Anthropic AI Phone Control: ఫోన్ టచ్ చేయకుండానే మెసేజ్, కాల్స్ చేయోచ్చు.. ఈ ఏఐ ఫీచర్ చూస్తే మైండ్ బ్లాంకే..!
Anthropic AI Phone Control: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ తన 'క్లాడ్ ఏఐ' కోసం 'ఆర్బిట్' అనే అద్భుతమైన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుని, మీరు చెప్పిన పనులను స్వయంగా పూర్తి చేస్తుంది.
ఫోన్ టచ్ చేయకుండానే మెసేజ్, కాల్స్ చేయోచ్చు.. ఈ ఏఐ ఫీచర్ చూస్తే మైండ్ బ్లాంకే..!
Claude AI Orbit Feature: సాధారణంగా ఏఐ చాట్బాట్లు మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తాయి. కానీ, ఆంత్రోపిక్ సంస్థ రూపొందిస్తున్న ఈ కొత్త సాంకేతికత మీ ఫోన్‌ను ఒక వ్యక్తిలా ఆపరేట్ చేయగలదు. దీనిని 'ఆర్బిట్' అని పిలుస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారులు తమ ఫోన్‌ను చేతితో తాకాల్సిన అవసరం లేకుండానే అనేక పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఫోన్ కాల్స్, మెసేజ్‌లపై నియంత్రణ..
ఈ ఫీచర్ ద్వారా క్లాడ్ ఏఐ మీ తరపున ఫోన్ కాల్స్ చేయగలదు, మీకు వచ్చిన మెసేజ్‌లను చదివి వాటికి తగిన సమాధానాలను సిద్ధం చేసి పంపగలదు. అంతేకాకుండా, క్యాలెండర్లో ఈవెంట్లను మార్క్ చేయడం లేదా తొలగించడం, ఇంటర్నెట్ బ్రౌజర్‌ను వాడటం వంటి పనులను కూడా ఇది సునాయాసంగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది మీ వ్యక్తిగత సహాయకుడిలా మారి ఫోన్లోని అన్ని యాప్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
కంప్యూటర్, మొబైల్ అనుసంధానం..
ఇప్పటికే కంప్యూటర్లలో మౌస్, కీబోర్డ్ నియంత్రించే సామర్థ్యాన్ని క్లాడ్ ఏఐ పొందింది. ఇప్పుడు 'ఆర్బిట్' ద్వారా మొబైల్ ఫోన్లపై కూడా పట్టు సాధించబోతోంది. దీనివల్ల కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ రెండింటినీ ఏకకాలంలో ఏఐ ద్వారా నియంత్రించే వీలు కలుగుతుంది. ఉదాహరణకు, మీరు కంప్యూటర్లో పని చేస్తున్నప్పుడు ఫోన్లో ఒక ముఖ్యమైన ఫైల్‌ను పంపమని ఏఐని ఆదేశిస్తే, అది వెంటనే ఆ పనిని పూర్తి చేస్తుంది.
వినియోగదారుల భద్రత, సవాళ్లు..
ఇంతటి పవర్ ఫుల్ ఫీచర్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో, డేటా భద్రత, గోప్యతపై కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్, కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణ ఏఐకి ఇవ్వడం వల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఆంత్రోపిక్ సంస్థ ఈ ఫీచర్‌తో పాటు పటిష్టమైన భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఇది పరిమిత సంఖ్యలో పరిశోధకులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.




