DIY Air Purifier: రూ.10 వేలు ఎందుకు? రూ.2,500లో ఇంట్లోనే ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేయండిలా..!
DIY Air Purifier: మార్కెట్లో ప్యూరిఫైయర్ అంటే రూ.10 వేలు దాటుతోంది. అయితే కేవలం రూ.2,500తో, కేవలం 3 వస్తువులతో ఇంట్లోనే పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ తయారుచేయవచ్చని ఓ క్రియేటర్ నిరూపించాడు. అదెలాగో తెలుసుకుందాం.
DIY Air Purifier: రూ.10 వేలు ఎందుకు? రూ.2,500లో ఇంట్లోనే ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేయండిలా..!
DIY Air Purifier: దీపావళి తర్వాత దేశ రాజధాని ఊపిరాడడం లేదు. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) ఏకంగా 3000 మార్కును దాటిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఉదయం నిద్రలేస్తే పొగమంచు కాదు, విషవాయువు కమ్మేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ అవసరం అనిపిస్తోంది. కానీ మార్కెట్లో మంచి ప్యూరిఫైయర్ కావాలంటే కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 పెట్టాల్సిందే. దీంతో చాలామంది కొనుగోలు వాయిదా వేస్తున్నారు.
అయితే ఖరీదైన పరికరం కొనలేని వారికి ఓ శుభవార్త. కేవలం రూ.2,500 ఖర్చుతో ఇంట్లోనే ఎయిర్ ప్యూరిఫైయర్ తయారు చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్రియేటర్ ఈ ‘జుగాడ్’ ప్యూరిఫైయర్ తయారీ విధానాన్ని వీడియో ద్వారా వివరించి, లైవ్ టెస్టింగ్‌లో అది నిజంగానే పనిచేస్తుందని నిరూపించాడు.
ముందు అసలు ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం..
ఎయిర్ ప్యూరిఫైయర్‌లో పెద్ద టెక్నాలజీ ఏమీ ఉండదు. ప్రధానంగా మూడు భాగాలే ఉంటాయి - 1. బాడీ, 2. ఫిల్టర్, 3. ఫ్యాన్.
ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు చుట్టూ ఉన్న కలుషిత గాలిని బలంగా లోపలికి లాగుతుంది. ఆ గాలి HEPA ఫిల్టర్ గుండా వెళుతుంది. గాలిలోని దుమ్ము, ధూళి, PM 2.5 కణాలు ఫిల్టర్‌లోనే చిక్కుకుపోతాయి. బయటకు వచ్చేది స్వచ్ఛమైన గాలి. అంటే మంచి ఫిల్టర్ + గాలి లాగే శక్తివంతమైన ఫ్యాన్ ఉంటే చాలు, ఎవరైనా ప్యూరిఫైయర్ తయారు చేయవచ్చు.
కావాల్సినవి కేవలం 3 వస్తువులే..
సిలిండ్రికల్ HEPA రీప్లేస్‌మెంట్ ఫిల్టర్: మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య దొరుకుతుంది.
రౌండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్: ఇంట్లో బాత్రూమ్‌లో వాడేలాంటిదే. ధర రూ.800 నుంచి రూ.1,000.
3M డబుల్-సైడ్ టేప్: రూ.50 నుంచి రూ.100.
మొత్తం ఖర్చు రూ.2,500 దాటదు.
5 నిమిషాల్లో అసెంబ్లింగ్ ఇలా..
తయారీ విధానం ఆశ్చర్యపరిచేంత సులభం. HEPA ఫిల్టర్‌ను సమతలమైన చోట నిలబెట్టండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అడుగు భాగంలో చుట్టూ డబుల్-సైడ్ టేప్ అంటించి, ఫిల్టర్ పైభాగంలో గట్టిగా అతికించండి. అంతే, మీ ప్యూరిఫైయర్ రెడీ.
స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ చుట్టూ ఉన్న గాలిని లాగి, ఫిల్టర్ గుండా పైకి వదులుతుంది. ఇక్కడ ఒకే ఒక్క జాగ్రత్త - ఫ్యాన్, ఫిల్టర్ మధ్య ఏ మాత్రం గ్యాప్ ఉండకూడదు. గాలి మొత్తం ఫిల్టర్ గుండానే బయటకు రావాలి, పక్క సందుల నుంచి లీక్ కాకూడదు.
నిజంగా పనిచేస్తుందా? టెస్టులో ఏం తేలింది?
ఇదే కీలక ప్రశ్న. క్రియేటర్ చేసిన టెస్టింగ్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. AQI 225 ఉన్న మూసి ఉన్న గదిలో ఈ జుగాడ్ ప్యూరిఫైయర్ నడిపితే, కొద్దిసేపటికే AQI 95 కి, అంటే సురక్షిత పరిధిలోకి పడిపోయింది.
నిజమే, ఇది చూడడానికి బ్రాండెడ్ పరికరంలా ఉండదు. డిస్‌ప్లే, సెన్సార్, ఆటో మోడ్ ఉండవు. కానీ తక్కువ ఖర్చుతో గాలిని శుభ్రం చేయాలనే ప్రాథమిక అవసరాన్ని ఇది తీరుస్తుంది.
నిపుణులు మరో చిట్కా కూడా చెబుతున్నారు. మీ ఇంట్లో స్ప్లిట్ AC ఉంటే, దానికి HEPA ఫిల్టర్ షీట్ అమర్చినా అది ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది.




