Google Workspaceలోకి Claude AI.. యూజర్లకు అదిరే ఫీచర్లు
Google Docs, Sheets, Slidesలో Claude AI నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఎడిటింగ్, డేటా విశ్లేషణ, ప్రెజెంటేషన్లకు ఏఐ సాయం పొందవచ్చు.
Claude AI
గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్ ఉపయోగించే వారికి ఆంథ్రోపిక్ కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇకపై ఈ మూడు గూగుల్ వర్క్‌స్పేస్ యాప్స్‌లోనే Claude AIని నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఆంథ్రోపిక్ గూగుల్ వర్క్‌స్పేస్ యాడ్-ఆన్‌ను పబ్లిక్ బీటా రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ సదుపాయం చెల్లింపు Claude ప్లాన్లను ఉపయోగించే వారికి అందుబాటులో ఉంది. దీని ద్వారా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు మారాల్సిన అవసరం లేకుండానే డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లపై ఏఐ సాయంతో పనులు చేసుకోవచ్చు.
Google Docsలో Claudeతో ఏం చేయొచ్చు?
గూగుల్ డాక్స్‌లో Claude AI సైడ్‌బార్ రూపంలో కనిపిస్తుంది. ఇందులోని ఏఐ అసిస్టెంట్‌తో వాక్యాలను సరిచేయడం, పేరాగ్రాఫ్‌లను రీరైట్ చేయడం, హెడ్డింగ్‌లను మార్చడం, ఇతర ఎడిటింగ్ పనులు చేయవచ్చు.
పెద్ద మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు Claude ముందుగా ఎడిటింగ్ సూచనలు ఇస్తుంది. వాటిని యూజర్లు పరిశీలించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎడిటింగ్ సమయంలో ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ ఫార్మాటింగ్‌ను కూడా కొనసాగించేలా Claude పనిచేస్తుంది.
Google Sheetsలో మరిన్ని ఫీచర్లు
గూగుల్ షీట్స్‌లో Claude ఉపయోగించి ఫార్ములాలను రూపొందించడం, పివోట్ టేబుల్స్ తయారు చేయడం, చార్టులు రూపొందించడం, కొత్త ట్యాబ్‌లు యాడ్ చేయడం వంటి పనులు చేయవచ్చు.
ఎంచుకున్న డేటాను క్లీనప్ చేయడం లేదా వివిధ డేటాను కలిపి విశ్లేషించడంలో కూడా Claude సహాయం చేస్తుంది. యూజర్లు తమ సోర్స్ ఫైళ్లను అందించి, ప్రత్యేక ట్యాబ్‌లతో రిపోర్టులు, సారాంశ చార్టులు రూపొందించమని అడగవచ్చు. ముఖ్యంగా మరింత పరిశీలించాల్సిన గణాంకాలు లేదా డేటాను కూడా Claude గుర్తించగలదు.
Google Slidesలోనూ Claude AI
గూగుల్ స్లైడ్స్‌లో కూడా Claude ద్వారా ప్రెజెంటేషన్లు రూపొందించడంతో పాటు ఇప్పటికే ఉన్న ప్రెజెంటేషన్లను ఎడిట్ చేయవచ్చు. గూగుల్ స్లైడ్స్‌లో ఉన్న థీమ్స్, లేఅవుట్లను ఉపయోగించి కొత్త స్లైడ్లను రూపొందించగలదు.
అంతేకాకుండా ప్రెజెంటేషన్‌ను రివ్యూ చేసి, ఒకదానిపై మరొకటి ఎలిమెంట్లు పడటం, టెక్స్ట్ ఎక్కువై బయటకు వెళ్లడం, చదవడానికి కష్టంగా ఉన్న కంటెంట్ వంటి సాధారణ ఫార్మాటింగ్ సమస్యలను గుర్తించగలదు.
AI మార్పులపై యూజర్లకు పూర్తి నియంత్రణ
Claudeలో ఏఐ చేసే మార్పులపై యూజర్లకు నియంత్రణ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఉండే “Ask before edits” ఆప్షన్‌లో ప్రతి మార్పును అమలు చేయడానికి ముందు యూజర్ అనుమతి తీసుకుంటుంది.
ప్రతి మార్పును విడిగా ఆమోదించాల్సిన అవసరం లేకుండా మొత్తం పనిని Claudeతో పూర్తి చేయాలనుకునేవారు “Accept all edits” ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
Google Workspaceతో Claude కనెక్టర్లు
గూగుల్ వర్క్‌స్పేస్ యాడ్-ఆన్‌లో Claudeకు సంబంధించిన ఇప్పటికే ఉన్న కనెక్టర్లు, స్కిల్స్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. దీంతో గూగుల్ ఫైళ్లలోని సమాచారాన్ని ఇతర కనెక్ట్ చేసిన సేవల డేటాతో కలిపి ఉపయోగించుకోవచ్చు.
అంతేకాకుండా Claudeలోనే Google Docs, Sheets, Slides కోసం బీటా కనెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. యూజర్లు గూగుల్ ఫైల్ లింక్‌ను షేర్ చేయడం లేదా Claude చాట్ నుంచే కొత్త ఫైల్‌ను రూపొందించమని అడగడం చేయవచ్చు.
Google Workspaceలో Claudeను ఎలా ఉపయోగించాలి?
Google Workspace కోసం Claude ప్రస్తుతం బీటా దశలో చెల్లింపు Claude ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. యూజర్లు Google Workspace Marketplace నుంచి Claude యాడ్-ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత Google Docs, Sheets లేదా Slidesలో ఏదైనా ఫైల్‌ను ఓపెన్ చేసి Extensions > Claude > Open Claudeను ఎంచుకుంటే ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించుకోవచ్చు.




