Shopping Scams: దీపావళి ఆఫర్ల పేరుతో సైబర్ మోసం.. ఒక్క పొరపాటుతో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ఛాన్స్
Shopping Scams: దీపావళి వచ్చిందంటే ఆన్లైన్ షాపింగ్ సందడి మొదలవుతుంది. ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుండటంతో చాలామంది కొత్త ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తుంటారు.
Shopping Scams
Shopping Scams: దీపావళి వచ్చిందంటే ఆన్లైన్ షాపింగ్ సందడి మొదలవుతుంది. ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుండటంతో చాలామంది కొత్త ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. ప్రముఖ షాపింగ్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, సోషల్ మీడియా, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు పంపిస్తున్నారు. ఖరీదైన ఫోన్లపై 70 నుంచి 80 శాతం తగ్గింపు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉచిత బహుమతులు అంటూ నమ్మిస్తున్నారు. ఇలాంటి లింకుల ద్వారా నకిలీ వెబ్సైట్లకు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా నకిలీ షాపింగ్ వెబ్సైట్లు, భారీ తగ్గింపు ప్రకటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని గతంలో హెచ్చరించింది.
భారీ డిస్కౌంట్లు కనిపిస్తే వెంటనే నమ్మకండి
సాధారణంగా మార్కెట్లో రూ.50 వేలు పలికే ఫోన్‌ను ఎవరైనా రూ.5 వేలకే ఇస్తామంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి అసాధారణ తగ్గింపులు చూపించి వినియోగదారులను తొందరపెట్టడం మోసగాళ్ల సాధారణ పద్ధతి. ఆఫర్ కొన్ని నిమిషాల్లో ముగుస్తుందని, చివరి మూడు వస్తువులే మిగిలాయని నకిలీ కౌంట్డౌన్లు చూపిస్తుంటారు. దీంతో నిజానిజాలు తెలుసుకోకుండానే చాలామంది కొనుగోలుకు ముందుకెళ్తారు. అందుకే ఏదైనా వస్తువు కొనేముందు దాని ధరను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మరో నమ్మకమైన షాపింగ్ వేదికలోనూ పరిశీలించాలి. వెబ్సైట్ చిరునామాలో అక్షరాల మార్పులు ఉన్నాయా, సంస్థ పేరు సరిగ్గా ఉందా అనేది గమనించాలి. తెలియని ఖాతాలకు యూపీఐ లేదా నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా డబ్బులు పంపకూడదు.
ఫ్రీ గిఫ్ట్, లక్కీ డ్రా మెసేజ్‌లతో జాగ్రత్త
వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్లో ఉచిత ఐఫోన్, బంగారు నాణెం, షాపింగ్ వోచర్ గెలుచుకున్నారంటూ సందేశాలు రావచ్చు. వాటితో పాటు ఇచ్చే లింకులను తెరవడం ప్రమాదకరం. కొన్ని నకిలీ పేజీలు బహుమతి పొందాలంటే వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని, మరికొన్ని బ్యాంకు కార్డు వివరాలు ఇవ్వాలని అడుగుతాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బహుమతి అందుకోవడానికి యూపీఐ పిన్ లేదా ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు స్వీకరించడానికి కూడా యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన పనిలేదు. తెలియని వ్యక్తులు పంపిన లింకుల ద్వారా ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. కొత్త యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవాలి.
నకిలీ వెబ్సైట్లు, డెలివరీ మెసేజ్‌లను గుర్తించండి
ప్రముఖ షాపింగ్ సంస్థల వెబ్సైట్లను పోలిన నకిలీ పేజీలను సైబర్ నేరగాళ్లు తయారు చేస్తున్నారు. అందుకే కొనుగోలు చేసే ముందు వెబ్సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో సంస్థ వివరాలు, సంప్రదింపు సమాచారం, వస్తువులు తిరిగి ఇచ్చే నిబంధనలు ఉన్నాయో చూడాలి. కొత్త వెబ్సైట్లో కొనుగోలు చేయాలనుకుంటే వినియోగదారుల సమీక్షలు, అమ్మకందారుడి వివరాలు పరిశీలించాలి. మరోవైపు పార్శిల్ నిలిచిపోయిందని, చిరునామా మార్చాలని వచ్చే సందేశాలు కూడా మోసాలకు వేదిక కావచ్చు. అలాంటి మెసేజ్‌లలోని లింకులను తెరవకుండా, మీరు ఆర్డర్ చేసిన షాపింగ్ యాప్‌లోకి వెళ్లి వివరాలు తనిఖీ చేయాలి. కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో కనిపించే ప్రతి నంబర్‌ను నమ్మకుండా సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌లో ఉన్న వివరాలనే ఉపయోగించాలి.
మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేయండి
ఒకవేళ ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకూడదు. ముందుగా మీ బ్యాంకును సంప్రదించి ఖాతా లేదా కార్డును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాలి. అనుమానాస్పద లావాదేవీల వివరాలు, సందేశాలు, వెబ్సైట్ లింకులు, స్క్రీన్షాట్లను భద్రపరచాలి. వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. అలాగే cybercrime.gov.in వెబ్సైట్లోనూ ఆన్లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. 1930కు ఫోన్ చేసిన తర్వాత అందిన ఫిర్యాదు గుర్తింపు వివరాలతో పోర్టల్‌లో ప్రక్రియను పూర్తి చేయాలి. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును నిలిపివేసే అవకాశం పెరుగుతుంది. అయితే డబ్బులు తిరిగి వస్తాయని హామీ ఉండదు.




