Google AI TV: గూగుల్ నుంచి కొత్త ఏఐ ఛానల్.. మీరే హీరోగా సినిమాలు కూడా..!

Google AI TV Channel: గూగుల్ కొత్త AI టీవీ ఛానల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. యూట్యూబ్ వాచ్ హిస్టరీ, వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా AI ప్రత్యేక షోలు రూపొందిస్తుంది. అంతేకాదు, మీ ఫొటోతో డిజిటల్ అవతార్ తయారు చేసి, సినిమాల్లో మిమ్మల్నే హీరోగా చూపించే అవకాశం ఉంది.

Venkat
Updated on: 24 Nov 2026 6:20 PM IST
Google AI TV
X

Google AI TV: గూగుల్ నుంచి కొత్త ఏఐ ఛానల్.. మీరే హీరోగా సినిమాలు కూడా..!

Google AI TV Channel: టీవీలో వచ్చే సినిమాల్లో మీరే హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది? మీ ఫొటోతో డిజిటల్ అవతార్ తయారు చేసి, మీకు నచ్చిన రొమాన్స్, యాక్షన్, కామెడీ షోల్లో ప్రధాన పాత్రలో చూపించే సరికొత్త AI టెక్నాలజీని గూగుల్ అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించిన పేటెంట్ వివరాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.

టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త మార్పులకు కారణమవుతోంది. ఇప్పటికే AI సాయంతో ఫొటోలు, వీడియోలు, సినిమాలు రూపొందిస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ మరో అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన టీవీ ఛానల్ అందించే ఆలోచనలో ఉంది.

ఇటీవల వెలుగులోకి వచ్చిన గూగుల్ పేటెంట్ ప్రకారం.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 24 గంటల పాటు ప్రసారమయ్యే పర్సనలైజ్డ్ AI టీవీ ఛానల్‌ను రూపొందించే విధానాన్ని కంపెనీ ప్రతిపాదించింది.

పేటెంట్ పర్యవేక్షణ వెబ్‌సైట్ పేటెట్లీస్ ఈ వివరాలను మొదట వెల్లడించగా, 404 మీడియా కూడా దీనిపై కథనం ప్రచురించింది. ఈ పేటెంట్ పేరు 'Creating a custom channel of videos according to user preferences'. గూగుల్ LLC 2025 మే 13న ఈ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ 2026 నవంబర్ 19న US 2026/0370899 A1 నంబర్‌తో దీనిని ప్రచురించింది.

మీకు నచ్చిన షోలనే..

ప్రస్తుతం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే రూపొందించిన వీడియోలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూస్తున్నాం. కానీ గూగుల్ ప్రతిపాదిస్తున్న కొత్త విధానంలో AI మీ అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త వీడియోలను తయారు చేస్తుంది.

ఈ ఛానల్‌కు 'My Channel' లేదా వినియోగదారుడి పేరుతో ప్రత్యేకమైన పేరు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీకు క్రైమ్ కామెడీ, రొమాంటిక్ కామెడీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే.. వాటికి అనుగుణంగా AI కొత్త షోలను రూపొందిస్తుంది.

మీరే హీరో.. మీ ఫొటోతో AI అవతార్!

ఈ టెక్నాలజీలో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం మరొకటి ఉంది. అదే AI అవతార్!

మీ ఫొటోను ఉపయోగించి AI మీ డిజిటల్ అవతార్‌ను రూపొందించగలదు. అంతేకాదు, మీ గొంతును పోలిన వాయిస్‌ను ఉపయోగించి వీడియోల్లో మీ పాత్రకు డైలాగులు కూడా చెప్పించే అవకాశం ఉంది.

అంటే మీరు చూసే AI షోలో మీరే ప్రధాన పాత్రధారిగా కనిపించవచ్చు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సన్నివేశాల్లోనూ మీ డిజిటల్ రూపాన్ని చూడొచ్చు.

క్రికెట్ మ్యాచ్‌లోనూ మీరే ప్రత్యేక అతిథి..!

భారతీయ క్రికెట్ అభిమానులకు నచ్చే ఉదాహరణను కూడా ఈ పేటెంట్‌లో ప్రస్తావించారు.

మీరు ఇటీవల క్రికెట్ మ్యాచ్‌లు లేదా మీకు ఇష్టమైన క్రికెటర్ హైలైట్స్ చూస్తే.. AI మీ ఆసక్తిని గుర్తిస్తుంది. ఆ అభిరుచికి అనుగుణంగా క్రికెట్ వరల్డ్ కప్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను రూపొందించవచ్చు.

అందులో మీ AI అవతార్ స్టేడియంలో కూర్చొని టీమిండియాను ఉత్సాహపరుస్తున్నట్లు చూపించవచ్చు. అంతేకాదు, మీకు ఇష్టమైన క్రికెటర్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లు కూడా వీడియో రూపొందించే అవకాశం ఉంటుంది.

మీ అభిరుచులకు తగ్గట్టుగా ప్రకటనలు..

గూగుల్‌కు ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. అందుకే ఈ AI టీవీ ఛానల్ ఆలోచనలో యాడ్స్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ పేటెంట్‌లో యాడ్ స్టిచర్ అనే టూల్‌తో కూడిన అడ్వర్టైజింగ్ సర్వర్ గురించి ప్రస్తావించారు. ఇది వినియోగదారుడి అభిరుచులకు అనుగుణంగా AI రూపొందించిన షోలలో ప్రకటనలను ఆటోమేటిక్‌గా చేర్చగలదు.

దీంతో ఒకే షో చూసే ఇద్దరు వ్యక్తులకు వారి ఆసక్తులకు తగ్గట్టుగా వేర్వేరు ప్రకటనలు కనిపించవచ్చు.

త్వరలోనే అందుబాటులోకి వస్తుందా?

AI టెక్నాలజీతో వినోద రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మెటా కూడా AI ఆధారిత వ్యక్తిగతీకరించిన ప్రకటనలపై దృష్టి పెట్టింది.

అయితే గూగుల్ పేటెంట్ దాఖలు చేసిందని వెంటనే ఈ సేవ అందుబాటులోకి వస్తుందని భావించకూడదు. ఇది ప్రస్తుతం పేటెంట్‌లో ప్రతిపాదించిన ఆలోచన మాత్రమే. దీన్ని గూగుల్ ఎప్పుడు అమలు చేస్తుంది? ఎలాంటి రూపంలో వినియోగదారులకు అందిస్తుంది? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భవిష్యత్తులో టీవీలో మీకు నచ్చిన కథ మాత్రమే కాదు.. ఆ కథలో హీరో కూడా మీరే అయ్యే రోజులు రావచ్చన్నమాట!

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.