Future Predicting AI: ఫ్యూచర్ చెప్పేస్తోన్న ఏఐ.. గూగుల్, మైక్రోసాప్ట్ కే షాకిచ్చిన 20 ఏళ్ల స్టూడెంట్.!
Future Predicting AI: దిగ్గజ కంపెనీలకే ఓ స్టూడెంట్ సవాలు విసురుతూ, ఫ్యూచర్ చెప్పే ఓ ఏఐని రూపొందిచాడు. ప్రస్తుతం ఈ ఆవిష్కరణ చర్చనీయాంశమైంది.
Future Predicting AI: ఫ్యూచర్ చెప్పేస్తోన్న ఏఐ.. గూగుల్, మైక్రోసాప్ట్ కే షాకిచ్చిన 20 ఏళ్ల స్టూడెంట్.!
Future Predicting AI: కేవలం ఇరవై ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన ఘనతను సాధించాడు చైనాకు చెందిన ఒక విద్యార్థి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకే సవాలు విసురుతూ, సమాజం భవిష్యత్తును ముందే పసిగట్టే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ను రూపొందించాడు. పది లక్షల కృత్రిమ ఏజెంట్లతో ఒక వర్చువల్ సమాజాన్ని సృష్టించి, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసే ఈ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజింగ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న గువో హాంగ్జియాంగ్ అనే విద్యార్థి కేవలం పది రోజుల్లో 'మిరోఫిష్' (MiroFish) అనే ఏఐ ఇంజిన్‌ను తయారు చేశాడు. ఇది సాధారణ చాట్‌బాట్ కాదు. ఇది పది లక్షల కృత్రిమ ఏజెంట్లతో కూడిన ఒక కృత్రిమ సమాజాన్ని సృష్టిస్తుంది. ఏదైనా ఒక కొత్త చట్టం వచ్చినా లేదా సామాజిక మార్పు జరిగినా, ఆ వర్చువల్ సమాజంలోని ఏజెంట్లు ఎలా స్పందిస్తారో గమనించి, వాస్తవ ప్రపంచంలో ప్రజల స్పందన ఎలా ఉండబోతుందో ఇది ముందే చెబుతుంది.
భారీ పెట్టుబడులు.. ప్రపంచ నంబర్ వన్ డెవలపర్..
ఈ అద్భుతమైన ఆవిష్కరణకుగాను గువో హాంగ్జియాంగ్ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. గిట్‌హబ్ (GitHub) ప్లాట్ఫామ్లో ప్రపంచంలోనే నంబర్ వన్ డెవలపర్‌గా నిలిచాడు. దీని సామర్థ్యాన్ని గుర్తించిన చైనా మాజీ కుబేరుడు చెన్ టియాన్కియావో, కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే సుమారు 34 కోట్ల రూపాయల (4.1 మిలియన్ డాలర్లు) పెట్టుబడిని అందించారు. దీని తయారీలో 'వైబ్ కోడింగ్' అనే వేగవంతమైన ప్రోగ్రామింగ్ పద్ధతిని వాడటం విశేషం.
ఇది ఎలా పని చేస్తుంది?
మిరోఫిష్ 'ఓయాసిస్' (OASIS) అనే ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రతి కృత్రిమ ఏజెంట్‌కు ఒక ప్రత్యేక వ్యక్తిత్వం, జ్ఞాపకశక్తి ఉంటాయి. ఒక చీమల కాలనీ ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తుందో, అలాగే ఈ ఏజెంట్లు కూడా ఒక వర్చువల్ సమాజంలో జీవిస్తారు. ఏదైనా ఒక వార్త లేదా సంఘటనపై ఈ ఏజెంట్లు స్పందించే తీరును విశ్లేషించి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఈ సాంకేతికత అంచనా వేస్తుంది.
విజయవంతమైన ప్రయోగాలు..
ఈ ఏఐ ఇప్పటికే తన శక్తిని నిరూపించుకుంది. ఒక విశ్వవిద్యాలయ వివాదంలో ప్రజల ఆగ్రహం ఎలా మారుతుందో ఇది ఖచ్చితంగా ఊహించింది. అంతేకాకుండా, శతాబ్దాల క్రితం కనుమరుగైన ఒక ప్రసిద్ధ నవల ముగింపును కూడా ఇది అద్భుతంగా రాసింది.
అయితే, దీని నిర్వహణ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి ఈ కృత్రిమ ఏజెంట్లు మనుషుల కంటే కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తును ముందే అంచనా వేసే అద్భుతమైన ఆయుధం చైనాకు దొరికిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




