Google Gemini Spark: గూగుల్ నుంచి సంచలనం.. మీరు నిద్రపోతున్నా మీ పనులు చేసే 'జెమినీ స్పార్క్' వచ్చేసింది..!
Google Gemini Spark: రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎంతగా మార్చబోతోందో చెప్పడానికి ఈ సరికొత్త ఆవిష్కరణ ఒక స్పష్టమైన నిదర్శనం.
Google Gemini Spark: గూగుల్ నుంచి సంచలనం.. మీరు నిద్రపోతున్నా మీ పనులు చేసే 'జెమినీ స్పార్క్' వచ్చేసింది..!
Google Gemini Spark: మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మన ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే జరిగిపోతే ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా ఇలాంటి ఊహకే ప్రాణం పోస్తూ గూగుల్ ఒక అద్భుతాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. మీ తరపున నిరంతరం శ్రమించే సరికొత్త ఏఐ ఏజెంట్ 'జెమినీ స్పార్క్' ఇప్పుడు భారత్‌లో లాంచ్ అయింది.
మామూలు ఏఐకి, దీనికి అసలు తేడా ఏంటి?
సాధారణ చాట్‌బాట్లకు మనం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెబుతాయి. మనం ప్రాంప్ట్ ఇచ్చే వరకు అవి సైలెంట్‌గా ఉండిపోతాయి. కానీ జెమినీ స్పార్క్ తీరే వేరు. ఇదొక 24/7 పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్‌లా మీ కోసం పనిచేస్తుంది. జెమినీ 3.6 ఫ్లాష్ మోడల్ సాంకేతికతతో పనిచేసే ఈ సరికొత్త ఏఐ.. మీ సూచనలను పక్కాగా గుర్తుపెట్టుకుని బ్యాక్‌గ్రౌండ్‌లో తన పని తాను చేసుకుపోతుంది.
ఇదంతా గూగుల్ అత్యంత సురక్షితమైన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రన్ అవుతుంది. దీనివల్ల మీరు ల్యాప్‌టాప్ మూసేసినా, మీ స్మార్ట్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా దీని పని మాత్రం ఆగదు. టాస్క్స్, స్కిల్స్, షెడ్యూల్స్ అనే మూడు ప్రధాన అంచెల్లో ఇది వర్క్‌ఫ్లోను మేనేజ్ చేస్తుంది. ఒకసారి మీరు దీనికి సరైన సూచనలు ఇస్తే చాలు, నిర్ణీత సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పనిని మొదలుపెట్టి పక్కాగా పూర్తి చేస్తుంది.
మీ జీవితాన్ని సులభతరం చేసే అద్భుతమైన ఫీచర్లు..
గూగుల్ వర్క్‌స్పేస్ యాప్స్ అయిన జీమెయిల్, గూగుల్ డాక్స్, షీట్స్, క్యాలెండర్ లాంటి వాటితో ఇది నేరుగా కనెక్ట్ అవుతుంది. ఇందుకు ఎలాంటి అదనపు సెటప్ అవసరం లేదు. ఉదాహరణకు మీకు రోజూ వచ్చే వేలాది ఈమెయిల్స్ చదివి ముఖ్యమైన వాటిని కేటగిరీలుగా విడదీస్తుంది. మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ గమనించి గూగుల్ షీట్స్‌లో ఒక స్పష్టమైన ఇటినెరరీ (ప్రయాణ ప్రణాళిక) తయారు చేస్తుంది. క్యాలెండర్‌లో మీ ముఖ్యమైన మీటింగ్స్ షెడ్యూల్ చేస్తుంది.
వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లకు కూడా ఇది ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. మీ గత ఈమెయిల్స్ రాసే విధానాన్ని ఇది అంచనా వేసుకుని, అచ్చం మీ శైలిలోనే కస్టమర్ల ప్రశ్నలకు రిప్లైలు డ్రాఫ్ట్ చేస్తుంది. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్ల ధరలు పెరిగితే వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఒకవేళ ఫ్రీ ట్రయల్స్ ముగిసిపోతుంటే.. ఆయా యాప్స్ క్యాన్సిలేషన్ ఈమెయిల్స్ కూడా ముందే డ్రాఫ్ట్ చేసి మీ అప్రూవల్ కోసం ఉంచుతుంది. మీటింగ్ డాక్యుమెంట్స్ చదివి పాయింట్స్ రాసిపెట్టడం, వీకెండ్ ఈవెంట్స్ వెతికి చెప్పడం లాంటి ఎన్నో పనులను ఇది చిటికెలో చేస్తుంది.
భద్రత విషయంలో రాజీ లేదు.. అంతా మీ కంట్రోల్‌లోనే..!
ఏఐ మన పర్సనల్ ఈమెయిల్స్ అంతా చదివేస్తుందనే ఆందోళన కలగడం సహజం. గూగుల్ దీనికి స్పష్టమైన హామీ ఇస్తోంది. జెమినీ స్పార్క్ కంట్రోల్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఏయే గూగుల్ యాప్స్‌కు యాక్సెస్ ఇవ్వాలనేది మీరే స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. ఇచ్చిన పర్మిషన్లు ఎప్పుడైనా రద్దు చేసే సదుపాయం కూడా ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడం, ఇతరులకు మీ తరపున అధికారిక ఈమెయిల్స్ పంపడం లాంటి కీలక వ్యవహారాల్లో ఇది తన సొంత నిర్ణయాలు తీసుకోదు. కచ్చితంగా మీ అనుమతి తీసుకున్న తర్వాతే ముందడుగు వేస్తుంది.
ఇండియాలో ఎవరికి అందుబాటులో ఉంటుంది..?
ఇంతటి అత్యాధునికమైన ఏఐ ఏజెంట్ ఫీచర్ ఉచితంగా దొరకదు. ఇండియాలో నెలకు రూ. 1,950 చెల్లించే గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రైబర్లతో పాటు ఏఐ అల్ట్రా యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది. రాబోయే కొద్ది వారాల్లో దశలవారీగా అర్హులైన యూజర్లందరికీ ఈ సేవలు చేరువవుతాయి. ఉచితంగా వాడే సాధారణ జెమినీ అకౌంట్లకు దీన్ని ఎప్పుడు తీసుకొస్తారనే దానిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ప్రశ్నలకు బదులిచ్చే స్థాయి నుంచి ఏకంగా ఒక అసిస్టెంట్‌లా పనులు చేసే స్థాయికి ఏఐ ఎదగడం నిజంగా టెక్నాలజీ రంగంలో పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు.
డిజిటల్ పనుల భారాన్ని తగ్గించుకోవాలనుకునే నిపుణులు, వ్యాపారవేత్తలకు జెమినీ స్పార్క్ ఒక వరంగా మారనుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎంతగా మార్చబోతోందో చెప్పడానికి ఈ సరికొత్త ఆవిష్కరణ ఒక స్పష్టమైన నిదర్శనం.




