Festive Sales: పండుగ సేల్స్ ఢమాల్!
Festive Sales: గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 33,200 కోట్లతో పోలిస్తే ఇది 7% నుండి 10% తక్కువ.
Festive Sales: పండుగ సేల్స్ ఢమాల్!
Festive Sales: పండుగ సీజన్ వస్తే చాలు.. కొత్త ఫోన్ల కోసం, ఇష్టమైన గ్యాడ్జెట్ల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల ముందే కళ్లప్పగించి కూర్చుంటారు భారతీయులు. అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ అనగానే ఆఫర్ల వర్షంలో మునిగితేలడానికి అందరూ సిద్ధమైపోతారు. కానీ, ఈసారి పండుగ సీజన్ ప్రారంభ సేల్స్ ఊహించిన స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయాయి.
ప్రసిద్ధ ఈ-కామర్స్ రీసెర్చ్ సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 7 నుండి 10 మధ్య జరిగిన మొదటి విడత సేల్స్‌లో రూ. 29,800 కోట్ల నుండి రూ. 30,900 కోట్ల మేర అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ. 33,200 కోట్ల సేల్స్‌తో పోల్చి చూస్తే ఈసారి అమ్మకాలు 7% నుండి 10% వరకు తగ్గడం విశేషం.
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో వాడే మెమరీ చిప్‌లు, విడిభాగాల ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై పడి ప్రియం కావడంతో వినియోగదారులు కొంత వెనకడుగు వేశారు.
గతేడాది సేల్స్ ప్రారంభ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అందించిన జీఎస్టీ ఉపశమనం కస్టమర్లలో భారీ ఉత్సాహాన్ని నింపింది. కానీ ఈసారి అలాంటి ప్రత్యేక ఊరటలు ఏవీ లేకపోవడం కొనుగోలు సెంటిమెంట్‌ను తగ్గించింది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ట్రెండ్ ఈసారి బాగా తగ్గింది. గతంలో మొత్తం అమ్మకాల్లో మొబైల్స్ వాటా 35%గా ఉంటే, ఈసారి అది 30%కి పడిపోయింది.
స్మార్ట్‌ఫోన్ల సేల్స్ కాస్త నెమ్మదించినా.. భారతీయులు తమ పండుగ ఉత్సాహాన్ని మాత్రం ఏమాత్రం తగ్గించుకోలేదు. ఈసారి దృష్టి అంతా ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్, గృహోపకరణాల వైపు మళ్లింది. చిన్న నగరాలు, పట్టణాల నుంచి ఫ్యాషన్ దుస్తులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల కొనుగోళ్లు ఏకంగా 22% నుండి 25% వరకు పెరగడం విశేషం.
మొదటి 4 రోజుల సేల్స్ కొంత మందగించినప్పటికీ, ఈ పండుగ సేల్ మేళా దాదాపు 11 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. రాబోయే రోజుల్లో పండుగ వాతావరణం మరింత పుంజుకోవడం, ప్రత్యేక ఆఫర్లు ఊపందుకోవడంతో ఈ పండుగ సీజన్ ముగిసేసరికి మొత్తం ఈ-కామర్స్ అమ్మకాలు 25% నుండి 30% మేర వృద్ధిని నమోదు చేస్తాయని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




