Cyber Fraud Alert: ఆన్‌లైన్‌లో ఆఫ‌ర్ల వేళ‌.. న‌కిలీ వెబ్‌సైట్ల బెడ‌దా. ఇంత‌కీ వీటిని ఎలా గుర్తించాలంటే

Cyber Fraud Alert: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు.

Mokshith
Published on: 5 July 2026 2:12 PM IST
Cyber Fraud Alert
X

Cyber Fraud Alert: ఆన్‌లైన్‌లో ఆఫ‌ర్ల వేళ‌.. న‌కిలీ వెబ్‌సైట్ల బెడ‌దా. ఇంత‌కీ వీటిని ఎలా గుర్తించాలంటే

Cyber Fraud Alert: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. అసలు వెబ్‌సైట్‌లు, యాప్‌ల మాదిరిగానే కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి వినియోగదారుల బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఫేక్ వెబ్‌సైట్‌ల‌ను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా వెబ్‌సైట్ URLను పరిశీలించండి

ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే ముందు దాని వెబ్ అడ్రస్ (URL)ను జాగ్రత్తగా చూడాలి. సాధారణంగా సురక్షితమైన వెబ్‌సైట్‌లు https://తో ప్రారంభమవుతాయి. అలాగే వెబ్‌సైట్ పేరులో అక్షరదోషాలు, అదనపు అక్షరాలు లేదా అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. సైబర్ నేరగాళ్లు అసలు వెబ్‌సైట్‌లకు చాలా దగ్గరగా కనిపించే పేర్లతో నకిలీ సైట్లు రూపొందించి మోసాలకు పాల్పడుతుంటారు.

ప్యాడ్‌లాక్ గుర్తు ఉందో లేదో తప్పకుండా చూడండి

వెబ్‌సైట్ అడ్రస్ బార్‌లో కనిపించే ప్యాడ్‌లాక్ (తాళం) గుర్తు ఆ వెబ్‌సైట్‌కు కనెక్షన్ సురక్షితంగా ఉందని సూచిస్తుంది. ఒకవేళ ఈ గుర్తు కనిపించకపోతే అలాంటి వెబ్‌సైట్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయకూడదు.

ఆకర్షణీయమైన ఆఫర్లు, పాప్‌అప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నకిలీ వెబ్‌సైట్‌లలో తరచుగా "ఫ్రీ గిఫ్ట్", "లక్కీ డ్రా", "పరిమిత కాల ఆఫర్", "ఇప్పుడే క్లిక్ చేయండి" వంటి సందేశాలు, పాప్‌అప్‌లు కనిపిస్తుంటాయి. వీటితో వినియోగదారులను తొందరపెట్టి క్లిక్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఆఫర్లు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇవి సైబర్ మోసాల్లో భాగం కావచ్చు.

వెబ్‌సైట్ వివరాలు కూడా ఒకసారి పరిశీలించండి

నమ్మకమైన వెబ్‌సైట్‌లలో సాధారణంగా About Us, Contact Us వంటి విభాగాలు ఉంటాయి. అందులో సంస్థ చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఒకవేళ ఈ సమాచారం లేకపోయినా, అసంపూర్ణంగా ఉన్నా లేదా అనుమానాస్పదంగా కనిపించినా ఆ వెబ్‌సైట్‌ను ఉపయోగించకపోవడం మంచిది.

అసాధారణ ఆఫర్లను నమ్మొద్దు

"ఉచిత ల్యాప్‌టాప్", "చాలా తక్కువ ధరకు ఖరీదైన వస్తువులు" వంటి ఆఫర్లు ఎక్కువగా మోసపూరితమైనవే అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రకటనలను చూసి వెంటనే నమ్మకుండా, ముందుగా వాటి నిజానిజాలు తెలుసుకోవాలి. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ మోసాల నుంచి మీ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story