Flipkart : స్విగ్గీ, జొమాటోలకు దిమ్మతిరిగే షాక్.. ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

Flipkart : భారత ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా వెలుగుగొందుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

CR Reddy
Published on: 23 Oct 2026 10:16 AM IST
Flipkart Food Delivery
X

Flipkart Food Delivery

Flipkart : భారత ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా వెలుగుగొందుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈట్-ఇన్ బై మినిట్స్ అనే సరికొత్త పేరుతో ఈ ఫుడ్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ అడుగులు వేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు షాపింగ్‌తో పాటు తమకు నచ్చిన బిర్యానీ, పిజ్జాలను నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఈ కొత్త సర్వీసులను వినియోగదారులకు అధికారికంగా అందించడానికి ముందే సంస్థ విస్తృతమైన పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో ఉన్న దాదాపు 8,000 మంది ఉద్యోగులతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ చేసే ప్రక్రియ, పేమెంట్ సిస్టమ్, డెలివరీ వేగం వంటి అంశాలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ ముందస్తు పరీక్షలు చేపడుతున్నారు. ఈ అక్టోబర్ చివరి నాటికి లేదా ఏడాది ముగిసేలోగా దేశంలోని ఐదు నుంచి ఆరు ప్రధాన మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాలని భావిస్తున్నారు.

ప్రత్యేక యాప్ లేకుండా ఒకే ప్లాట్‌ఫామ్

వినియోగదారులు ఆహారం ఆర్ఢర్ చేసేందుకు ప్రత్యేకంగా మరో మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ప్రధాన యాప్‌లోనే ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేక టాబ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల కస్టమర్లకు దుస్తులు, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడంతో పాటు ఆహారాన్ని కూడా ఒకే చోట సులభంగా ఆర్డర్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇది యూజర్లకు చాలా సౌకర్యవంతంగా మారనుంది.

ఓఎన్‌డీసీ భాగస్వామ్యం

ఫ్లిప్‌కార్ట్ తన ఫుడ్ డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్న ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీని ద్వారా స్థానిక రెస్టారెంట్లు, ప్రముఖ ఫుడ్ బ్రాండ్లు ప్లాట్‌ఫామ్‌పైకి రానున్నాయి. ఆర్డర్ చేసిన ఆహారాన్ని చాలా వేగంగా కస్టమర్లకు అందించడానికి ఫ్లిప్‌కార్ట్ తమ సొంత లాజిస్టిక్స్ విభాగమైన ఈకార్ట్ సహాయం తీసుకోనుంది. సాధారణ పార్శిల్స్ లాగా కాకుండా వేడి ఆహారాన్ని త్వరితగతిన చేర్చడానికి ప్రత్యేకంగా డెలివరీ టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

వినియోగదారులకు లాభాలు

ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో వేస్తున్న భారీ డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫామ్ ఫీజులతో సతమతమవుతున్న వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ రాక పెద్ద ఊరట కానుంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, పోటీ ధరలను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొని ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.