Google Gemini: ఆలోచన మార్చుకోండి గురూ...గూగుల్‌ జెమినీ పట్టేస్తుంది

Google Gemini: డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త దారుల్లో ప్రయాణిస్తోంది. ఇప్పుడు కృత్రిమ మేధ కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిని దాటి, మనిషి ప్రాణాలను కాపాడే దిశగా అడుగులు వేస్తోంది.

Balachander
Published on: 8 April 2026 12:01 PM IST
Google Gemini
X

Google Gemini

Google Gemini:డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త దారుల్లో ప్రయాణిస్తోంది. ఇప్పుడు కృత్రిమ మేధ కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిని దాటి, మనిషి ప్రాణాలను కాపాడే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌ జెమినీ

జెమినీ చాట్‌బాట్‌లో హెల్ప్‌ ఈజ్‌ అవైలబుల్‌ అనే ఫీచర్‌ను రీడిజైన్ చేసి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా మార్చింది. ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశ్యం ప్రమాదకర ఆలోచనల్లో ఉన్న వ్యక్తిని సమయానికి రక్షించడం. ఈ కొత్త అప్‌డేట్ ప్రకారం, వినియోగదారుడు జెమినీతో చాట్ చేస్తున్నప్పుడు మానసిక ఒత్తిడి, నిరాశ లేదా ఆత్మహత్య ఆలోచనల వంటి సంకేతాలను వ్యక్తం చేస్తే, ఏఐ వెంటనే స్పందిస్తుంది. సాధారణ సమాధానం ఇవ్వడం కాదు, ఒక ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్‌ను స్క్రీన్‌పై చూపిస్తుంది. అందులో క్రైసిస్ హెల్ప్‌లైన్ నంబర్లు, టెక్స్ట్ మెసేజ్ సదుపాయం, నిపుణులతో నేరుగా మాట్లాడే అవకాశం వంటి కీలక ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫీచర్ సంభాషణ ముగిసే వరకు స్క్రీన్‌పై కొనసాగుతూ వినియోగదారుడిని సహాయం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంది.

ప్రపంచాన్ని కలిచివేసిన సంఘటన

గూగుల్‌ తాజా అప్డేట్‌ వెనుక ఓ గంభీరమైన సంఘటన ఉంది. 2025 అక్టోబర్‌లో అమెరికాలో 36 ఏళ్ల వ్యక్తి జోనాథన్ గవాలాస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రపంచాన్ని కలిచివేసింది. అతను వారాల పాటు ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడినట్టు, ఆ సంభాషణల్లో ఆత్మహత్యను ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూపించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు కాలిఫోర్నియా కోర్టులో నమోదై, ఏఐ బాధ్యతలపై పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత టెక్ కంపెనీలు తమ విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ మనుషుల మాదిరిగా భావోద్వేగాలు చూపించడం వల్ల, మానసికంగా బలహీనంగా ఉన్నవారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దాంతో గూగుల్ జెమినీని మరింత బాధ్యతాయుతంగా మార్చింది. ఇకపై జెమినీ వినియోగదారుడితో అనవసరంగా భావోద్వేగ సంబంధం పెంచుకోదు. అది కేవలం సహాయకుడిగా మాత్రమే వ్యవహరిస్తుంది.

అమెరికాలో అమలు

ప్రస్తుతం ఈ అప్‌డేట్ అమెరికా వంటి దేశాల్లో అమల్లోకి వచ్చింది. దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారత్‌లో కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారుల మానసిక స్థితిని అర్థం చేసుకునేలా జెమినీకి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ భవిష్యత్తు కేవలం టెక్నాలజీ మీదే ఆధారపడదు. అది సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు, కేవలం సమాచారం ఇవ్వడం సరిపోదు. సరైన సమయంలో సరైన సహాయం అందించడం అత్యంత కీలకం. గూగుల్‌ బ్లాగ్‌లో కూడా ఇదే విషయాన్ని కంపెనీ స్ఫష్టం చేసింది. “మా లక్ష్యం కేవలం సమాధానాలు ఇవ్వడం కాదు. అవసరమైనప్పుడు మానవ సహాయంతో ప్రజలను కలపడం” అని పేర్కొంది. టెక్నాలజీ, మానవ భావోద్వేగాల మధ్య సున్నితమైన సరిహద్దును గౌరవిస్తూ, ఈ కొత్త ఫీచర్ ఒక రక్షణ కవచంగా మారనుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story