క్లాడ్ ఏఐ సంచలన నిర్ణయం.. ఇకపై ఏఐతో కంటెంట్ రాస్తే ఇట్టే దొరికిపోతారంతే..!
Claude Text Watermark: ఈ నయా టెక్నాలజీ ద్వారా కేవలం కంటెంట్ క్లాడ్ నుంచి వచ్చిందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది.
క్లాడ్ ఏఐ సంచలన నిర్ణయం.. ఇకపై ఏఐతో కంటెంట్ రాస్తే ఇట్టే దొరికిపోతారంతే..!
Claude Text Watermark: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తమ క్లాడ్ ఏఐ మోడల్ కోసం సరికొత్త వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. యూజర్లు ఏఐ ద్వారా కంటెంట్ సృష్టిస్తే, దాన్ని సులభంగా గుర్తించేలా ఈ సాంకేతికత పనిచేస్తుంది. అయితే దీనివల్ల ఆర్టికల్ నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
ఆంత్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ టెక్స్ట్ వాటర్‌మార్క్ విధానం సంప్రదాయ పద్ధతులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా వాటర్‌మార్క్ అంటే కంటికి కనిపించే అక్షరాలు లేదా ప్రత్యేక గుర్తులు ఉంటాయి. కానీ, క్లాడ్ ఏఐలో ఉపయోగించే ఈ సిస్టమ్ పూర్తిగా కంటికి కనిపించకుండా ఉంటూనే తన పని పూర్తి చేస్తుంది. గూగుల్ డీప్‌మైండ్ గతేడాది రూపొందించిన 'సింత్ఐడీ-టెక్స్ట్' (SynthID-Text) సాంకేతికత ఆధారంగా దీన్ని అభివృద్ధి చేశారు.
యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం రాసే సమయంలో ఒకే అర్థం వచ్చే పలు పదాలు అందుబాటులో ఉన్నప్పుడు, క్లాడ్ వాటి ఎంపికలో ఒక రహస్య ప్యాట్రన్‌ను ఫాలో అవుతుంది. డిటెక్షన్ సిస్టమ్‌లు ఈ ప్రత్యేక ప్యాట్రన్‌ను ఆధారంగా చేసుకుని, ఆ కంటెంట్ ఏఐ నుంచి వచ్చిందో లేదో కచ్చితంగా పసిగట్టేస్తాయి. దీని కోసం టెక్స్ట్‌లో ఎలాంటి అదనపు క్యారెక్టర్లను జోడించరు.
పనితీరుపై ప్రభావం సున్నా.. డేటా అత్యంత భద్రం..
ఈ నయా టెక్నాలజీ ద్వారా కేవలం కంటెంట్ క్లాడ్ నుంచి వచ్చిందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది. యూజర్ల వ్యక్తిగత వివరాలు, సంస్థల పేర్లు, వారు ఏఐతో చేసిన సంభాషణల డేటా ఏదీ బయటకు రాదు. కంటెంట్ మూలాలను కచ్చితంగా తేల్చడం కంటే, అందులో ఏఐ పాత్ర ఎంత ఉందనేది మాత్రమే ఇది లెక్కిస్తుంది. అలాగే ఈ ఫీచర్ వల్ల క్లాడ్ పనితీరు నెమ్మదించడం, నాణ్యత తగ్గడం లాంటివి జరగవు. దీనికోసం అదనపు టోకెన్ల అవసరం ఉండదు కాబట్టి, సబ్‌స్క్రైబర్లపై అదనపు ఆర్థిక భారం పడదని సంస్థ నిర్ధారించింది. థర్డ్ పార్టీ డెవలపర్లు కంటెంట్‌ను చెక్ చేసుకునేందుకు వీలుగా త్వరలో ఒక డిటెక్షన్ ఏపీఐని కూడా ఆంత్రోపిక్ అందుబాటులోకి తీసుకురానుంది.
కోడింగ్, ఫ్యాక్ట్స్ దగ్గర ఏమవుతుంది?
కృత్రిమ మేధతో జనరేట్ చేసిన టెక్స్ట్‌ను సులభంగా గుర్తించే ఈ టెక్నాలజీకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, చిన్న చిన్న వాక్యాలు రాసినప్పుడు ఈ వాటర్‌మార్క్ గుర్తించడం కాస్త కష్టంగా మారుతుంది. వాక్యాలు చిన్నగా ఉంటే ప్రత్యామ్నాయ పదాల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉండవు. కచ్చితమైన సమాచారం అవసరమయ్యే ఫ్యాక్చువల్ కంటెంట్ రాసేటప్పుడు కూడా ఈ విధానం అంత సమర్థవంతంగా పనిచేయదు.
సాఫ్ట్‌వేర్ కోడింగ్ విషయంలో కచ్చితమైన అవుట్‌పుట్ అవసరం కాబట్టి, అక్కడ వాటర్‌మార్కింగ్ చేయడం సాధ్యం కాదు. కాకపోతే, కోడ్ మధ్యలో ఉండే వివరణాత్మక కామెంట్స్‌కు మాత్రం వాటర్‌మార్క్ వర్తిస్తుంది. ఇక ఆర్టికల్‌ను క్లాడ్ ద్వారా రాయించి దాన్ని కొద్దిగా ఎడిటింగ్ చేసినా వాటర్‌మార్క్ అలాగే ఉంటుంది. పూర్తిగా మార్చి రాస్తేనే ఆ అదృశ్య గుర్తులు తొలగిపోతాయి. ఒక భాష నుంచి మరో భాషకు క్లాడ్ ద్వారా అనువాదం చేసినా ఈ వాటర్‌మార్క్ ఆ కంటెంట్‌కు ఉండటం గమనార్హం.
ఫొటోలకు కూడా నిబంధనలు.. అసలు కారణం ఇదే..
అక్షరాలకు మాత్రమే పరిమితం కాకుండా ఫొటోలకు కూడా ఆంత్రోపిక్ పారదర్శక నిబంధనలు అమలు చేస్తోంది. క్లాడ్ సహాయంతో క్రియేట్ చేసినా, ప్రాసెస్ చేసినా ఆ ఇమేజ్‌లకు (PNG, JPG, SVG) సీ2పీఏ (C2PA) ఆధారిత కంటెంట్ క్రెడెన్షియల్స్ జతచేస్తారు. దీంతో ఈ ఫొటో ఏఐ సాయంతో తయారైందని సులభంగా అర్థమవుతుంది.
యూరోపియన్ యూనియన్ (EU) తీసుకొచ్చిన కఠినమైన ఏఐ చట్టాలకు లోబడే సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జులైలో పలు దిగ్గజ టెక్ సంస్థలతో కలిసి ఏఐ కంటెంట్ పారదర్శకత ఒప్పందంపై ఆంత్రోపిక్ సంతకం చేసింది. యూరప్ నిబంధనల కోసమే ఈ సిస్టమ్ తెచ్చినప్పటికీ, భౌగోళికంగా దీన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. 2026 ఆగస్టు 2కు ముందు లాంచ్ చేసిన పాత మోడల్స్‌కు కూడా రాబోయే నెలల్లో ఈ వాటర్‌మార్క్ ఫీచర్‌ను దశలవారీగా జోడించనున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కంటెంట్ పారదర్శకతను కాపాడేందుకు ఆంత్రోపిక్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదృశ్య వాటర్‌మార్క్ విధానం వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండానే, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్‌ను సులభంగా పసిగట్టే వీలు కలుగుతుంది. రానున్న రోజుల్లో మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇదే తరహా సాంకేతికతను తప్పనిసరిగా అమలు చేసే అవకాశం ఉంది.




