EPF సేవలు ఇక వాట్సాప్‌లో.. AI చాట్‌బాట్ త్వరలో
EPFO WhatsApp Channel: EPFO సభ్యుల కోసం అధికారిక వాట్సాప్ చానల్ ప్రారంభం. పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ కోసం త్వరలో AI చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నకిలీ మెసేజ్‌ల పట్ల జాగ్రత్త.
EPF సేవలు ఇక వాట్సాప్‌లో.. AI చాట్‌బాట్ త్వరలో
EPFO WhatsApp Channel: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సభ్యులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన సమాచారం, ముఖ్యమైన అప్‌డేట్లను నేరుగా చేరవేసేందుకు సంస్థ అధికారిక వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది. దీంతో ఈపీఎఫ్‌వోకు సంబంధించిన తాజా సమాచారం సభ్యులకు నేరుగా వాట్సాప్‌లోనే లభించనుంది.
ఇందులో భాగంగా, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ వంటి వ్యక్తిగత ఖాతా వివరాలను వాట్సాప్ ద్వారా అందించే ప్రత్యేక AI చాట్‌బాట్‌ను కూడా EPFO తీసుకురానుంది. ఈ చాట్‌బాట్ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గతంలోనే ప్రకటించారు.
కొత్త వ్యవస్థ ప్రకారం.. సభ్యులు ఈపీఎఫ్‌వో ధ్రువీకరించిన వాట్సాప్ నంబర్‌కు ‘Hello’ అని మెసేజ్ పంపడం ద్వారా సేవలను ప్రారంభించవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించిన అనంతరం సభ్యులకు వివిధ సేవల మెనూ కనిపించేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు.
ప్రతిపాదిత AI చాట్‌బాట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, గత ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్, KYC వివరాలు, వడ్డీ క్రెడిట్ సమాచారం, UANకు సంబంధించిన ప్రశ్నలు, ఫిర్యాదులు, పెండింగ్ చర్యల వివరాలు వంటి సేవలు అందించనున్నారు. సభ్యుడు ఎంచుకున్న సేవను బట్టి చాట్‌బాట్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదా ఈపీఎఫ్‌వో డేటాబేస్ నుంచి సమాచారాన్ని తీసుకురావడం జరుగుతుంది. స్థానిక భాషల్లో కూడా ఈ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏమేం అందుబాటులో ఉన్నాయి?
అయితే, వాట్సాప్ చానల్ ప్రారంభమైనంత మాత్రాన వ్యక్తిగత పీఎఫ్ ఖాతా వివరాలన్నీ ఇప్పటికే వాట్సాప్‌లో లభిస్తున్నాయని భావించకూడదని EPFO స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అధికారిక చానల్ ద్వారా సమాచారం, అప్‌డేట్లు మాత్రమే పొందవచ్చు. వ్యక్తిగత ఖాతా సేవల కోసం ప్రతిపాదిత చాట్‌బాట్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.
ఇక కొన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికే సభ్యుల ప్రశ్నలు, ఫిర్యాదుల కోసం వేర్వేరు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్లను నిర్వహిస్తున్నాయి. గోవా, పుణె, నాగ్‌పూర్, నాసిక్ వంటి ప్రాంతీయ కార్యాలయాల నంబర్లు అధికారిక జాబితాలో ఉన్నాయి. కాబట్టి, ఏదైనా నంబర్ కనిపించినంత మాత్రాన అది దేశవ్యాప్త అధికారిక చాట్‌బాట్ అని పొరపడకూడదని EPFO సూచించింది.
మోసాల పట్ల అప్రమత్తత అవసరం
ఈపీఎఫ్‌వో పేరుతో వచ్చే నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు, కాల్స్ పట్ల సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. UAN పాస్‌వర్డ్, ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా వివరాలు, OTP లేదా చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు కోరే కాల్స్‌కు స్పందించవద్దని EPFO అధికారిక మెంబర్ పాస్‌బుక్ పేజీ కూడా హెచ్చరిస్తోంది.
అందువల్ల, వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో పేరుతో ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు అది అధికారిక ఖాతా నుంచేనా అని ముందుగా నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా OTP, బ్యాంక్ వివరాలు లేదా చెల్లింపులు కోరితే వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.




