Tech: గూగుల్ పిక్సెల్ 10 ఫోన్లకు సరికొత్త ఫీచర్.. AI విడ్జెట్లు, ఇంకా మరెన్నో.!

Excerpt: గూగుల్ నవంబర్ 10న ప్రారంభించిన నవంబర్ 2026 పిక్సెల్ డ్రాప్‌లో పిక్సెల్ 10 ఫోన్లకు Gemini ఇంటెలిజెన్స్, మనం చెప్పినట్లుగా AI తయారుచేసే కస్టమ్ విడ్జెట్లు, పొడవైన సంభాషణల సమ్మరీలు అందుబాటులోకి రాగా, ఈ ఫీచర్లు దశలవారీగా సపోర్టెడ్ ఫోన్లకు చేరనున్నాయి.

Ravi
By Ravi
Published on: 11 Nov 2026 5:55 PM IST
Tech
X

Tech: గూగుల్ పిక్సెల్ 10 ఫోన్లకు సరికొత్త ఫీచర్.. AI విడ్జెట్లు, ఇంకా మరెన్నో.!

Tech: గూగుల్ నవంబర్ 2026 పిక్సెల్ డ్రాప్‌ను నవంబర్ 10న ప్రకటించింది. ఈసారి ప్రధాన ఆకర్షణ ‘Gemini ఇంటెలిజెన్స్'. ఇంతకు ముందు పిక్సెల్ 11 సిరీస్‌కే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు పిక్సెల్ 10 ఫోన్లకు వస్తోంది. దీనితో పాటు మనకు కావాల్సిన విడ్జెట్లను AIతో తయారు చేసుకునే కస్టమ్ విడ్జెట్లు, పొడవైన సంభాషణలను క్లుప్తంగా చెప్పే సమ్మరీలు, పిక్సెల్ టాగ్ ట్రాకర్ వంటి కొత్త ఫీచర్లు ఈ డ్రాప్‌లో ఉన్నాయి.

Gemini ఇంటెలిజెన్స్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫోన్లకు వస్తుంది. పిక్సెల్ 10a ఈ జాబితాలో లేదు. ఈ ఫీచర్‌లో 'రాంబ్లర్' అనే వాయిస్ టైపింగ్ ఆప్షన్ ముఖ్యమైనది. మనం మాట్లాడేటప్పుడు వచ్చే అనవసరపు పదాలను (ఫిల్లర్ వర్డ్స్) తీసేసి, చక్కగా సరిచేసిన టెక్స్ట్‌గా మారుస్తుంది.

వ్యక్తిగతీకరించిన సూచనలు, యాప్‌లలో మల్టీ-స్టెప్ పనులు కూడా చేస్తుంది. ఉదాహరణకు ఉదయం కాఫీ ఆర్డర్ చేయడం, కిరాణా సరుకులు ఆర్డర్ చేయడం, రైడ్ బుక్ చేయడం, రిజర్వేషన్ల బుకింగ్ వంటివి.

కస్టమ్ విడ్జెట్ల ఫీచర్‌తో మనకు కావాల్సిన విడ్జెట్‌ను మాటల్లో వివరిస్తే చాలు, Gemini దాన్ని తయారుచేస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఖర్చుల ట్రాకర్, ఇష్టమైన జట్టు రంగుల్లో మ్యాచ్ డే విడ్జెట్, విమాన, రిజర్వేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా చూపించే ట్రావెల్ కౌంట్‌డౌన్ వంటివి చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ పిక్సెల్ 10, పిక్సెల్ 11 సిరీస్‌కు (10a మినహా) అందుబాటులో ఉంటుంది. త్వరలో పిక్సెల్ వాచ్ 4, వాచ్ 5కు కూడా వస్తుంది. పొడవైన సంభాషణల సమ్మరీలు కూడా ఈ డ్రాప్‌లో ఉన్నాయి. పిక్సెల్ 9 ఆ తర్వాతి ఫోన్లు పొడవైన మెసేజ్ చాట్లను నోటిఫికేషన్ లోనే క్లుప్తంగా చూపిస్తాయి.

ఇప్పుడు ఈ సమ్మరీలు హిందీతో పాటు జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, ట్రెడిషనల్ చైనీస్ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో Gemini మల్టీ-స్టెప్ టాస్క్‌లు కూడా వస్తున్నాయి. పిక్సెల్ 6a, ఆ తర్వాతి ఫోన్లకు కొత్త ఐకాన్ స్టైల్స్, పిక్సెల్ సెర్చ్ కూడా వస్తున్నాయి.

గూగుల్ తన మొట్టమొదటి బ్లూటూత్ ఐటెమ్ ట్రాకర్ 'పిక్సెల్ టాగ్'ను కూడా ప్రారంభించింది. అమెరికాలో నవంబర్ 11 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఒక్కోదాని ధర 29.99 డాలర్లు, నాలుగు టాగ్ల ప్యాక్ ధర 99.99 డాలర్లు. పిక్సెల్ 11 యూజర్లకు అప్‌గ్రేడెడ్ కాల్ స్క్రీన్ ఫీచర్ కూడా వస్తోంది.

ఇందులో Gemini అపరిచిత కాలర్లతో ముందుగా మాట్లాడి, వారు ఎందుకు ఫోన్ చేస్తున్నారో తెలుసుకుంటుంది. ఈ అప్‌డేట్‌లో 166 పిక్సెల్ భద్రతా లోపాల సవరణలు కూడా ఉన్నాయి. Gemini ఇంటెలిజెన్స్ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకూ విస్తరిస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్8, Z ఫ్లిప్8, S26 సిరీస్‌కు, మోటరోలా తొలి Gemini ఇంటెలిజెన్స్ ఫోన్ 'మోటరోలా సిగ్నేచర్ 27'కు కూడా ఈ ఫీచర్లు రానున్నాయి. ఈ అప్‌డేట్ విడతల వారీగా వస్తుంది. పిక్సెల్ యూజర్లు సెట్టింగ్స్‌లో సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లోకి వెళ్లి కొత్త అప్‌డేట్ వచ్చిందో లేదో చూసుకోవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.