సిడిల్‌తో అయితే కేవలం 70% జుట్టే వచ్చింది. మందు వాడని ఎలుకల్లో అయితే కేవలం 1% మాత్రమే వచ్చింది. అంటే ఈ ఎలక్ట్రిక్ దువ్వెన మినాక్సిడిల్ కంటే చాలా ముందంజలో నిలిచినట్లే.

ఇది ముఖ్యంగా మగవారిలో వచ్చే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ (ఆండ్రోజెనెటిక్ అలోపేసియా) కు బ్రహ్మాస్త్రం కానుందని డైలీమెయిల్ పేర్కొంది. ప్రపంచంలో ప్రస్తుతం 150 కోట్ల మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం అందం సమస్య కాదు, మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం దెబ్బతినడానికి కారణమవుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మందులకు కాలం చెల్లినట్లేనా?

సీనియర్ ఆటగాడిని తప్పించి యువ ఆటగాడికి ఛాన్స్ ఇచ్చినట్లు... ఈ దువ్వెన వస్తే పాత మందులకు కాలం చెల్లడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే:

నూనెలు, మందుల వల్ల సైడ్ ఎఫెక్టులు, చర్మం దురద, వాపు ఉంటాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ దువ్వెన వల్ల ఎలుకలపై ఎలాంటి వాపు, దురద, సైడ్ ఎఫెక్టులు కనిపించలేదు.

రోజూ రెండు నిమిషాలు తల దువ్వుకుంటే చాలు. నొప్పి ఉండదు, కరెంట్ షాక్ తగలదు. కేవలం తేలికపాటి స్టిమ్యులేషన్ మాత్రమే ఉంటుంది.

అసలు మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది!

అయితే క్రికెట్‌లో ట్రయల్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టినంత మాత్రాన వరల్డ్ కప్ గెలిచినట్లు కాదు కదా! అలాగే ఈ ప్రయోగం ఇప్పటివరకు ఎలుకలపైనే జరిగింది. మనుషులపై ప్రయోగాలు ఇంకా మొదలు కాలేదు. పెద్ద జంతువులు, ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ పూర్తయితేనే ఇది మార్కెట్లోకి వస్తుంది.

అయినా, బట్టతలపై పోరాటంలో ఇది ఓ గేమ్-ఛేంజర్ ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో 2-3 ఏళ్లలో మీ దువ్వెనే మీ హెయిర్ డాక్టర్ అయితే ఆశ్చర్యపోకండి!

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.